వెలుగు రేఖల వారు తెలవారే తామొచ్చి ఎండ ముగ్గులు పెట్టడం మన ఇంట్లోనే కాదు… పెయింటింగుల్లోనూ జరుగుతుంది. పొద్దెక్కి భానుడు పొగడ పువ్వు ఛాయను కూడా గోడకు వేలాడే చిత్రాల్లో చూడొచ్చు. సాయం సంధ్యా కాంతుల్ని ఇప్పుడు ముంగిలితోపాటు గోడల మీదా ఆస్వాదించొచ్చు. అవునండీ… ‘సన్ సెట్ ఎల్ ఈ డీ లైట్ పెయింటింగ్స్’తో అది సాధ్యమే. చూస్తే cలా ఉండే ఇవి స్విచ్ ఆన్ చేయగానే వెలుగులీనుతాయి. అచ్చెరువొందించే ఈ చిత్తరువుల్లో పగలూ, మధ్యాహ్నం సాయంత్రాలతో పాటు రాత్రి అందాలను చూపేవీ వస్తున్నాయి.
గోడమీద పెయింటింగ్‌లు వేలాడదీసుకోవడం, గదుల్లోని టేబుల్ మీద వాటిని అలంకరించుకోవడం మనకు అలవాటే. ఒకసారి కొంటే తీసేసే దాకా అందులోని చిత్రం అలాగే ఉంటుంది. కానీ మారుతున్న ఇంటీరియర్ డిజైనింగ్‌తో ఇప్పుడు వాల్ పెయింటింగ్లూ చిత్రాలు చేస్తున్నాయి. బయటి ప్రకృతిని తలపిస్తూ, వాటిలో సూర్యోదయ సూర్యాస్తమయాలను చూడగలిగేలా రూపొందుతున్నాయి. ఇదంతా ఫ్రేమ్‌లో ఉండే ఎల్ఈడీ లైట్లు చేసే మాయాజాలమే.
ఈ తరహా ఫొటో ఫ్రేములు పెన్సిల్ స్కెచ్‌ను పోలి ఉంటాయి. వీటిలో ఇల్లు, రిసార్టు గదులను తలపించే బొమ్మలు కొన్నయితే, ఊళ్లు, ప్రకృతి ప్రదేశాలను చూపేవి మరికొన్ని. మామూలుగా ఉన్నప్పుడు కాగితం మీద బొమ్మ గీసినట్టు కనిపిస్తాయివి. కానీ ఈ ఫ్రేమ్ యూఎస్‌బీని పవర్‌కి అనుసంధానం చేస్తే ఇందులో ఎల్ఈడీలు రంగురంగుల్లో ఉండే అందమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తాయి. యూఎస్బీ వైరుకుండే ప్రత్యేక మీటల సాయంతో మనం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రాలను తలపించేలా మూడు రకాల మోడ్లు పెట్టుకోవచ్చు.
ఫ్రేమ్ కాంతిని కూడా పెంచి తగ్గించుకోవచ్చు. ఇక, నగరాలు, వీధులు, సీనరీల్లాంటివి ఉన్నప్పుడు పగలు నలుపు తెలుపుల్లో ఉండి… రాత్రి పూట రంగుల్లో వెలుగులీనేలా వీటిని రూపొందిస్తున్నారు. మనకు నచ్చిన దృశ్యాన్ని కావలసిన సైజులో ఫ్రేమ్‌లా చేసిచ్చేలా కస్టమైజబుల్ తరహావి కూడా వస్తున్నాయి. కావాలనుకున్నప్పుడు సూర్యోదయపు అనుభూతిని, నచ్చినప్పుడు సాయం సంధ్యను చూడాలనుకుంటే… ఎల్ఈడీ పెయింటింగుల్ని తెచ్చుకోవల్సిందే మరి!