చలనం జీవానికి సూచన. చురుకుదనం ఆరోగ్యపు లక్షణం. పోటీతత్వం ఉనికిని నిరూపించుకునే ప్రయత్నం. దారుఢ్యం సమర్థతను చాటే యత్నం. వీటన్నిటినీ కలగలిపేదే క్రీడ. అందుకే ప్రతి నాగరికతలోనూ క్రీడలు అభిన్నంగా ఉన్నాయి. వాటికోసం పోటీలు పెట్టడమూ, కొత్త కొత్త క్రీడలను కనుగొనడం అన్ని సంస్కృతుల్లోనూ కనిపిస్తుంది. ఒక గోదా… అందులో ఇద్దరు మనుషులు ఉంటే చాలు… పోటీ రసవత్తరంగా సాగిపోతుంది. అడుగుల్ని పరుగుపందెంగా మార్చుకుంటే చాలు… క్రీడా సంబరం మొదలైపోతుంది. అందుకే ప్రపంచమంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే కార్యక్రమంగా ఒలింపిక్స్‌ను గుర్తిస్తారు.
ఆ క్షణాలు వచ్చేస్తున్నాయి. జూలై 26 నుంచి ఫ్రాన్స్ రాజధాని నగరం పారిస్‌లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి. నిజానికి ఒలింపిక్స్‌లో మన ప్రయాణం ఏమంత గొప్పగా కనిపించదు. 1984 నుంచి 1992 వరకు ఒక్క పతకం కూడా గెలుచుకోని పరిస్థితి. అలాగని కొన్ని మెరుపులు లేకపోలేదు. మౌలిక వసతుల లేమి, ఆర్థిక అసమానతలు, ప్రభుత్వాల నిర్లక్ష్యం లాంటి ఎన్నో సవాళ్లను దాటి నిలిచి గెలిచిన క్షణాలున్నాయి. ఒలింపిక్స్‌తో 124 ఏళ్ల ప్రయాణం మనది.
గ్రీకులు సౌందర్య ఆరాధకులు. సౌందర్యం అంటే వాళ్ల దృష్టిలో అంగసౌష్టవం మాత్రమే కాదు. దేహదారుఢ్యం కూడా. కేవలం యుద్ధంలోనే వీరత్వం చూసే తత్వం కాదు, క్రీడల్లోనూ దాన్ని చాటాలనుకునే తపన వారిది. అందుకే తమ దేవతలను కొలిచేందుకు చేసే వేడుకలలో క్రీడలకు కూడా ముఖ్యమైన స్థానం ఉండేది. అలా ఓ నాలుగు ముఖ్యమైన క్రీడల పోటీలను నిర్వహించేవారు. వాటిలో ఒకటే ఒలింపిక్స్! జ్యూస్ అనే దేవతను ప్రసన్నం చేసుకునేందుకు ఒలింపియా అనే ప్రాంతంలో మొదలుపెట్టిన పోటీలివి.
జ్యూస్ కుమారుడైన హెర్క్యులస్, స్వయంగా ఈ పోటీలను ప్రారంభించాడని నమ్మకం. ఒలింపియా అన్న మాటే కాదు, ఈ రోజు మనం ఉపయోగిస్తున్న మరికొన్ని పదాలు… ఈ తొలి క్రీడల నుంచే వచ్చాయి. నాలుగేళ్లకు ఓసారి జరిగే ఈ పోటీలను ఒలింపియాడ్ అని పిలిచేవారు. అదే ఇప్పటి ప్రతిభా పరీక్షలకు కూడా ఉపయోగిస్తున్నారు. క్రీస్తు పూర్వం 776లో మొదలైన ఈ పోటీల్లో మొదట స్టేడ్ అనే ఒక పరుగుపందాన్ని మాత్రమే నిర్వహించేవారు. స్టేడ్ అంటే సుమారు 182 మీటర్ల దూరాన్ని పూర్తిచేయడం. ఈ పోటీని నిర్వహించే ప్రదేశానికి స్టేడియన్ అని పేరు. అదే క్రమంగా మన జీవితాల్లో భాగమైన స్టేడియం పదానికి దారితీసింది.
