హాకీ.. వందేళ్ల వేడుక జరుపుకొంటున్నది. ఓసారి వెనక్కి తిరిగి చూస్తే.. ఈ వందేళ్ల ప్రయాణంలో మిరుమిట్లు గొలిపే విజయాలెన్నో! ఆ వైభవాన్ని మసకబార్చిన అపజయాలు అన్ని! అజేయమైన జట్టుగా దశాబ్దాలపాటు ప్రత్యర్థులకు వణుకుపుట్టించిన అనుభవాలు ఉన్నట్టే.. గెలుపు అందని ద్రాక్షగా మారి, ఎన్నో పరాభవాలను మూటగట్టుకున్న చరిత్రా ఉంది. ఆటలో గెలుపు శాశ్వతం కాదు. ఓటమీ శాశ్వతం కాదు. అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని, తప్పులు దిద్దుకోవాలంతే. గత వైభవ దీప్తులతో భారత హాకీ కాంతులీనాలని ప్రభుత్వాలు, క్రీడాభిమానులు ఆకాంక్షిస్తున్న వేళ.. పది దశాబ్దాల ప్రయాణాన్ని మళ్లీ గుర్తుచేసుకుందాం… పదండి.
ఇప్పుడు దేశం యావత్తూ క్రికెట్ నామస్మరణ చేస్తున్నది. క్రికెటర్లను దేవుడిలా ఆరాధిస్తున్నది. కానీ, ఒకప్పుడు ఈ వైభవాన్ని హాకీ చవిచూసింది. స్వాతంత్య్రానంతరం ప్రపంచ వేదికపైన భారత్ ఖ్యాతిని ఇనుమడింప చేయడంలో.. ఈ క్రీడ నిర్వహించిన భూమిక తక్కువేమీ కాదు. భారత్-హాకీ అనేవి పర్యాయపదాలుగా నడిచాయి. మూడు దశాబ్దాలపాటు హాకీలో భారత దేశానికి స్వర్ణయుగం! భారతదేశం హాకీకి పర్యాయపదం! అలాగే గెలుపుకీ.. పర్యాయపదం!
కౌలాలంపూర్‌లో 1975లో జరిగిన వరల్డ్ కప్ హాకీ పోటీల్లో ఫైనల్ మ్యాచ్… అందులో భారత్, పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. పాకిస్తాన్ దూకుడుగా ఆడుతున్నది. భారత్ క్రీడాకారులు ఒత్తిడికి గురవుతున్నారు. ఇంకో ఎనిమిది నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా.. కెప్టెన్ అజిత్ పాల్ సింగ్ 1-1తో ఆటను సమం చేశాడు. ఆ తర్వాత మిగిలిన కొద్ది సమయంలో మరో గోల్ కొట్టి.. 2-1తో ప్రపంచకప్‌ను భారత్ తన ఖాతాలో వేసుకుంది. ఈ విజయం భారత హాకీ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయింది. హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ లేకుండా భారత్ సాధించిన అఖండ విజయం ఇది. మైదానంలో ఆడినవాళ్లకు అది డిజావూ మూవ్మెంట్. భారత కెప్టెన్ అజిత్ పాల్ సింగ్ మాట్లాడుతూ.. ‘ఆట ఆడుతున్న సమయంలో ధ్యాన్ చంద్ ఎరాను తిరిగి సృష్టిస్తున్నానన్న ఒక అరుదైన అనుభూతి నాలోకి ప్రవేశించింది. ధ్యాన్ చంద్ మ్యాజిక్ పనిచేసిందేమో. అప్పటి వరకూ 13 పోటీల్లో ఏ ఒక్కదానిలోనూ భారత్ ఓడిపోలేదు. ఇందులోనూ ఓడిపోకూడదని అనుకున్నాను’ అని చెప్పాడు. ‘ధ్యాన్ చంద్ మమ్మల్ని ముందుకు నడిపాడు. మేం ఆయన కోసం ఈ ఆట ఆడాం’ అని మిగిలిన ఆటగాళ్లు అన్నారు. ‘ఇది పాకిస్తాన్ జట్టుపై భారత జట్టు సాధించిన విజయం మాత్రమే కాదు, హాకీ ఆటలో భారత్ ఆధిపత్యానికి లభించిన కిరీటం’ అని ఆనాటి క్రీడాపండితులు ప్రశంసించారు.

