డోలో జైలులోకి ప్రవేశించిన సమయంలో కీలకంగా వ్యవహరించిన ముగ్గురు అధికారులే రూమ్‌నంబర్ 25 సెల్లో సూసైడ్ చేసుకోవడం రుద్ర అండ్ టీమ్‌కు కొత్త సవాల్‌ను విసిరింది. మిషన్ డోలోకు సంబంధించి తొలుత మాట్లాడుకొన్న నలుగురు వ్యక్తులు చనిపోయింది కూడా ఈ రూమ్‌నంబర్ 25లోనే. అయితే, డోలో వశీకరణ ప్రభావంతోనే ఆ నలుగురు చనిపోయారని ఇప్పటివరకూ రుద్ర టీమ్ భావించింది.
డోలో మరణించిన తర్వాత కూడా ఇప్పుడు తాజాగా ముగ్గురు అధికారులు అదే మాదిరిగా సూసైడ్ చేసుకొని చనిపోవడంతో ఈ రూమ్ నంబర్ 25లోనే ఏదో మిస్టరీ దాగున్నదని రుద్రకు అనుమానం పెరిగింది. దీంతో తామొచ్చేవరకూ ఆ సెల్‌లోకి మరెవరూ వెళ్లొద్దని ఆదేశాలు ఇచ్చారు రుద్ర అండ్ టీమ్. కొంత సమయం కాగానే జైలుకు చేరుకొన్న రుద్ర అండ్ టీమ్ రూమ్ నంబర్ 25 ముందు నిల్చొన్నారు.
ఆ రూమ్ సెల్ లాక్ వేసి ఉంది. కీ తీసుకొన్న రుద్ర లోపలికి వెళ్లబోయాడు. ఇంతలో రుద్రను రామస్వామి వారిస్తూ.. ‘సార్.. సార్.. వద్దు. ఇప్పటికే, మనకు తెలియకుండానే ఎన్నో విషయాలు జరుగుతున్నాయ్. ఇంతమంది చావుచూశాక, వెళ్లడం అవసరమా?’ అంటూ అడ్డుకొన్నాడు. రామస్వామికి రుద్ర ఏదో చెప్పబోతుండగా.. ఇంతలో సెల్ ఊచల గుండా ఓ పిల్లి లోపలికి పరిగెత్తుకొని వెళ్లింది. రూమ్‌లోకి వెళ్లిన కాసేపటి వరకూ మామూలుగా ఉన్న ఆ పిల్లి ఉన్నట్టుండి.. పిచ్చిపట్టిన దానిలా తలను గోడకు బాదుకోవడం ప్రారంభించింది. తీవ్ర రక్తస్రావమైనప్పటికీ గోడకు తలను కొట్టుకోవడం మాత్రం మానలేదు. ఇదంతా బయట నుంచి గమనిస్తున్న రుద్ర టీమ్‌కు ఒళ్లంతా చెమటలు పట్టాయి. అసలేం జరుగుతుందో అర్థం చేసుకొనేలోపునే ఆ పిల్లి తీవ్రంగా గాయపడి చనిపోయింది. ఈ ఘటనతో రూమ్‌లో ఏదో మిస్టరీ దాగున్నదన్న రుద్ర అనుమానం మరింత పెరిగిపోసాగింది. ఏది ఏమైనా రూమ్‌లోకి వెళ్తేనే, విషయం బయటపడుతుందనుకొన్న రుద్ర.. టీమ్ మెంబర్స్ వారిస్తున్నా వినిపించుకోకుండా తాళంతీసి సెల్‌లోకి అడుగుపెట్టాడు. కరణ్, రామస్వామి, స్నేహిల్, హరిశ్వ గుండె వేగంగా కొట్టుకోసాగింది. ఏం జరుగబోతుందోనని జయ గమనిస్తూ వాచీని చూసుకోసాగింది.
అయితే, అందరూ ఊహించినట్టు సెల్‌లోకి వెళ్లిన రుద్రకు ఏమీ కాలేదు. కాసేపు సెల్ లోపల అటూఇటూ తిరిగిన రుద్ర ఏదైనా ఆధారం దొరుకుతుందేమోనని వెదకడం ప్రారంభించాడు. అయితే, ఏమీ దొరకలేదు. ఇదంతా గమనిస్తున్న జయ మనసులో ఏవేవో ఆలోచనలు. ‘ఇదే సెల్‌లోకి వెళ్లిన ముగ్గురు పోలీసులకు, పిల్లికి అపాయం జరిగినప్పుడు.. రుద్రకు ఎందుకు ఏమీ కాలేదు? ఇందులో ఏదైనా మిస్టరీ ఉందా?’ అని ఆలోచిస్తూ.. ఏదో గుర్తొచ్చినట్టు తన దగ్గర ఉన్న ఓ డివైజ్‌ను పట్టుకొని రూమ్‌లోకి జయ కూడా వెళ్లింది. అంతే, ఏదో అపాయం రాబోతున్నట్టు గ్రహించిన జయ.. వెంటనే రుద్ర చెయ్యిని పట్టుకొని బయటికి లాక్కొచ్చింది. ఇదంతా గమనించిన అక్కడివారు ఉలిక్కిపడ్డారు.