కొరైబొస్ అనే ఆటగాడు తొలి ఒలింపిక్ పోటీని గెలుచుకున్న వీరుడిగా గుర్తుండిపోతాడు. తనేమీ పరుగుపందాలలో ఆరితేరినవాడు కాదు. ఒక వంటవాడు మాత్రమే. ఇంతాచేసి అతనికేమీ బంగారు పతకాలు ఇవ్వలేదు. ఆలివ్ ఆకులతో చేసిన కిరీటం మాత్రమే అప్పటి ఒలింపిక్స్ విజేతలకు దక్కేది. కానీ దానిపట్ల ఎవరికీ అభ్యంతరం ఉండేది కాదు. ఎందుకంటే… విజేతగా సమాజంలో దొరికే గుర్తింపునే అతి పెద్ద బహుమతిగా వారు భావించేవారు. అందుకే మహా మహా వీరులు సైతం ఈ పోటీల్లో పాల్గొని తమ సత్తా చాటే ప్రయత్నం చేసేవారు. తమ పౌరుడు ఈ పోటీలో గెలిస్తే, అతని రాజ్యమంతా గర్వంగా ఉప్పొంగిపోయేది.
లియోనైడస్, మైలో లాంటి వీరులే కాకుండా అలెగ్జాండర్ I, నీరో లాంటి చక్రవర్తులు కూడా ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఒలింపిక్స్ మతపరమైన క్రతువులో భాగం కాబట్టి బలులు ఇవ్వడం, దేవతల పూజ, నృత్య ప్రదర్శనలు లాంటివన్నీ అందులో భాగంగానే ఉండేవి. ఈ పోటీలకు ఎంతగా ప్రాధాన్యత ఇచ్చేవారంటే… గ్రీకులో ఉన్న చిన్నరాజ్యాలన్నీ నిరంతరం కొట్టుకుంటున్నా… ఒలింపిక్స్ జరిగే సమయంలో శాంతి ఒప్పందాలను పాటించేవారు. ఈ స్ఫూర్తి ఆధునిక కాలంలో లేకపోవడం వల్లే మొదటి, రెండు ప్రపంచయుద్ధ సమయాల్లో మూడు ఒలింపిక్ పోటీలను రద్దు చేయాల్సి వచ్చింది.
నాటి ఒలింపిక్స్‌లో చాలా కొద్ది పోటీలను మాత్రమే నిర్వహించేవారు. పరుగుపందెం, మల్లయుద్ధం, లాంగ్‌జంప్, డిస్కస్ త్రో, జావెలిన్ త్రో, గుర్రపు రథాల పోటీ లాంటివే ఉండేవి. గ్రీక్ రాజ్యంలో పుట్టిన మగవారు మాత్రమే ఈ పోటీలకు అర్హులు. క్రమంగా గ్రీక్ మాట్లాడితే సరిపోతుందంటూ ఆ నిబంధన సడలించారు. కానీ మహిళలకు మాత్రం అవకాశం ఉండేది కాదు. పెళ్లయిన స్త్రీలు వాటిని చూసేందుకు కూడా అనుమతి లేదు. అయినా వాటిని ఆరాధించేవారికి కొదవ లేకుండేది. ఇలా దాదాపు ఏడు శతాబ్దాల పాటు సాగిన ఒలింపిక్స్ క్రీడలను, క్రీస్తు శకం 394లో… అప్పటి గ్రీక్ రాజ్యాన్ని పాలిస్తున్న రోమన్ చక్రవర్తి థియోడోసియస్ రద్దు చేశాడు. తనకు పరాయిదైన గ్రీక్ సంస్కృతికి ప్రతిబింబంగా ఈ క్రీడలను భావించడమే కారణం. ఇక ఆ తర్వాత వరదలు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు… నాటి ఒలింపియా ఆనవాళ్లను శిథిలాలుగా మార్చాయి. మళ్లీ ఆ స్ఫూర్తి తలెత్తేందుకు మరో 1,500 ఏళ్లు పట్టింది.
