ఆదివాసీలు ఇప్ప చెట్టును పవిత్రమైనదిగా భావిస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్ప చెట్టు మీద వేటు వేయరు. ఈ చెట్టు జీవిత కాలం దాదాపు వందేండ్లు. సుమారు ఇరవై మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. బెరడు నిలువు పగుళ్లతో పొలుసులుగా ఉంటుంది. కొమ్మల చివర ఆకులు గుత్తులుగా ఏర్పడతాయి. చక్కటి ఆకుల అమరికలతో నీడనిస్తుంది. పూలు రాత్రుళ్లు రాలుతాయి. ఈ పూలు అనేక పక్షులకు, జంతువులకు ఆహారం. కాయలు రేగుకాయలా, కొంచెం కోలగా ఆకుపచ్చ రంగులో గుజ్జు కలిగి ఉంటాయి.
సతత హరిత అరణ్యాలలో ఇప్ప చెట్టు పెరుగుతుంది. పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, తెలంగాణ, మధ్యప్రదేశ్ మొదలైన రాష్ర్టాల అడవుల్లో ఇప్పచెట్లు కనిపిస్తాయి. ఆయా ప్రాంతాల్లో దీనిని మౌవా, హిప్పె, మధూక, మధుక అని పిలుస్తారు. భద్రాచలం అడవుల్లో ఇప్ప చెట్లు అధికం. శ్రీరామ నవమి నాడు భద్రాద్రి రామయ్యకు ఇప్పపూలను నివేదించే
సంప్రదాయం ఉంది. ఆ తర్వాత భక్తులకు వాటిని ప్రసాదంగా పంచడం ఆనవాయితీ.
ఆదివాసీలు ఇప్పపూలను సేకరించి, అనేక విధాలుగా వినియోగిస్తారు. ఇందులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. పూలను నీడన ఆరబెట్టి సంవత్సరకాలం పాటు నిలువ ఉంచుకోవచ్చు. ఇప్పపూలతో సారా తయారు చేస్తారు. ఆదివాసీ సంబురాలు, పెళ్లి సందర్భాల్లో ఇప్ప సారా తాగడం ఆచారం. ఇప్పపూలతో స్వీట్లు, అనేక రకాల ఆహార ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో ఇప్పపూల లడ్డూలు తయారవుతున్నాయి. ఈ లడ్డూలు తినడం వల్ల రక్తహీనత, నీరసం, మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.
ఇప్ప చెట్టు ఆకుల నుంచి తీసిన సహజ రంగుని పట్టు పరిశ్రమలో ఉపయోగిస్తారు. ఇప్ప గింజల నుంచి నూనె తీస్తారు. కీళ్ల నొప్పులు, చర్మ రోగాలకు ఈ నూనెతో మర్దనా చేస్తే బాగా పని చేస్తుంది. నూనె తీయగా మిగిలిన గింజల పిప్పిని మొక్కలకు ఎరువుగా వాడతారు. ఇప్ప నూనెని ఆలుగడ్డ, వేరు శనగ పంటలలో కాండం కుళ్లు తెగుళ్లను నివారించడానికి ఉపయోగిస్తారు. జూన్ నుంచి ఆగస్టు ఇప్పపూల సీజన్ కొనసాగుతుంది. పక్వానికి వచ్చి పండ్లు నేలరాలినప్పుడు ఆదివాసీలు, గ్రామీణులు వాటిని సేకరిస్తారు. వాటిని ఆదివాసీ సహకార సంఘాలు కొనుగోలు చేస్తాయి.
-ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, పీవీ కూతురు