కౌలాలంపూర్‌లో ప్రపంచ హాకీ పోటీలు గెలిచిన సందర్భంలో 48 ఏళ్ల క్రితం జరిగిన బెర్లిన్ ఒలింపిక్స్-1936 పోటీలను చాలామంది గుర్తు చేసుకున్నారు. జర్మనీ పైన 8-1 స్కోర్‌తో భారత్ విజయం సాధించింది. ధ్యాన్ చంద్ వరుసగా మూడు గోల్స్ కొట్టాడు. ‘ఇలాంటి పోటీల్లో ఓడిపోవడం జరిగితే.. అది నేను లేనప్పుడే జరగాలి’ అని ధ్యాన్ చంద్ గర్వంగా ప్రకటించాడు. ధ్యాన్ చంద్ వాడే హాకీ స్టిక్‌లో ఏదో ప్రత్యేకత ఉందని చాలామంది ప్రేక్షకులు భావించేవారు. గోల్ కొట్టే తీరు అసాధారణంగా ఉండేది. ఫీల్డ్‌లో ఎక్కడ నిలబడినా, లక్ష్యాన్ని గురిచేసుకుని బాల్ని అత్యంత లాఘవంగా ముందుకు నెట్టేవాడు! బాల్ని నియంత్రించడం, బలమైన షాట్స్ కొట్టడం, వ్యూహాత్మకంగా ముందుకు కదలడం.. అతని ప్రత్యేకత. ఈ ‘డ్రిబ్లింగ్’ నైపుణ్యాలు హాకీ క్రీడాకారులు, అభిమానులను ఆకట్టుకునేవి. వాటి గురించి చెప్పడం కాదు. ప్రత్యక్షంగా చూసి తీరాల్సిందే. అందుకే క్రీడాభిమానులు అతన్ని ‘హాకీ మాంత్రికుడు’ అని పిలుచుకుంటూ ఆరాధించేవాళ్లు.

ఆమ్స్టర్డామ్ ఒలింపిక్స్-1928లో భారత హాకీ జట్టు తొలిసారి బంగారు పతకం గెలుచుకుంది. అప్పుడు మొదలైన విజయ ప్రస్థానం మూడు దశాబ్దాలపాటు నిరాటంకంగా సాగింది. వరుసగా ఆరు ఒలింపిక్స్‌లలో బంగారు పతకాలు సాధించి ప్రపంచ హాకీలో భారత్ అజేయజట్టుగా కీర్తి గడించింది. భారత హాకీ జట్టు ధ్యాన్ చంద్, బల్బీర్ సింగ్ (సీనియర్), లెస్లీ క్లాడియస్ తదితరుల నేతృత్వంలో ప్రత్యర్థులను గడగడలాడించింది. ఒలింపిక్స్ పోటీల్లో ఇండియా 178 గోల్స్ సాధించి 7 గోల్స్ మాత్రమే చేజార్చుకుందంటే.. అది అసాధారణమైన ప్రతిభ. అందుకే ప్రపంచ హాకీ చరిత్రలో 1928 నుంచి 56 వరకు భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన జట్టుని అత్యంత ప్రతిభావంతమైన జట్టుగా క్రీడా నిపుణులు కీర్తిస్తుంటారు.

అరవయ్యో దశాబ్దంలో పరిస్థితులు మారాయి. భారత హాకీ జట్టు పరిస్థితి రోలర్ కాస్టర్ మాదిరిగా గెలుపోటములు కలగలిసి కొనసాగుతోంది. రోమ్ ఒలింపిక్స్-1960లో భారత్-పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఓడిపోయింది. అప్పటి వరకు వరుసగా ఆరుసార్లు బంగారు పతకం సాధించిన జట్టు! వెండి పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే, కొద్దికాలానికే తిరిగి తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. ఫీల్డ్ గోల్స్ నిబంధనలలో 1963లో చేసిన మార్పులను భారత్ వ్యతిరేకించింది. ఇది ఆటపైన తాత్కాలికంగా ప్రభావం చూపింది. టోక్యో ఒలింపిక్స్-1964లో భారత్ తిరిగి బంగారు పతకం కైవసం చేసుకున్నది. చరణ్‌జిత్ సింగ్ ఆ జట్టుకు నాయకత్వం వహించాడు. బ్యాంకాక్ ఏషియన్ గేమ్స్-1966లోనూ బంగారు పతకం దక్కింది. కానీ, రెండేళ్లకే జరిగిన మెక్సికో ఒలింపిక్స్-1968లో కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ దశకంలో చరణ్‌జిత్ సింగ్, బల్బీర్ సింగ్ (సీనియర్), ప్రీతిపాల్ సింగ్ భారత జట్టులో కీలకంగా రాణించారు. యూరోపియన్ దేశాల హాకీ జట్ల నుంచి భారత హాకీ జట్టు కొత్త వ్యూహాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఐరోపా ఆటగాళ్ల నుంచి మన హాకీ క్రీడాకారులకు సరికొత్త సవాళ్లు ఎదురయ్యాయి. 70వ దశకంలో క్రీడా మైదానాల్లో మార్పులు వచ్చాయి. అవి భారత జట్టుని బాగా ఇబ్బంది పెట్టాయి. ఆర్టిఫియల్ టర్ఫ్ (కృత్రిమంగా గడ్డితోచేసే మైదానం)పైన ఆడటానికి భారత ఆటగాళ్లు ఇబ్బంది పడేవాళ్లు. ఈ దశకంలోనే మనవాళ్లపై తీవ్రమైన ఒత్తిడి ప్రారంభమైంది.

మ్యూనిచ్ ఒలింపిక్స్-1972లో భారత జట్టుకు కాంస్య పతకం దక్కింది. మూడేళ్లలోనే తిరిగి పుంజుకొని.. 1975లో హాకీ ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. ఇది భారత హాకీ జట్టుకు గొప్ప ఊరట. అయితే, మాంట్రియాల్ ఒలింపిక్స్-1976 నాటికి మన జట్టు ఏడో స్థానానికి పడిపోయింది. ఆ తర్వాత మాస్కో ఒలింపిక్స్-1980లో భారత్ విజయం సాధించినా.. ఆ విజయానికి అంత గుర్తింపు దక్కలేదు. ఆనాటికి ప్రపంచ హాకీలో ప్రముఖ జట్లుగా పేరొందిన ఆస్ట్రేలియా, వెస్ట్ జర్మనీ, పాకిస్తాన్, న్యూజిలాండ్ మాస్కో ఒలింపిక్స్‌ని బహిష్కరించాయి. అందువల్ల ఆ పోటీలకు అంతటి ప్రాధాన్యత లేకుండా పోయింది. అలాగని మాస్కోలో భారత్‌కి బంగారు విజయం అంత సునాయాసంగాదక్కలేదు. అయినా.. ఆ విజయానికీ కీర్తి దక్కలేదు. తర్వాత జరిగిన ఏషియన్ గేమ్స్, ఢిల్లీలో వెండి పతకంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆటగాళ్ల నిలకడలేని ప్రదర్శనతో భారత జట్టు బలహీనపడింది. లాస్ఏంజెల్స్ ఒలింపిక్స్-1982లో భారత జట్టు 5వ స్థానంలో నిలిచింది. సీయోల్ ఒలింపిక్స్-1986లో కాంస్య పతకం దక్కింది. 90వ దశకానికి వచ్చేసరికి ధన్‌రాజ్ పిైళ్లె, మరికొందరు స్టార్ క్రీడాకారులుగా ఎదిగారు. కానీ, హాకీ పతనాన్ని మాత్రం అడ్డుకోలేక పోయారు. పీఆర్ శ్రీజేష్ గోల్ కీపర్‌గా మంచిపేరు సాధించాడు. ఈ సమయంలో హాకీ జట్టుకు మౌలిక సదుపాయాల కొరత, పెట్టుబడులు తగ్గడం.. ఆటను దెబ్బతీశాయి. అర్జున అవార్డు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మహమ్మద్ షహీద్ ఈ దశాబ్దంలో భారత హాకీ క్రీడకు ఆశాకిరణంగా నిలిచాడు.

గెలుపు ఆనందాలు, ఓటమి బాధలతో సాగిన ఓ రెండు దశాబ్దాల హాకీ ప్రయాణం.. 90వ దశకంలో మరో మలుపు తిరిగింది. పూర్తిగా ఓటములతో.. గెలుపు అనేది గత వైభవమే అనుకోవాల్సి వచ్చింది. భారత హాకీ జట్టు 1980 నుంచి క్రమంగా పతనం కావడానికి 1983లో భారత్ క్రికెట్ జట్టు ప్రపంచ కప్‌ను గెలుచుకోవడం ఒక కారణం. ఈ విజయంతో దేశ యువతను ఒక్కసారిగా క్రికెట్ మైకం కమ్మేసింది. యువత వేలం వెర్రిగా క్రికెట్ వెంటపడ్డారు. మిగతా ఆటల మీద నీలినీడలు కమ్ముకున్నాయి. టాలెంట్, ఫండ్స్, వ్యూయర్షిప్, ఆఖరికి ఎండార్స్మెంట్లు.. ఇలా అన్ని విషయాల్లోనూ క్రికెట్‌దే పైచేయి అయిపోయింది. నిధులు తగినంతగా అందకపోవడం, సౌకర్యాల కొరత హాకీని వెనక్కినెట్టాయి. వీటికితోడు హాకీ ఫెడరేషన్లో పాలనా లోపాలు జట్టును దెబ్బతీశాయి. ఇలా 20వ దశకం నాటికి భారత హాకీ చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది.

భారత హాకీని పునరుజ్జీవింప చేయాలంటే.. పాలనలో పారదర్శకత, దీర్ఘకాలిక ప్రణాళికలను ప్రవేశపెట్టాలి. నిధుల కోసం కార్పొరేట్ సంస్థల సహకారాన్ని తీసుకోవాలి. జక్ వాలెస్ వంటి అంతర్జాతీయ నిపుణులు యువకులను తీర్చిదిద్దే పనిలో ఉన్నారు. ఆ స్ఫూర్తితో మనదేశం కూడా యువ క్రీడాకారులను తీర్చిదిద్దాలి. యూరప్‌తో పోలిస్తే మనదగ్గర ఆస్ట్రో టర్ఫ్ పిచ్‌లు చాలా తక్కువగా ఉన్నాయి. హాకీకి ఆదరణ ఉన్న ప్రాంతాల్లో ఆస్ట్రో టర్ఫ్ పిచ్‌లు ఏర్పాటు చేయాలి. ఒడిశా, పంజాబ్, హర్యానా వంటి కొన్ని రాష్ర్టాలలో ఇప్పటికీ ఈ ఆట స్థానికులకు గర్వకారణంగా ఉంది. ఒడిశా కార్పొరేట్ సహకారం వల్ల 2018 నుంచి భారత హాకీ జట్టుకు లాభించింది. ఆ సహకారంతోనే 2020 టోక్యో ఒలింపిక్స్‌కి అర్హత సాధించగలిగింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగం, మీడియా దృష్టిని హాకీవైపు మళ్లించాలి. అప్పుడు మన హాకీ పునర్వైభవం సాధిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
బ్రిటిష్ ప్రభావంతో 1850లో హాకీ క్రీడ భారత దేశంలోకి అడుగుపెట్టింది. అనతికాలంలోనే జనాదరణ పొందింది. కోల్‌కతాలో మొట్టమొదటి హాకీ క్లబ్ ప్రారంభమైంది. ఆ క్లబ్ ఆధ్వర్యంలో 1855లో హాకీ టోర్నమెంట్ నిర్వహించారు. కోల్‌కతాలో బీయింగ్టన్ కప్, ముంబయిలో ఆఘాఖాన్ టోర్నమెంట్ హాకీకి ప్రాచుర్యాన్ని తెచ్చిపెట్టాయి. భారత హాకీకి 1925 నవంబరు 7న తొలి గవర్నింగ్ బాడీ ఏర్పాటయ్యింది. అంతకు ఏడాది ముందు ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ ఏర్పాటయ్యింది. భారత పురుషుల జట్టు ఉన్న ఐహెచ్ఎఫ్, ఇండియన్ హాకీ ఫెడరేషన్తో కలిపి 2009లో ‘హాకీ ఇండియా’గా మారింది. భారత్‌లో ఇది అపెక్స్ గవర్నింగ్ బాడీగా పనిచేస్తున్నది. 2014లో దానిని నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్‌గా గుర్తించారు. అది ఇండియన్ హాకీ ఫెడరేషన్‌కి, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌కి, ఏషియన్ హాకీ ఫెడరేషన్‌కి అనుబంధంగా పని చేస్తున్నది. భారత హాకీ జట్లను రూపుదిద్దుతుంది. వందేళ్ల హాకీ వేడుకలను 2025లో వాడవాడలా నిర్వహించారు. జాతీయ స్థాయిలో దీనికి సంబంధించి అనేక కార్యక్రమాలు నిర్వహించారు. స్మారక పుస్తకాన్నీ విడుదల చేశారు. హాకీకి నాలుగు వేల ఏళ్ల చరిత్ర ఉన్నట్టుగా చెబుతారు. తొలిరోజుల్లో ఇరాన్, ఈజిప్టు, గ్రీస్‌లలో ఈ ఆట ఉన్నట్టుగా చారిత్రక ఆధారాలున్నాయి. ఆధునిక క్రీడ యూకేలో రూపుదిద్దుకుంది. హాకీ క్రీడకు 1876లో నియమాలను రూపొందించారు.
పదహారేళ్ల సుదీర్ఘ ఓటముల తర్వాత.. ఆసియా గేమ్స్-2016లో భారత హాకీ జట్టు బంగారు పతకం గెలుచుకుంది. ఈ విజయం హాకీ ప్రేమికులకు ఊరట కలిగించింది. ప్రతిభావంతులను ఆకర్షించడం, నిధులను సమీకరించడం కోసం హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) ఈ కాలంలోనే ఏర్పాటైంది. భారత హాకీకి 2020 నాటికి పూర్వ వైభవం ప్రారంభమైందనే చెప్పాలి. ఆ ఏడాది టోక్యో ఒలింపిక్స్‌లో భారత జట్టు కాంస్య పతకం గెలుచుకుంది. నాలుగు దశాబ్దాల తర్వాత భారత హాకీ జట్టు మెడలో పతకం పడింది. ఒక రకంగా క్రీడాభిమానుల కరువు తీరిన సందర్భంగా చెప్పుకోవాలి. ఆసియా గేమ్స్-2022 ఫైనల్ పోరులో జపాన్ జట్టుని ఓడించి.. మన జట్టు బంగారు పతకం కైవసం చేసుకున్నది. ఏషియన్ ఛాంపియన్ ట్రోఫీ-2023లో మహిళా జట్టు టైటిల్ గెలిస్తే, పురుషుల జట్టు ఫైనల్లో ఓడింది. పీఆర్ శ్రీజేష్, హర్మాన్ ప్రీత్‌సింగ్, లలిత్ ఉపాధ్యాయలు ఆ రోజుల్లో జట్టులో కీలకమైన ఆటగాళ్లుగా రాణించారు.
ఒలింపిక్స్ పోటీల్లో భారత హాకీ జట్టు మొత్తం 8 బంగారు, ఒక వెండి, 3 కాంస్య పతకాలు సాధించింది.
ఒలింపిక్స్‌లో హాకీ చరిత్రలో శ్వేత జాతీయులు కాకుండా బంగారు పతకం సాధించిన మొట్టమొదటి జట్టుగా భారత హాకీ జట్టు గుర్తింపు పొందింది.
1932 లాస్ఏంజిల్స్ ఒలింపిక్స్ పోటీలో 7-1 స్కోరుతో అమెరికా జట్టుపై భారత్ సాధించిన విజయం.. ఒలింపిక్స్ చరిత్రలోనే అతిపెద్ద ఘనతగా రికార్డులకెక్కింది.
ప్రపంచ కప్ (1975) ఫైనల్లో పాకిస్తాన్ జట్టుపై భారత జట్టు గెలిచింది. 1960-80 మధ్య పాకిస్తాన్‌తో పోటీలు దాదాపు యుద్ధంలాగానే సాగేవి.
బ్యాంకాక్ ఏషియన్ గేమ్స్-1998లో వెండి పతకం
ఏషియన్ గేమ్స్-2014లో బంగారు పతకం
ఆసియా కప్ 1966, 1998, 2014, 2022లో భారత జట్టు బంగారు పతకాలు సాధించింది.
జట్టు ఎంపికలో తలెత్తిన వివాదంతో లండన్ ఒలింపిక్స్-1948ని బహిష్కరించింది. 1952లో తిరిగి ప్రవేశించి.. బంగారు పతకం అందుకున్నది.
ఏషియన్ ఛాంపియన్షిప్-2023లో మహిళా జట్టు ట్రోపీని గెలుచుకుంది.