ఫ్రాన్స్‌కు చెందిన పియరీ డి కొబెర్టిన్ మంచి విద్యావేత్తగా పేరు సంపాదించాడు. స్కూళ్లలో చదువుతోపాటు క్రీడలకు కూడా ప్రాముఖ్యం ఇవ్వాలనీ, అలాంటి ప్రాధాన్యత ఇవ్వడం వల్లే బ్రిటిషర్లు మంచి పురోగతి సాధించారనీ విశ్వసించాడు… వాదించాడు! కానీ తను ఆశించినంత మార్పు రాకపోవడంతో క్రీడలను ప్రోత్సహించేందుకు మరో ఆలోచన చేశాడు. అదే ఒలింపిక్స్. తన లక్ష్యాన్ని ప్రచారం చేసేందుకు ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐఒసి)ని స్థాపించాడు. ఒకప్పటి ఒలింపిక్స్‌కు పునర్వైభవం కల్పించాలనే తన ఆలోచన అందరికీ నచ్చడంతో, 1896లో అదే గ్రీక్ దేశంలోని ఏథెన్స్లో మొదటి ఆధునిక ఒలింపిక్స్ జరిగాయి. 14 దేశాలు పాల్గొన్న ఈ పోటీల్లో టెన్నిస్, షూటింగ్, జిమ్నాస్టిక్స్ లాంటి సరికొత్త క్రీడలన్నీ ఉండటంతో మంచి స్పందనే వచ్చింది.
రెండో ఒలింపిక్స్ నుంచే ఒలింపిక్స్‌తో భారతీయుల అనుబంధం మొదలైంది. మన దేశంలో పుట్టిన బ్రిటిషర్ ‘నార్మన్ ప్రిచార్డ్’, 1900 ఒలింపిక్స్‌లో భారత్‌కి ప్రాతినిధ్యం వహించి రెండు పతకాలు సాధించాడు. అలా ఒలింపిక్ పతకం అందుకున్న తొలి ఆసియా దేశంగా భారత్ నిలిచింది. తర్వాత కాలంలో నార్మన్, గొప్ప హాలీవుడ్ నటుడిగా కూడా స్థిరపడటం మరో విశేషం. సరే! ఎంత ఇక్కడ పుట్టి పెరిగినా తను భారతీయుడు కాడు, అది మన విజయం కాదనే తోస్తుంది.
ఆ లోటు తీరేందుకు ఏకంగా 52 ఏళ్లు పట్టింది. చాలామందికి కె.డి.జాదవ్ అనే పేరు తెలియకపోవచ్చు. దేశ ప్రజలే కాదు, ప్రభుత్వాలు కూడా తనను విస్మరిస్తూనే వచ్చాయి. మనకు తొలి వ్యక్తిగత పతకం అందించిన క్రీడాకారుడు తను. 1952లో ఫిన్లాండులో జరిగిన ఒలింపిక్స్‌లో, జాదవ్ మల్లయుద్ధంలో కాంస్య పతకాన్ని అందించాడు. మల్లవీరుల కుటుంబంలో పుట్టిన ఆయన క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. స్వాతంత్య్రం వచ్చాక, అదే మువ్వన్నెల జెండాకు పతకాన్ని అందించాడు.
