అన్నం తినాలంటే ఫోన్లో వీడియో చూడాల్సిందే .. స్కూల్ నుంచి రాగానే బ్యాగ్ పక్కన పడేసి ఫోన్ పట్టుకోవాల్సిందే .. సెలవు రోజు ఎక్కువ సమయం ఫోన్లోనే.. ఇది ఇప్పటి పిల్లల పరిస్థితి. వయసుతో సంబంధం లేకుండా ఎల్కేజీ మొదలుకుని హైస్కూల్ పిల్లల వరకు అందరూ స్మార్ట్‌ఫోన్‌కి అడిక్ట్ అయిపోతున్నారు. ఎందుకు పిల్లలు ఇంతలా ఫోన్‌కి అతుక్కుపోతున్నారు, దీనికి తల్లిదండ్రులే కారణమని అధ్యయనాలు చెప్తున్నాయి.
Parenting | పిల్లలు ఏడుస్తున్నప్పుడు బుజ్జగించడానికో, ఇంట్లో పని చేస్తున్నప్పుడు అడ్డొస్తున్నారనో కొందరు తల్లిదండ్రులు ఫోన్ ఇచ్చేస్తున్నారు. దీంతో క్రమంగా వారు ఫోన్‌కి బానిసలుగా మారిపోతున్నారని ఆ మధ్య గుజరాత్‌లోని సౌరాష్ట్ర యూనివర్సిటీ సైకాలజీ విభాగం నిర్వహించిన అధ్యయనంలో తేలింది. తాము పని చేసుకుంటున్నప్పుడు అడ్డు రాకుండా ఉండాలని 54 శాతం మంది తల్లులు తమ పిల్లలకు ఫోన్లు ఇస్తున్నట్టు ఈ అధ్యయనంలో తెలిసింది. మరోవైపు 80 శాతం మంది పిల్లలు తల్లిదండ్రుల నుంచి ఫోన్ కావాలని డిమాండ్ చేస్తున్నట్టు వెల్లడైంది. 70 శాతం మంది అయితే ఫోన్ చూస్తూనే భోజనం తింటున్నారని తేలింది. ఒకవేళ ఫోన్ ఇవ్వకుంటే మొండి కేస్తున్నట్టు ఈ అధ్యయనం గుర్తించింది.
స్మార్ట్‌ఫోన్ కు అతిగా బానిసలైన 64 శాతం మంది పిల్లలు నిద్రలో కూడా ఆన్లైన్ గేమ్స్, ఫోన్ గురించే కలవరిస్తున్నారట. 73 శాతం మంది బడికి వెళ్లిన సమయంలో ఫోన్ మిస్ అవుతున్నట్టు, స్క్రీన్ ప్రభావంతో 77 శాతం మందిలో నిద్ర వేళలు తగ్గిపోగా, 83 శాతం మంది కంటిచూపు సమస్యలతో బాధ పడుతున్నట్టు గుర్తించారు. 82 శాతం మంది మానసిక సమస్యలతో బాధ పడుతున్నట్టు పసిగట్టారు. 93 శాతం మంది పిల్లలు అవుట్ డోర్ గేమ్స్ కంటే ఫోన్లో గేమ్స్ ఆడటానికి మొగ్గు చూపుతున్నారని ఈ అధ్యయనంలో వెల్లడైంది. అంతేకాదు, ఫోన్ చూడనిదే అన్నం ముద్ద ముట్టకపోవడంతోపాటు, హోంవర్క్ కూడా చేయని స్థితికి కొంతమంది పిల్లలు చేరుకున్నారనేది చేదు నిజం.
స్మార్ట్‌ఫోన్ అతి వినియోగంతో పిల్లలు పలు శారీరక, మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఈ అధ్యయనం వెల్లడించింది.
తెలిసో తెలియకో తల్లిదండ్రులు చేస్తున్న పొరపాటే పిల్లలను స్మార్ట్‌ఫోన్ బానిసలుగా మారుస్తున్నది. ఇంట్లో పెద్దలు చేసే పనినే పిల్లలు అనుసరిస్తారు. అందుకని పేరెంటింగ్‌లో మార్పు రావాలి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలను స్మార్ట్‌ఫోన్ మహమ్మారి బారిన పడకుండా కాపాడుకోవచ్చు.
తల్లిదండ్రులతో చక్కని అనుబంధం, ఇంట్లో అందరూ కలివిడిగా ఉండే వాతావరణం ఉంటే పిల్లలు స్మార్ట్‌ఫోన్ వైపు మొగ్గడం చాలా తక్కువ. అలాంటి వాతావరణం కల్పించడానికి తల్లిదండ్రులు ప్రయత్నించాలి. బాల్యం మనిషి జీవితంలో ఓ మధుర జ్ఞాపకం. వీలైనన్ని తీపి జ్ఞాపకాలను పిల్లలకు ఇవ్వడం తల్లిదండ్రుల బాధ్యత.
-బి. కృష్ణ, సీనియర్ సైకాలజిస్ట్
ఇగ్నిషియో చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్,
హైదరాబాద్, 99854 28261