ధ్యాన్ చంద్ పేరు చెబితే హాకీ ప్రేమికులకు పూనకం వస్తుంది.1928, 1932, 1936లో జరిగిన ఒలింపిక్స్ క్రీడలను ఈ హాకీ మాంత్రికుడు శాసించాడు. 1936 బెర్లిన్ ఒలింపిక్స్ పోటీలలో ధ్యాన్ చంద్ ఆటను చూసి అడాల్ఫ్ హిట్లర్ ముగ్ధుడయ్యాడు. జర్మనీ పౌరసత్వంతోపాటు అత్యున్నతమైన పదవిని కట్టబెడతానని హిట్లర్ ముందుకొచ్చాడు. దానిని ధ్యాన్ చంద్ తిరస్కరించాడు. ‘ధ్యాన్ చంద్ లాంటి వాళ్లు జర్మనీకి ఉంటే హాకీ పోటీల్లో ఆ జట్టు ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పనిలేదు’ అని బ్రిటిష్ పత్రికలు రాసుకొచ్చాయి. ధ్యాన్ చంద్ 1946లో హాకీ నుంచి నిష్క్రమించాడు. అప్పటి నుంచి భారత ఆర్మీలో మేజర్‌గా 1956 వరకూ సేవలందించాడు. హాకీ ప్రపంచానికి అతడు చేసిన సేవలకు గుర్తింపుగా.. భారత మూడో అత్యున్నత పౌరపురస్కామైన పద్మభూషణ్ గౌరవంతో ప్రభుత్వం ఆయనను గౌరవించింది. భారత ప్రభుత్వం ‘మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్’ని క్రీడారంగంలోని ప్రతిభావంతులకు ప్రదానం చేస్తున్నది. ఇది భారత దేశంలో క్రీడారంగంలో అత్యున్నత పురస్కారం. ఆయన జన్మదినం ఆగస్టు 29ని ‘నేషనల్ స్పోర్ట్స్ డే’ జరుపుతున్నది.
బల్బీర్ సింగ్ (సీనియర్) ఐదు నిమిషాల్లో ఐదు గోల్స్, మూడు నిమిషాల్లో హ్యాట్రిక్ సాధించిన చరిత్ర ఒక్క బల్బీర్ సింగ్‌కు మాత్రమే ఉంది. 1952 ఒలింపిక్స్‌లో నెదర్లాండ్స్‌తో సాగిన పోటీలో ఈ అరుదైన ఘనతను సాధించాడు. 1948, 1952, 1956 ఒలింపిక్స్‌లో బంగారు పతకాలు పొందిన జట్టులో ఈయన భాగస్వామి. ఐఓసీకి ఎంపికైన మొదటి ఏషియన్. 1957లో పద్మశ్రీ అందుకున్నాడు. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారంతో పాటు ఇండియన్ హాకీ ఫెడరేషన్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అతనికి లభించాయి. ‘హాకీ ఆటకాదు. అది ఒక భావోద్వేగం’ అనేది బల్బీర్ చెప్పిన గొప్పమాట.
మాస్కో ఒలింపిక్స్-1980లో భారత్ బంగారు పతకం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అర్జున అవార్డు, పద్మశ్రీ సాధించాడు.
ఒలింపిక్ క్రీడాకారులలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. 1948-60 మధ్యకాలంలో ‘హాఫ్ బ్యాక్’ క్రీడాకారునిగా మంచిపేరు తెచ్చుకున్నాడు. మూడు బంగారు, ఒక వెండి పతకం సాధించాడు.
నాలుగు ఒలింపిక్స్ పోటీలు, నాలుగు ప్రపంచ కప్‌లు, నాలుగు ఛాంపియన్ ట్రోఫీలు, నాలుగు ఆసియా కప్‌లలో ఆడిన ఏకైక క్రీడాకారుడు. ఏషియన్ గేమ్స్-1998, ఆసియా కప్-2003 పోటీలలో బంగారు పతకం గెలిచిన జట్టుకు నాయకత్వం వహించాడు. అర్జున అవార్డు, పద్మశ్రీ, ఖేల్త్న్ర అవార్డులు అతణ్ని వరించాయి.
గోల్ కీపర్‌గా అసాధారణ పాఠవం కలిగిన క్రీడాకారుడు. కాంస్య పతకం గెలిచిన టోక్యో ఒలింపిక్స్-2020 పోటీల్లో గోల్ కీపర్. పద్మశ్రీ అవార్డ్ అందుకున్నాడు.
ప్రస్తుత భారత హాకీ జట్టుకు కెప్టెన్. టోక్యో ఒలింపిక్స్-2020 పోటీలకు నాయకత్వం వహించాడు. హాకీలో డ్రాగ్ ఫ్లిక్ స్పెషలిస్టుగా పేరు గడించాడు. 215కి పైగా గోల్స్ సాధించాడు.
– డా॥ పార్థసారథి చిరువోలు