వ్యక్తిగత క్రీడల్లో మన ఆటగాళ్లు తొలి పతకాన్ని సాధించడానికి చాలా దశాబ్దాలే పట్టింది. ఆధునిక ఒలింపిక్స్ జరిగిన వందేళ్లలో (1896-1996) కేవలం రెండే రెండు వ్యక్తిగత పతకాలు లభించాయంటే… మన దైన్యం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. అదృష్టవశాత్తు ఆ అవమాన భారాన్ని తగ్గించే ప్రయత్నం హాకీతోనే సాధ్యమైంది. అదే నూరేళ్ల వ్యవధిలో ఏకంగా ఎనిమిది బంగారు పతకాలను అందుకుంది మన హాకీ జట్టు. మనతో జరిగే ఆటలో ఓ ప్రత్యర్థి జట్టు, మనకు వ్యతిరేకంగా ఒక్క గోల్‌కి మించి చేసేందుకే నాలుగు దశాబ్దాలు పట్టిందంటే… ఒలింపిక్స్‌లో హాకీని మనం ఏ స్థాయిలో ఆడుకున్నామో అర్థం చేసుకోవచ్చు.
ధ్యాన్‌చంద్ మాత్రమే కాదు ఉధమ్ సింగ్, రంగనాథన్, శంకర్ లక్ష్మణ్… లాంటి చారిత్రకమైన పేర్లెన్నో నాటి ప్రాభవానికి అలంబనగా వినిపిస్తాయి. అయితే రకరకాల కారణాల వల్ల ఆ ప్రాభవం తగ్గుతూ వచ్చింది. 1980తో హాకీ పతకాలు ఆగిపోయాయి. 1984 – 1996 పన్నెండేళ్ల పాటు మన దేశం ఎలాంటి పతకమూ లేకుండానే ఒలింపిక్స్‌కి వెళ్లి వచ్చింది. క్రమంగా పరిస్థితి మారింది. దేశంలో ఆటల పట్ల ఆసక్తి పెరగడం, ప్రపంచీకరణ వల్ల వస్తున్న నిధులు, క్రీడా సంస్థల ప్రోత్సాహం వల్ల… వ్యక్తిగత పోటీల్లోనూ పతకాల వేట మొదలైంది.
ఒక్కో ఏడాది మెరుగుపడుతూ 2020 ఒలింపిక్స్‌లో ఏకంగా ఏడు పతకాలను గెలుచుకుంది మన దేశం. మన దేశం ఇప్పటిదాకా గెలుచుకున్న పతకాలలో ఇవి ఐదో వంతు కావడం గమనార్హం! 1980 తర్వాత మళ్లీ హాకీలో పతకాన్ని గెలుచుకుంది కూడా 2020 ఒలింపిక్స్‌లోనే! ఈసారి కూడా మన క్రీడాకారులు మంచి ఫలితాలనే సాధిస్తారని దేశం యావత్తు ఎదురుచూస్తున్నది!
2024 ఒలింపిక్స్ ఘనంగా జరిపేందుకు ఫ్రాన్స్ సిద్ధంగా ఉంది. 1924 తర్వాత మళ్లీ వందేళ్లకు ఆ దేశానికి ఒలింపిక్స్‌ను నిర్వహించే అవకాశం రావడం విశేషం. ఇందుకు సుమారు 80 వేల కోట్ల రూపాయల ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. 32 క్రీడల్లో 329 ఈవెంట్లు జరగనున్నాయి. వీటిలో పతకాలను గెలుచుకునేందుకు పదివేల మందికి పైగా క్రీడాకారులు పోటీ పడుతున్నారు. ఈ ఒలింపిక్స్ కోసం మన దేశం నుంచి 111 మంది ఉన్న జట్టు పారిస్ చేరుకోనుంది. నీరజ్ చోప్రా, పారుల్ చౌదరి, పీవీ సింధు, లక్ష్యసేన్, నిఖత్ జరీన్, ఆకుల శ్రీజ, వినేష్ ఫోగట్ వంటి హేమాహేమీలు గత ఒలింపిక్స్‌ను మించిన పతకాలు తెస్తారని ఆశిస్తున్నారు.
గెలుపు ఓటములకు అతీతంగా ప్రతీ ఒలింపిక్స్‌నూ అభిమానించే మనం వాటిని నిర్వహించేది ఎప్పుడు? అన్న అనుమానం రావడం సహజం. 2028 ఒలింపిక్స్ కాలిఫోర్నియాలో, 2032లో జరిగేవి ఆస్ట్రేలియాలో నిర్వహించనున్నట్టు ఇప్పటికే స్పష్టమైంది. మన దేశం 2036 ఒలింపిక్స్‌ను నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నది. ఒకప్పుడంటే ఒలింపిక్ కమిటీ సభ్యుల ఓటింగ్ ద్వారా ఆతిథ్య దేశాలను నిర్ణయించేవారు. కానీ ఇప్పుడలా కాదు. వేర్వేరు అంచెలలో, ఒలింపిక్ కమిటీల ముందు తమ లక్ష్యాలను, సన్నద్ధతను, వనరులను నిరూపించుకుంటేనే ఆతిథ్యానికి అవకాశం దక్కుతుంది. ఇదేమంత తేలికైన ప్రక్రియ కాకున్నా… 2036 పోటీలకు ఆతిథ్యం ఇవ్వడానికి మన దేశం చాలా గట్టిగానే ప్రయత్నం చేస్తున్నది.
ఒలింపిక్స్ కోసం అసాధారణంగా ఖర్చు పెట్టడం అంటే ఆకలి చావులను పరిహసించడమే అని కొందరు వాదించవచ్చు. వనరులు ఉన్న దేశాలే నెగ్గే ఈ పోటీలు క్రీడాస్ఫూర్తికి విరుద్ధమంటూ మరికొందరు ఎగతాళి చేయవచ్చు. కానీ లోకమంతా ఎదురుచూసే ఈ ఆటల పోటీని తక్కువగా అంచనా వేయలేం. ఒలింపిక్స్ జరిగే కొద్ది రోజులైనా ప్రతి ఇంట్లోనూ, క్రీడల పట్ల చర్చ జరుగుతుంది. ఆయా తరాలలో ఆసక్తి పెరుగుతుంది. మన దేశంలోనూ కొన్నాళ్లపాటు టెన్నిస్, హాకీ వంటి ఆటలకు మరింత ప్రచారం ఏర్పడటానికి ఒలింపిక్స్ పతకాలు కూడా కారణమయ్యాయి. ఈసారి కూడా అలాంటి మార్పు కనిపిస్తుందనీ, అది శాశ్వతంగా నిలిచిపోతుందనీ ఆశిద్దాం.
ఒక ఆటలో రాణించే వ్యక్తి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి అంటూ వేర్వేరు దశల్లో తనను నిరూపించుకుంటూ వెళ్తాడు. జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరచిన క్రీడాకారులకు అంతర్జాతీయ పోటీలకు అర్హత వస్తుంది. వాటిలో తన ప్రదర్శన ఆధారంగా వచ్చే ర్యాంకింగ్స్‌తో ఒలింపిక్స్‌కి అర్హత సాధిస్తాడు. కొన్ని క్రీడలకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ కోటా ఇస్తుంది. ఆ కోటాలో ఎవరిని పంపాలనేది సదరు దేశాలు నిర్ణయిస్తాయి. ఇక జట్లుగా ఆడే ఆటల్లో కొన్ని పోటీలను ఒలింపిక్స్‌కి అర్హతగా భావిస్తారు. ఒక దేశం నుంచి ఏదన్నా క్రీడకు ఆటగాళ్లను పంపేటప్పుడు, వారి మధ్య క్వాలిఫయింగ్ పోటీలు నిర్వహించడమూ సహజమే. ఈ ఎంపికల్లో జాతీయస్థాయి ఒలింపిక్ కమిటీలది, ఒకో ఆటకు చెందిన అత్యున్నత సంస్థలదీ ముఖ్యపాత్రగా ఉంటుంది. సహజంగానే ఇందులో ప్రతిభతో పాటుగా పక్షపాతానికీ, బంధుప్రీతికీ ఆస్కారం ఉంటుంది. ఇన్ని దశలు దాటినా ఓ వ్యక్తి ఒలింపిక్స్‌కి అర్హత నేరుగా సాధించడు. తన బరువు, వైద్య పరీక్షల ఆధారంగా కొన్ని పరిమితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంత చేసినా రెప్పపాటులో ఓడిపోయే అవకాశం ఎక్కువ. అందుకే ఏ ఒలింపిక్స్ పతకాన్నీ తీసుకురాకున్నా… నాలుగో స్థానంతో సరిపెట్టుకున్న పీటీ ఉష, మిల్కాసింగ్‌లను దేశం ఇప్పటికీ గర్వంగా తల్చుకుంటుంది.