‘ఏమైంది ఆంటీ?’ కంగారుగా అడిగాడు రుద్ర. ‘ఇంకో అర నిమిషం నువ్వు ఆ సెల్లోనే ఉంటే, నువ్వు కూడా సూసైడ్ చేసుకొనేవాడివిరా’ అంటూ బాంబు పేల్చింది జయ. అర్ధంకానట్టు చూస్తున్న రుద్రతో జయ ఇలా చెప్పడం ప్రారంభించింది. ‘ఒరేయ్ రుద్ర.. నీకు గుర్తుందా? మిషన్ డోలోకు సంబంధించి డోలో.. 8 దేశాల పేర్లు చెప్పాడు. మిషన్‌లో ఉన్నవి 8 దశలు. బయోకెమీ క్రియేచర్ను అష్టదిగ్బంధనతో అంటే 8 బంధనాలతో బంధించారు. ఇప్పుడు లాక్ చేసిన ఈ రూమ్ నంబర్ 25లోకి 8 రోజుల తర్వాత ఎంటర్ కాగానే కీలకమైన ఆ ముగ్గురు అధికారులు చనిపోయారు. ఇవన్నీ గమనిస్తే, 8 అంకెలో ఏదో మిస్టరీ దాగున్నదని నాకు అనిపించింది. ఇంతలో సెల్‌లోకి వెళ్లిన పిల్లి 8 నిమిషాలు అయ్యేవరకూ మామూలుగా ఉండటాన్ని గమనించా. 8 నిమిషాలు కాగానే అది పిచ్చిపట్టిన దానిలా తలను గోడకు కొట్టేసుకొని చచ్చింది. నువ్వు రూమ్‌లోకి అడుగుపెట్టిన ఏడున్నర నిమిషాల వరకూ మామూలుగానే ఉన్నావ్. 8 నిమిషాలు దాటితే, నువ్వు కూడా మాకు దక్కేవాడివి కాదు. అందుకే, అనుమానాన్ని తీర్చుకోవడంతో పాటు నిన్ను బయటకు లాక్కొద్దామనే ఈ స్పెషల్ డివైజ్‌తో రూమ్‌లోకి అడుగుపెట్టా. ఇప్పుడు ఈ డివైజే ఈ రూమ్ మిస్టరీని కనిపెట్టింది’ అంటూ తన చేతిలోని అడ్వాన్స్డ్ ట్రాన్స్‌క్రానియల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ డివైజ్‌ను అందరికీ చూయించి.. రూమ్ నంబర్ 25 మిస్టరీని వివరించింది జయ. ఆ మిస్టరీ ఏంటో మీరు కనిపెట్టారా?
సమాధానం:
మెదడులోని కొన్ని ప్రాంతాలను ప్రభావితం చేస్తూ డిప్రెషన్ వంటి వాటిని తగ్గించడానికి ట్రాన్స్‌క్రానియల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ డివైజ్‌ను వాడతారు. అయితే, రూమ్ నంబర్ 25లోని గోడల్లో అడ్వాన్స్డ్ టెక్నిక్‌తో పనిచేసే ఇలాంటి పవర్ఫుల్ స్టిమ్యులేషన్‌ను ఏర్పాటు చేసి.. బాధితులను సూసైడ్ చేసుకొనేలా పురిగొల్పడమే ఆ రూమ్ లక్ష్యంగా మార్చేశారు. రూమ్‌లోకి ఎంటరైన 8 నిమిషాల తర్వాత ఈ డివైజ్ ప్రభావం చూయిస్తుంది. అందుకే, రూమ్‌లోకి వెళ్లగానే కాకుండా కాసేపయ్యాక ఆ పిల్లి చనిపోయింది. ముగ్గురు అధికారులు కూడా 8 నిమిషాలు గడిచిన తర్వాతే సూసైడ్ చేసుకొన్నట్టు సీసీటీవీలో రికార్డయ్యింది.
-రాజశేఖర్ కడవేర్గు