నాలుగు రోజులైతే ఘనంగా స్వతంత్ర దినోత్సవం జరుపుకోనున్నాం. రెపరెపలాడే త్రివర్ణ పతాకానికి రొమ్ము విరిచి సెల్యూట్ చేస్తాం. గళమెత్తి జాతీయ గీతాన్ని ఆలపిస్తాం. దేశానికి స్వతంత్రం వచ్చి 77 ఏండ్లు గడిచాయి. మరి, ఆర్థికంగా మీరు స్వతంత్రులేనా? గతంలో బ్రిటిషర్ల చెరలో మగ్గిన భారతావనిలా.. మీరూ ఏ ఉచ్చులోనైనా చిక్కుకున్నారా? అలవాట్లు, పొరపాట్లు, అత్యాశ, దుబారాతనం, లోభత్వం ఇవే మనిషి ఆర్థిక మూలాలను హరించే అవరోధాలు. వాటిని అధిగమిస్తేనే.. ఆర్థిక స్వతంత్రం సిద్ధిస్తుంది.
Financial Management | మనీ అంతగా చలామణీలో లేనప్పుడు.. మనిషి సుఖంగా జీవించాడు. వస్తుమార్పిడితో కష్టసుఖాలు పంచుకున్నాడు. కాసులు వచ్చాయి.. కార్పణ్యాలు పెరిగాయి. కరెన్సీ వచ్చాక నల్లధనం మూలుగులు మొదలయ్యాయి. బ్యాంకులు వచ్చాయి.. రుణాలు తెచ్చాయి. డిజిటల్ రూపీ వచ్చింది… ఆర్థిక క్రమశిక్షణ పూర్తిగా అదుపుతప్పింది. కాలంతో డబ్బు విలువ తగ్గుతుందన్నది నిజమే! కానీ, అదే సయమంలో ఆర్థిక విషయాల్లో మనిషి విచక్షణ కోల్పోతున్నాడు. అప్పట్లో నెల జీతం వంద రూపాయలు ఉన్నా.. ఉమ్మడి కుటుంబ వ్యవహారాలు గుంభనంగా సాగిపోయేవి. ఇప్పుడు లక్ష జీతం వస్తున్నా… ఇద్దరున్న ఇల్లు గడవడం కత్తిమీద సాము అవుతున్నది. కారణం.. ఆర్థిక క్రమశిక్షణ లోపించడమే! డబ్బంటే లెక్కలేని తనం కారణంగా.. ఎంతోమంది అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. లోన్‌యాప్‌లలో తీసుకున్న అప్పులకు వడ్డీలూ, వాయిదాలూ చెల్లించలేక సతమతమవుతున్నారు.
ఆర్థిక విషయాల్లో పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు వ్యవహరిస్తే అసలుకే ఎసరు రావడం ఖాయం. పక్కింటి పాపారావు జీవనశైలిని అనుకరించాలని చూస్తే.. మిమ్మల్ని చూసి సదరు పాపారావు సైతం.. పాపం అనే రోజు రావొచ్చు. స్నేహితుడు కారు తీసుకున్నాడనీ.. సడ్డకుడు ప్లాటు కొన్నాడనీ.. మీ అవసరాలను మర్చిపోవద్దు. ఉట్టికెగిరే శక్తిలేకుండా స్వర్గానికి ఎగిరే ప్రయత్నం చేయొద్దు. ఆర్థికంగా కుదురుగా ఉండాలంటే.. ముందుగా మన అవసరాలు ఏమిటో గుర్తించాలి. వాటిని ఎలా నెరవేర్చుకోవాలో ప్రణాళిక రచించుకోవాలి. మీ ఆదాయం ఎంత? వ్యయం ఎంత? మిగులుబాటు ఏదైనా ఉందా? లోటు బడ్జెట్ ఎంత ఉంది? వీటన్నిటినీ బేరీజు వేసుకున్నాకే, ఇతర అవసరాల మీద దృష్టిసారించాలి.
సంపద ఉన్నది అనుభవించడానికే! కష్టపడి సంపాదించేది.. ఇష్టపడి ఖర్చు చేయడానికే! అలాగని పొదుపు మంత్రాన్ని విస్మరించి విశృంఖలంగా దుబారా చేస్తామంటే.. జీవితం తలకిందులు అవుతుంది. ఉదాహరణకు కొత్త సినిమా వచ్చింది. ఫ్యామిలీతో చూడాలని అనుకున్నారు.. ఓకే! అయితే, రిలీజ్ రోజే వెళ్లాలన్న నియమం పెట్టుకోవడమే నాట్ ఓకే!! మల్టీప్లెక్స్‌లోనే చూడాలని భావించడం సరికాదు. అక్కడ నాలుగు సమోసాలు, ఒక వాటర్ బాటిల్‌కు అయ్యే ఖర్చుతో.. ఇంటిల్లిపాదీ ఉడుపి హోటల్లో లంచ్ చేయొచ్చు. సినిమా విడుదలై ఐదురోజుల తర్వాత.. రెగ్యులర్ థియేటర్‌కు వెళ్లండి. అక్కడైతే కూల్‌డ్రింక్స్, పాప్‌కార్న్ కూడా బడ్జెట్లోనే లభ్యమవుతాయి. అంతేకాదు, కూరగాయల దగ్గర బేరం ఆడితే నామోషీ అని కొందరు భావిస్తారు.
