హిమాలయాల ఒడిలో ఒదిగిన చిన్న రాష్ట్రం సిక్కిం. ఎటుచూసినా ఎత్తయిన కొండలే కనిపించే ఈ రాష్ట్రంలో పల్లె ప్రజలకు జడలబర్రెలే జీవనాధారం. అయితే వీటి సంఖ్య రోజురోజుకూ తగ్గుముఖం పడుతున్నది. ఇలాంటి సందర్భంలో వీటిని సంరక్షిస్తున్న వారి గురించి బయటి ప్రపంచానికి అంతగా తెలియదు. పసాంగ్ షేరింగ్ భూటియా అలాంటివారిలో ఒకరు. నలభై ఏండ్లుగా ఆయన జడలబర్రెల సంరక్షణకు పాటుపడుతున్నారు.
షేరింగ్ ప్రస్తుతం సిక్కిం పశు సంవర్ధక శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఉత్తర సిక్కింలోని మారుమూల పట్టణం లాచెన్‌లో పశుగణ సహాయకుడిగా 1987లో ఆయన ఉద్యోగ జీవితం మొదలుపెట్టారు. తనది సిక్కిం దక్షిణ భాగంలోని గ్యాంగ్‌టక్ నగరం అయినప్పటికీ, ఉత్తర సిక్కిం పల్లె ప్రజలతో అనుబంధం పెంచుకున్నారు. అక్కడి పల్లెటూరి ఆర్థిక వ్యవస్థకు కీలకమైన జడలబర్రెల సంరక్షణ దిశగా షేరింగ్ మొదటగా ప్రజలు వాటిని ఎలా పెంచుతున్నారో క్షుణ్నంగా పరిశీలించారు.
హిమాలయ పర్వత ప్రాంతంలో రవాణా, విద్యుత్ సౌకర్యాలు అంతగా ఉండవు. వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది. ఈ సవాళ్లు షేరింగ్ సంకల్పాన్ని అడ్డుకోలేకపోయాయి. జడలబర్రెల సంరక్షణ ప్రయత్నంలో ఆయన కొండల్లో కాలి నడకన వెళ్లడం అలవాటు చేసుకున్నారు. ఇంత చేసేది స్థానికుల ఆదాయం పెంచడం కోసమే. అయితే, జడలబర్రెల పెంపకం చాలా కఠినంగా ఉంటుంది. ఫలితంగా సిక్కిం ప్రజల జీవితాల్లో భాగమైన జడలబర్రెల సంరక్షణ క్రమంగా కనుమరుగయ్యే పరిస్థితికి చేరుకుంది. ఇది షేరింగ్‌ను కలచివేసింది. దీంతో ఆయన తన విధులను ఎక్కువసేపు నిర్వర్తించాలని నిర్ణయించుకున్నారు. వాటి సంరక్షణలో ఆధునిక పద్ధతులు ప్రవేశపెట్టడానికి ప్రయత్నించారు. జడలబర్రెల పాలు, వాటి ఊలు, ఇతర ఉత్పత్తులను పట్టణ మార్కెట్లకు చేరవేయాలని నిర్ణయించుకున్నారు.
ఈ ప్రయత్నాలు ఫలితాలను ఇస్తున్నాయి. షేరింగ్ ఉద్యోగంలో చేరడానికి ముందు సిక్కింలో జడలబర్రెల సంఖ్య దాదాపు పదివేలు ఉండేది. తర్వాత అది నాలుగువేలకు తగ్గింది. ఆయన ప్రయత్నాల వల్ల ఇప్పుడది ఏడువేలకు పెరిగింది. ప్రస్తుతం సిక్కిం, లద్దాక్, అరుణాచల్‌ప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ర్టాల్లో జడలబర్రెల సంఖ్య సుమారు 58 వేలు. కాబట్టి, వీటిని కాపాడుకోవడం తక్షణ కర్తవ్యమని ఆయన పేర్కొంటున్నారు. లేకుంటే హిమాలయ రాష్ర్టాల్లో స్థానిక ఆర్థిక వ్యవస్థ, జీవవైవిధ్యం, పర్యావరణంపై ప్రతికూల ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు.