భారతీయ ఇతిహాసాల్లో మానధనుడిగా పేరున్న ప్రతినాయక పాత్ర దుర్యోధనుడు. మహాభారత కథలో సుయోధనుడి పాత్ర రంగస్థలంపైనే కాదు వెండి తెరమీదా విశేషమైన ఆదరణ పొందింది. ఆ పాత్రలో ఎన్ని వైవిధ్యాలున్నా ప్రజల దృష్టిలో దుర్యోధనుడు విలన్ ఓన్లీ! కానీ, కేరళలో కొందరికి ఆయన హీరో! ఇంకా చెప్పాలంటే అచ్చంగా దేవుడిగా భావిస్తారు. ఆయనకు ఆలయం కట్టారు. సుయోధనుడి సోదరులనూ, సోదరి దుస్సలనూ దైవంగా భావిస్తారు. శకుని మామనూ ఆరాధిస్తారు. దుర్యోధనుడి బహిఃప్రాణం కర్ణుడు కూడా వీరికి దైవ సమానమే!
గుణము చేత మనిషి దేవుడు అవుతాడట. సద్గుణాలు సంతరించుకున్న కొన్ని పురాణ పాత్రలు దైవంగా పూజలు అందుకుంటున్నాయి. దుర్గుణాలు కలిగిన పాత్రలు దుర్మార్గానికి ప్రతీకగా నిలుస్తాయి. మహాభారతంలో అధర్మంగా అన్నదమ్ములను అడవిపాలు చేసి, అపఖ్యాతి మూటగట్టుకున్నాడు దుర్యోధనుడు. మహాభారతాన్ని పరికిస్తే ఆయన అత్యంత బలశాలి. బలరాముడి ప్రియశిష్యుడు. యుద్ధ విద్యల్లో ప్రతిభావంతుడు. కానీ, గుణం చేత అతణ్ని దుష్టుడిగా భావిస్తారు. కానీ, కేరళలోని కొల్లాం జిల్లా పెరువాజి పెరువురితి మలనాద గ్రామ ప్రజలు దుర్యోధనుడికి వీరాభిమానులు. అక్కడ ఆయన పేరిట ఓ ఆలయం ఉంది. నేటికీ, అందులో నిత్యపూజలు జరుగుతుంటాయి.
ఇక్కడ దుర్యోధనుడి కోవెల కొలువుదీరడం వెనుక ఓ ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉంది. మహాభారత కథలో మాయాజూదంలో ఓడిన పాండవులు పన్నెండేండ్లు వనవాసానికి వెళ్తారు. ఆ తర్వాత ఏడాదిపాటు అజ్ఞాతవాసం చేయాలి. అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు వారిని కనిపెడితే పాండవులు మరోసారి 12 ఏండ్లు వనవాసం చేయాల్సి ఉంటుంది. అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులను కనిపెట్టాలని దుర్యోధనుడి చారులు రంగంలోకి దిగుతారు. ఆయన కూడా స్వయంగా పాండవుల జాడ కనిపెట్టడానికి వెదుకులాట మొదలుపెడతాడు. హస్తిన వీడి దేశమంతా గాలిస్తూ ఉంటాడు. అలా అన్వేషిస్తూ కేరళ ప్రాంతంలోని మలనాదకు వస్తాడు. ఆ ప్రాంతాన్ని కురువ కులానికి చెందిన అపోప్పన్ పాలిస్తూ ఉంటాడు. మలనాదకు చేరుకున్న దుర్యోధనుడు ఆ రాత్రికి అపోప్పన్ ఇంట బస చేస్తాడు. ఓ వృద్ధురాలు నీరా (తాటిచెట్టు నుంచి తీసిన నీరు) ఇస్తుంది.
