‘అనుకోకుండా కలిశాం.. ఎంజాయ్ చేశాం.. నేనేం గుర్తుంచుకోను.. మళ్లీ కలవాలని కూడా కోరుకోవట్లేదు!! ఈ రిలేషన్ ఇక్కడితో సమాప్తం.. గుడ్ బై!!’.. అనగానే ‘ఓకే బేబీ బై..’ అని సమాధానం. నిన్నమొన్నటి వరకు చెట్టాపట్టాలేసుకొని తిరిగిన జంట విపరీత ప్రవర్తనకు మనకు మతిపోయినంత పనవుతుంది. అనుకోకుండా కలుసుకొని, అమాంతం దగ్గరై, అంతలోనే ఇంత తేలికగా దూరమైన ఆ ఇద్దరి గురించి మీరేం ఆలోచిస్తారు? ‘ఏంట్రా బాబు.. ఇలా మాట్లాడుతున్నారు. వీళ్లకేం ఫీలింగ్స్ లేవా? ఇప్పటి వరకూ ఎంతో ఎమోషన్‌గా కలిసే ఉన్నారు. ఇప్పుడేంటి ఇలా?’ అని షాక్‌కు గురవుతాం కదా! మీరు ఆందోళన చెంది, బుర్ర బద్దలు కొట్టుకోవాల్సినంత సీన్ ఏం లేదక్కడ?
వింతగాకలిసి, అంతలోనే విడిపోయే ఈ తరహా వ్యక్తులది ఫ్రెండ్షిప్ కాదు… రిలేషన్ షిప్ అంతకన్నా కాదు! మరైతే.. అదేంటి అంటారా? ‘నానోషిప్!!’- ఇదో రకమైన డేటింగ్. వీళ్లేం ఆలోచిస్తారంటే.. ‘జస్ట్ ఆ క్షణం!! వాళ్లకి ఎదురుపడే మనుషుల్ని కలవడం.. అక్కడికక్కడే బాండింగ్ పెంచుకోవడం.. వెళ్లేముందు అన్నీ వదిలేసి జాయ్‌ఫుల్‌గా బై చెప్పడం. No strings attached and No expectations of follow-up!! ఇదేదో కాస్త చిత్రంగానే ఉంది అనుకోకండి.. ఎందుకంటే.. ఇప్పుడిదో కొత్తట్రెండ్. రానున్న రోజుల్లో నానోషిప్దే ట్రెండింగ్ అంటున్నది ఈతరం.
ఈ రోజుల్లో డేటింగ్ ట్రెండ్ అనేది సాఫ్ట్‌వేర్‌లా తెగ అప్డేట్ అవుతున్నాయి. ఉన్నది అర్థమయ్యేలోపే నయా సాఫ్ట్వేర్ అప్డేట్ వస్తుంది. మళ్లీ దానిపై ఫోకస్ చేయాలి. డేటింగ్లోనూ అదే వైఖరి కనిపిస్తున్నది. తీరం దాటేలోపు తుఫాను మార్చుకున్న దిశల కన్నా ఎక్కువగా మానవ సంబంధాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రిలేషన్షిప్స్.. రిచ్యువేషన్షిప్స్.. టెక్ట్సేషన్షిప్స్.. ఇలా ఎన్నెన్నో వచ్చేస్తున్నాయ్. ఈ జోరులో నేటితరం నానోషిప్లో విహరిస్తున్నదని టిండర్స్ ఇయర్ ఇన్ స్వైప్-2024 నివేదిక తేల్చింది.
ఇందుకోసం 8,000 మంది సింగిల్స్, అదే సంఖ్యలో డేటింగ్ చేస్తున్న వ్యక్తులను పలకరించారు సర్వేకారులు. ఫైనల్‌గా ‘నానోషిప్” అనే కొత్త ధోరణి వెలుగులోకి వచ్చింది. ఏ పెళ్లిలోనో.. ప్రయాణంలోనో.. వీకెండ్ టూర్లోనో.. పబ్‌లోనో.. ఎదురయ్యే పరిచయాలు ఇలా పూసి, అలా పరిమళం పంచి, అంతలోనే వాడిపోతున్నాయని తేలింది.
