అతిపెద్ద పండును కాసే చెట్టు పనస. సుమారు 30 నుంచి 40 కిలోల బరువుండే పనసపండుని ఇంగ్లిష్లో జాక్ ఫ్రూట్, సంస్కృతంలో స్కంద ఫలం అంటారు. మనదేశంలో ‘కూజాచక్క’, ‘కూజా పాజమ్’ అనీ రెండు రకాల పనస జాతులు ఉన్నాయి. కూజాచక్క తొనలు చిన్నగా, అతి మధురంగా ఉంటాయి. కూజా పాజమ్ తొనలు పెద్దగా, తీపితోపాటు పీచు అధికంగా కలిగి ఉంటాయి.
మనదేశంలోనే కాకుండా వెస్టిండీస్, అమెరికాలోని ఫ్లోరిడా లాంటి ప్రాంతాల్లో కూడా పనసను వాణిజ్యపరంగా సాగుచేస్తున్నారు. వాతావరణాన్ని బట్టి ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమయంలో పక్వానికి వస్తాయి. పనసకాయలు 11 నుంచి 13 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, వియత్నాం దేశాల్లో పనస వంటలు ఎక్కువగా తింటారు. విందు భోజనాల్లో పనసకూరలు ఎక్కువగా వడ్డిస్తారు. పనస పొట్టుతో ఆవ పెట్టి ఊరగాయ కూడా పెట్టుకోవచ్చు.
పనసపండులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల అధిక రక్తపోటు ఉన్నవాళ్లకు ఇదెంతో ప్రయోజనకరం. పనసపండు జీర్ణశక్తిని మెరుగుపరచి, అజీర్తిని నివారిస్తుంది. అల్సర్లను తగ్గిస్తుంది. కాల్షియం, ఐరన్, సోడియం, పొటాషియం, ఫాస్పరస్, జింక్ వంటి అనేక ఖనిజాలకు నెలవైన పనసపండు మనకు ప్రకృతి ప్రసాదించిన వరం. సీజన్లో తప్పక ఆహారంలో చేర్చుకోండి.
ఎల్లప్పుడూ పచ్చని ఆకులతో, మంచి ఆకారంలో ఉండే ఈ చెట్టు.. ఇంట్లో ఉంటే వాస్తు దోషాలు తొలగిపోతాయంటారు. కాయలు కాండానికి అతికించినట్టుగా ఉంటాయి. పనసపండే కాదు చెట్టులోని అన్ని భాగాలూ మనకు ఉపయోగపడేవే. పనస చెక్కతో వీణలు, మద్దెల, చిన్న పడవలు, గృహోపకరణాలు తయారుచేస్తారు. పనస ఆకులతో విస్తర్లు కుడతారు. పండ్లను, ఆకులను పశువుల మేతగా వేస్తారు. పీవీ ఔషధ వనంలో మూడు పనస చెట్లు ఉన్నాయి.
-ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, పీవీ కూతురు