తన దాహార్తిని తీర్చిన వృద్ధురాలిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటాడు దుర్యోధనుడు. క్షత్రియుడైన దుర్యోధనుడు కుల వివక్ష చూపకుండా తమను ఆదరించడంపై మలనాద ప్రజలు ఆశ్చర్యపోతారు. దుర్యోధనుణ్ని అమితంగా గౌరవిస్తారు. భోజన సత్కారాలు చేస్తారు. వారి ఆతిథ్యానికి దుర్యోధనుడు ముగ్ధుడు అవుతాడు. ఆ రాత్రి అక్కడే కొండమీద ఉన్న శివాలయంలో జపం చేసి, మలనాద ప్రజలు సుఖసంతోషాలతో హాయిగా ఉండాలని కోరుకుంటాడు. మర్నాడు పాండవులను వెతకడానికి బయల్దేరే ముందు.. ‘నేను మళ్లీ శుక్రవారం వస్తాను. ఒకవేళ రాకపోతే.. నేను మరణించానని భావించండి. నాకు అంతిమ సంస్కారాలు చేయండి’ అని అక్కణ్నుంచి వెళ్లిపోతాడు. వారం గడిచినా దుర్యోధనుడు తిరిగి రాడు. ఆయన చనిపోయి ఉంటాడని భావించిన గ్రామస్తులు దుర్యోధనుడి పేరిట ఘనంగా అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. మలనాద వచ్చినప్పుడు దుర్యోధనుడు ధ్యానం చేసిన కొండపై ఆయనకు ఒక ఆలయం నిర్మించారట!
ఒక్క దుర్యోధనుడికే కాదు ఆయన తోడబుట్టిన 99 మంది సోదరులకు, స్నేహితుడు కర్ణుడికీ ఆలయాలు కట్టించారు. కొల్లాం జిల్లాలో నేటికీ వీటిని చూడొచ్చు. శకునికి కూడా ఆలయం నిర్మించారు ఇక్కడి ప్రజలు. సుయోధనుడి సోదరి దుస్సలకూ గుడి కట్టారు. అయితే, హైందవ సంప్రదాయంలో గర్భాలయంలో మూలవిరాట్ను ప్రతిష్ఠిస్తారు. కానీ, కౌరవుల ఆలయాల్లో విగ్రహాలు ఉండవు. కేవలం రాతి మంటపమే ఉంటుంది. అక్కడ కూర్చుని దుర్యోధనుడి పరివారాన్ని ఆరాధిస్తుంటారు మలనాద ప్రజలు. యుగం కిందట తమ తాతముత్తాతలకు దుర్యోధనుడు భూమి ఇచ్చాడని నమ్ముతారు. ఆయన అనుగ్రహంతో పొందిన ఆస్తికి సంబంధించిన పన్నును ఆలయానికి చెల్లిస్తూ ఉన్నారు.
కేరళలో కురవ సామాజిక వర్గానికి చెందిన వాళ్లు కౌరవులు తమ వాళ్లేనని విశ్వసిస్తారు. కురవ కులానికి పూర్వీకుడైన అపోప్పన్ను వీళ్లు ఆరాధిస్తారు. ఆయనతోపాటు కౌరవులను కూడా పూజిస్తారు. ద్వాపర యుగంలో దుర్యోధనుడు తిరిగి వస్తాడని చెప్పిన శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ రోజు మలనాద చుట్టుపక్కల ప్రజలు కూడా ఈ ఆలయానికి వచ్చి సుయోధనుడి అనుగ్రహం పొందుతుంటారు. మలయాళీ మీన మాసంలో (మార్చి-ఏప్రిల్) ఆలయ వార్షికోత్సవం నిర్వహిస్తారు. ఆ రోజు కేరళ నలుమూలల నుంచి లక్షలాదిగా భక్తులు మలనాద చేరుకుంటారు. సుయోధనుడి స్మారకాన్ని చూడముచ్చటగా అలంకరించి తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఆలయంలో అర్చకులు దుర్యోధనుడికి ప్రత్యేక పూజలు చేస్తారు.