నీరో చక్రవర్తి పేరు చరిత్రకు కొత్తేమీ కాదు. రోమ్ సామ్రాజ్యం తగలబడిపోతుంటే, ఫిడేలు వాయిస్తూ ఉండిపోయాడని మనం చదువుకున్నాం. ఆ నీరో క్రీ.శ 67లో జరిగిన ఒలింపిక్స్‌లో పాల్గొన్నాడు. సాక్షాత్తూ చక్రవర్తి బరిలోకి దిగితే, తనను విజేతగా పేర్కొనాల్సిందే కదా! అలా ఓ ఏడు
పోటీలలో విజేతగా నిలిచాడు నీరో. అసలు తన కోసమే కొన్ని పోటీలను నిర్వహించడం విశేషం. ఒలింపిక్స్ ఎరుగని వాయిద్య పోటీ, నాటక పోటీలు నిర్వహించేలా చేసి… విజేతగా ఆలివ్ కిరీటాల్ని ముసిముసిగా ధరించాడు నీరో. ఓ పందెంలో రథం నుంచి కింద పడిపోయినా, తననే విజేతగా ప్రకటించక తప్పలేదు. ఇంత దారుణంగా కాకపోయినా… ఒలింపిక్స్‌లో చాలా వివాదాలే నడిచాయి.
1936 ఒలింపిక్స్ ద్వారా తమ జాతి అత్యున్నతమైందని లోకానికి చాటాలనుకున్నాడు హిట్లర్. ఆయన లక్ష్యానికి అనుగుణంగా, ఒక యుద్ధానికి సిద్ధమైన రీతిలోనే జర్మన్ క్రీడాకారులు ఆ పోటీలకు సన్నద్ధమయ్యారు. ఆ ఏడాది జరిగిన ఒలింపిక్స్‌లో ఎక్కువ పతకాలు జర్మనీకే వచ్చాయి. కానీ హిట్లర్ ఊహించని ఓ అనూహ్య సంఘటన తన అహాన్ని దెబ్బతీసింది. అమెరికన్-ఆఫ్రికన్ అయిన జెస్సీ ఒవెన్స్, పరుగులో ఏకంగా నాలుగు పతకాలు గెలుచుకోవడమే కాకుండా… గంట వ్యవధిలో మూడు రికార్డులు బద్దలుకొట్టాడు. దాంతో నిరాశ చెందిన హిట్లర్, అతనితో చేతులు కలపకుండానే స్టేడియం నుంచి నిష్క్రమించినట్లు చెబుతారు.
1968లో మెక్సికోలో ఒలింపిక్స్ జరగనున్న సందర్భంగా, అక్కడి విద్యార్థులు రాజకీయ కారణాలతో నిరసన ప్రదర్శన తలపెట్టారు. దాన్ని ఎలాగైనా అణచివేయాలని సంకల్పించిన ప్రభుత్వం, ప్రదర్శనకారుల మీద తూటాల వర్షాన్ని కురిపించింది. 300-400 మంది విద్యార్థులు ఆ బులెట్లకు బలయ్యారని అంచనా!
తమ ఖైదీలను విడిపించుకునేందుకు పాలస్తీనా తీవ్రవాదులు 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న 11 మంది ఇజ్రాయెల్ క్రీడాకారులను బంధించే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో తీవ్రవాదులతో సహా, ఆ పదకొండు మందీ చనిపోయారు.
