పనిచేసే చోట… విరామ సమయాల్లో పిచ్చాపాటి మాట్లాడుకోవడం (వాటర్ కూలర్ చాటింగ్) సహజమే. కాలానుగుణంగా పని సంస్కృతిలో కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వీటితోపాటే కొత్తకొత్త పదబంధాలూ పుట్టుకొస్తున్నాయి. వీటిలో మన వృత్తి జీవితానికి సంబంధించినవి కూడా ఉండొచ్చు. ఆ పదకోశాన్ని ఓసారి పరిశీలిద్దాం.
కొవిడ్ భయాలు దూరం కావడంతో అన్ని సంస్థలూ వర్క్ ఫ్రం హోం విధానానికి స్వస్తి పలుకుతున్నాయి. ఈ నిర్ణయాన్ని కొంతమంది ఉద్యోగులు స్వాగతించడం లేదు. అయితే, తప్పనిసరి కాబట్టి, ఆఫీసుకు వెళ్తున్నారు. ఐడెంటిటీ కార్డు (బ్యాడ్జ్) స్వైప్ చేసి.. సహోద్యోగులతో ముచ్చట్లు పెడుతూ, కాఫీ తాగుతూ కాలం గడిపేస్తున్నారు. పని మాత్రం చేయడం లేదు. ఈ ట్రెండ్‌కే ‘కాఫీ బ్యాడ్జింగ్’ అని పేరుపెట్టారు.
సంస్థ పట్ల అసంతృప్తిగా ఉన్న ఉద్యోగులు తమ అయిష్టాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా వెళ్లగక్కడాన్ని ‘లౌడ్ క్విటింగ్’ అంటారు. బయటికి కనిపించని లోపాలను యాజమాన్యం గుర్తించడానికి ఇదొక అవకాశం.
అసంతృప్తి ఉన్న ఉద్యోగులు ఆ విషయాన్ని బయటికి వెల్లడించకుండా.. పనిపట్ల ఆసక్తిని తగ్గించినప్పుడు ‘క్వయిట్ క్విటింగ్’ పద బంధాన్ని వాడుతున్నారు. ఇలాంటి వాళ్లు ఉద్యోగానికి రాజీనామా ఇవ్వరు. అలా అని,
ఉత్సాహంగానూ పనిచేయరు.
అత్యంత సమర్థులైన ఉద్యోగులు అంత ప్రాధాన్యం లేని బాధ్యతల్లో చిక్కుకుపోవడమే గ్రంపీ స్టేయింగ్. అయిష్టాన్ని బయటికి వెళ్లగక్కుతూ కూడా అదే సంస్థలో పనిచేయడంవీరి ప్రత్యేకత.
కార్పొరేట్ ప్రపంచంలో ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన పదం. ఒక సంస్థలో ఉద్యోగం చేస్తూనే.. అదనపు ఆదాయం కోసం మరో కొలువు చేయడమే మూన్ లైటింగ్.
ప్రైవేటు రంగంలో ఉద్యోగాలకు హామీ ఉండదు. ఏ క్షణంలో అయినా కత్తి పడొచ్చు. దీన్ని తప్పించుకునేందుకు ప్లాన్ బీ అంటూ ఉండాలి. ఆ రెండో ఆలోచననే కెరీర్ కుషనింగ్గా వ్యవహరిస్తున్నారు.
కార్పొరేట్ ఉద్యోగాల్లో శని, ఆదివారాలు సెలవులు. సోమవారం పనికి వెళ్లాల్సి ఉంటుంది. దీంతో రెండు రోజుల ఆనందం ఆవిరైపోతుంది. దీనివల్ల మిగిలిన రోజుల మీదా ప్రభావం పడుతుంది. దీనికి పరిష్కారంగా వచ్చిందే ‘బేర్ మినిమమ్ మండేస్’. అంటే.. సోమవారం నాడు పూర్తి స్థాయిలో కాకుండా.. కొద్దిపాటి పని చేయడమే.
ఈ పదబంధాన్ని టిక్ టాకర్స్ తొలిసారిగా ప్రయోగించారు. తక్కువ ప్రయత్నంతో జీవితాన్ని ఉద్యోగాన్నీ సమన్వయం చేసుకుంటూ ఎక్కువ జీతం సంపాదించే అవకాశం ఉన్న ఉద్యోగాలే లేజీ గర్ల్ జాబ్స్.
ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో అసంతృప్తి కారణంగా.. అనుభవం, అర్హతతో సంబంధంలేని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడమే రేజ్ అప్లయింగ్.
నవతరం ఉద్యోగులు ఒకే దగ్గర ఎక్కువ కాలంపాటు పనిచేయాలని అనుకోవడం లేదు. ఉద్యోగంలో సరికొత్త అనుభవాలు కోరుతున్నారు. నిరంతరం నేర్చుకోడానికి ఇష్టపడుతున్నారు. ఒకే సంస్థను అంటిపెట్టుకుని ఉండటం వారికి నచ్చదు. ఈ ట్రెండ్‌నే‘జాబ్ హాపింగ్’ అంటారు.