ఆర్థికస్థితి అంతంత మాత్రంగా ఉన్నా.. కంట్రోలింగ్ ఉండదు. బయటికి వెళ్తే క్యాబ్ బుక్ చేసుకోవడమే రివాజుగా పెట్టుకుంటారు. ఒక్కరే వెళ్లేపనైతే.. ఆటో బుక్ చేసుకోవడం ఎందుకు? బైక్ బుక్ చేసుకుంటే.. సగం చార్జీలతో గమ్యం చేరుకోవచ్చు. అదీ అర్జెంట్ అయితేనే! పది నిమిషాలు ముందుగా బయల్దేరితే.. కారు చౌకగా బస్సులో సేఫ్టీగా ప్రయాణించొచ్చు. షాపింగ్‌లో కూడా.. ముందస్తుగా అనుకున్నవాటికే పరిమితం అవ్వండి. ఊరించే డిస్కౌంట్ ఉందనో, ఒకటి కొంటే మరొకటి ఫ్రీగా వస్తుందనో అవసరానికి మించి కొనకండి. ఇలా ప్రతీచోట.. స్వీయ నియంత్రణ పాటించడం వల్ల.. దుబారాకు అడ్డుకట్ట వేయొచ్చు.
దుర్వ్యసనాల కారణంగా ఆర్థికంగా చాలా కుటుంబాలు చితికిపోతాయి. తాగుడు, జూదం ఈ రెండూ మీ బడ్జెట్‌ను అతలాకుతలం చేసేవే! మద్యపానం ఆరోగ్యానికే కాదు.. ఆర్థికానికీ హానికరం. ఆన్లైన్ గేముల్లో తలదూర్చారా ఇక అంతే సంగతులు! ఈరోజుల్లో చాలామంది అరకొర తెలివితేటలతో ట్రేడింగ్ చేస్తున్నారు. నాలుగు బిజినెస్ వ్యాసాలు చదివేసి.. తలపండిన మేధావుల్లా షేర్మార్కెట్లో ప్రవేశిస్తున్నారు. సొంత డబ్బుతో విన్యాసాలు చేస్తే పర్వాలేదు. ఐదు రూపాయల వడ్డీకి అప్పు తెచ్చి మరీ ఇక్కడ సొమ్ము గుమ్మరిస్తున్నారు. అదృష్టం బాగున్న రోజు పది రూపాయలు లాభం చూసిన కండ్లే.. దురదృష్టం వెంటాడిన నాడు కన్నీరుమున్నీరుగా విలపించొచ్చు. సో.. దూరాలోచన లేని అలవాట్లు కచ్చితంగా పొరపాట్లకు దారితీస్తాయని గుర్తించండి.
ఆర్థిక స్వతంత్రం అంటే సంపాదించడం ఒకటే కాదు. దాన్ని నిలుపుకోవడం. ఆదాయానికి మించి వ్యయం లేకుండా చూసుకోవడమే పైసల పర్వంలో పాటించాల్సిన తొలి నియమం. నెలవారీ రాబడిలో 20 శాతం పొదుపు చేయడం రెండో నియమం. ఈ పొదుపు మంత్రాన్ని మదుపు తంత్రంతో ముడిపెట్టడం మూడో నియమం. న్యూటన్ గమన నియమాల కన్నా పవర్ఫుల్ ఫలితాలు ఇస్తాయివి. చర్యకు ప్రతిచర్య.. బంతిని బలంగా గోడకు మోదితే… అంతే బలంగా తిరిగి వస్తుంది. కానీ, అదే బంతిని ఇసుక దిబ్బపై బలంగా బాదితే.. అందులోనే కూరుకుపోతుంది. మదుపు ఎక్కడ చేస్తున్నామన్నది చాలా ముఖ్యం. ఇవన్నీ ఆలోచించి ముందడుగు వేయగలిగితే.. మీరు ఆర్థికంగా స్వతంత్రులు అనిపించుకుంటారు.
– ఎం. రాం ప్రసాద్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్
ram@rpwealth.in
www.rpwealth.in