ఒక గంటో, పూటో, మహా అయితే ఒకట్రెండు రోజులు జంటగా గడిపే డేటింగ్ ఇది. ఈ నానోషిప్ను కొందరు ‘పిదప కాలం పిదప బుద్ధులు’ అని ఏవగించుకుంటున్నారు. అదే సమయంలో సింగిల్స్ మాత్రం ఊరట పొందుతున్నారట. వాళ్లలో ఉన్న ఒంటరితనాన్ని పోగొట్టుకునేందుకు నానోషిప్స్ పైనే ఎక్కువగా ఆధారపడుతున్నారట. ఈ ఇన్స్టాంట్ ఫీలింగ్స్ నుంచి ఎదురయ్యే సంతోషమైనా, బాధ అయినా.. జీవితంపట్ల వారిలో ఓ పాజిటివ్ దృక్పథాన్ని అలవర్చుతున్నాయని జెన్ జీ అభిప్రాయపడుతున్నది.
మీరో సింగిల్.. పెళ్లికి వెళ్లారు. అక్కడంతా ఒకటే సందడి.. ఓ అమ్మాయి కనిపించింది. చూసీ చూడనట్టుగా ఒకసారి, ఐమూలగా చూస్తూ ఇంకోసారి, క్రీగంట చూస్తూ మరోసారి మిమ్మల్ని గమనిస్తే.. ఆ కాసేపు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? మాట్లాడకపోయినా.. కళ్లు పలకరించుకుంటాయి. చిరునవ్వులు ఎక్చ్సేంజ్ అవుతాయి. ఇంతలోనే ఆ పెళ్లితంతు ముగుస్తుంది. భోజనాలు అయిపోతాయి. ఎక్కడివాళ్లు అక్కడికివెళ్లిపోతారు. ఈ అమ్మాయి, ఆ అబ్బాయి కూడా బై అన్నట్టుగా చూపులు విసురుకొని ఎవరి దారిన వాళ్లు పోతారు.
ఆ డేటింగ్ ఓవర్. ఇదే నేటి తరానికి క్షణాల్లో కిక్ పంచుతున్న ‘నానోషిప్’గా మానసిక శాస్త్ర నిపుణుల విశ్లేషణ. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే.. మీరు మెట్రోలో ప్రయాణిస్తున్నారు. డోర్ పక్కనే మీరు.. అటుగా విండోవైపు మరొకరు. చూపులు కలుస్తాయంతే.. ఆ కాసేపు కళ్లు కళ్లు ప్లస్, వాళ్లు వీళ్లు మైనస్ అయిపోతారు! ఈ తరహా రిలేషన్కూ ఓ పేరుంది తెలుసా? అదే ‘ఐకాంటాక్ట్షిప్’. ఏదేమైనా నేటి సింగిల్స్.. సోల్మేట్స్ని వెతికే క్రమంలో ఇలా నానోషిప్స్ దాటుకొని వెళ్తున్నారు. మనిషి ఒంటరిగా ఉన్నప్పడు ‘క్రేవింగ్ కనెక్షన్స్’ అవసరం అవుతాయి. అలాంటప్పుడు చిన్నచిన్న ఆనందాలు దొరికేది నానోషిప్స్లోనే! కానీ, ఈ నానో రిలేషన్స్ ఎదుటివారిని నొప్పించనంత వరకే బాగుంటాయి!
2025 డేటింగ్ ట్రెండ్స్ టిండర్ నివేదిక ప్రకారం.. వచ్చే ఏడాదిలో మరికొన్ని డేటింగ్ ట్రెండ్స్ జెన్-జీకి పరిచయం కానున్నాయట. అందులో లౌడ్ లుకింగ్ (Loud looking) ఒకరకం. తమ అవసరాలను స్పష్టంగా చెప్పేసి.. జట్టుకట్టడం అన్నమాట. రెండోది కిస్-మెట్ (Kiss-met). ఇందులో అనుకోకుండా పరిచయమైనా, జీవితకాలం కలిసి ఉండే నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తారట.