ఒలింపిక్స్‌ను నిర్వహించే దేశం పట్ల వ్యతిరేకతతో ఏదో ఒక సభ్య దేశం క్రీడలను బహిష్కరించడం ఆ పోటీల చరిత్రలో కొత్తేమీ కాదు. కానీ 1980 రష్యా ఒలింపిక్స్‌ని ఏకంగా 65 దేశాలు బాయ్‌కాట్ చేయడం విశేషం. నాటి రష్యన్ కమ్యూనిస్ట్ ప్రభుత్వం పట్ల విభేదాలతో ఆయా దేశాలు బాయ్‌కాట్ చేశాయి. అప్పట్లో ప్రపంచాన్ని రెండుగా విడదీసిన ప్రచ్ఛన్న యుద్ధపు (కోల్డ్ వార్) పరిస్థితులకు ఇది పరాకాష్ఠ.
ఇవే కాదు! 2008 బీజింగ్ ఒలింపిక్స్ పట్ల నిరసన ప్రదర్శనలు, వేర్వేరు ఒలింపిక్స్ పోటీల్లో అమెరికాలో నల్లజాతీయుల పట్ల విద్వేషానికి వ్యతిరేకంగా అసమ్మతి, వ్యక్తిగత దాడులు, డోపింగ్ వైఫల్యాలు…. ఇలా ప్రతి ఒలింపిక్స్‌లోనూ ఏదో ఒక వివాదం వినిపిస్తూనే ఉంటుంది. ఈసారైనా అవి ప్రశాంతంగా జరుగుతాయని ఆశిద్దాం.
చాలా సందర్భాల్లో ఆతిథ్య దేశానికే ఎక్కువ పతకాలు రావడాన్ని మనం గమనించవచ్చు. ఒలింపిక్స్ కోసం నిధులను ఒక్కసారిగా పెంచడం, అలవాటైన వాతావరణం, ప్రోత్సహించే ప్రేక్షకులు… లాంటి కారణాలన్నీ ఇందుకు దోహదపడతాయని చెబుతారు. పైగా ఒలింపిక్స్‌లో ఏదన్నా కొత్త ఆటను చేర్చే విషయంలో ఆతిథ్య దేశపు సూచన కీలకంగా మారుతుంది. సహజంగానే తమకు అనువైన క్రీడలను ఆయా దేశాలు ఎంచుకుని పతకాలు దండుకుంటాయి. ఇక చైనా, అమెరికా, రష్యా లాంటి కొన్ని దేశాలు ఎప్పుడూ పతకాల పట్టికలో ముందుండేందుకు కూడా స్పష్టమైన కారణాలు ఉన్నాయి.
జనాభా ఎక్కువ ఉన్నంత మాత్రాన ఒక దేశానికి అధిక పతకాలు వస్తాయని నిర్ధారించలేం. ఒక ఆటను ప్రొఫెషనల్‌గా ఆడాలంటే అందుకు విద్యావ్యవస్థ సహకరించాలి, ప్రభుత్వం తరఫు నుంచి ఆధునిక శిక్షణ రావాలి, క్రీడా సౌకర్యాలు అందుబాటులో ఉండాలి… వీటిని అందుబాటులోకి తెచ్చే రోడ్లు లాంటి మౌలిక వసతులు ఉండాలి. నిలదొక్కుకునే వరకు ఖర్చులు భరించేందుకు ఇంటివాళ్లో, స్పాన్సర్సో సిద్ధపడాలి. ఈ పరిస్థితులను మన దేశానికి అన్వయిస్తే, విషయం అర్థమవుతుంది. అన్నట్టు మన ఇంట్లో ఎవరన్నా ఒక పిల్లవాడు హాకీ ఆడతానని ఉబలాట పడితే మనం ఏం చేస్తాం! తను ఎదుగుతున్న కొద్దీ స్కూల్ నుంచి అధికారుల నుంచి ఎలాంటి సహకారం లభిస్తుంది? ఈ ఒక్క ప్రశ్న వేసుకుంటే స్పష్టమైన జవాబులే వినిపిస్తాయి.
– కె.ఎల్. సూర్య