‘కొన్నిసార్లు వింటుంటాం. మరక మంచిదే! అని. నాకు అది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే నాకు ‘ఏడీహెచ్‌డీ’ ఉంది. చిన్నప్పటినుంచి. అది నాకో అత్యుత్తమమైనక్వాలిటీగా నేను స్వీకరించా. అదే నన్ను నలుగురిలో ప్రత్యేకంగా నిలిచేలా చేసింది’ అంటున్నారు మలయాళీ నటుడు షైన్ టోమ్ చాకో. దసరా, రంగబలి సినిమాల్లో విలన్‌గా చేసిన ఆయన మనందరికీ సుపరిచితమే. వైవిధ్యమైన పాత్రల్లో ఒదిగిపోతూ తనదైన శైలిని నటనలో చూపిస్తున్న ఈ నటుడు ఏం చేసినా సెన్సేషనే. అందుకే నిత్యం ట్రెండ్ అవుతూ.. అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.
అబ్బో వీడు చాలా హైపర్ యాక్టివ్ అంటుంటాం కొంతమంది పిల్లల్ని చూసి. ఒకచోట నిలకడగా కూర్చోకుండా నిత్యం ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. దీన్నో న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్‌గా పరిగణిస్తున్నారు. ఆటిజంలో ఇదో పార్శం. చిన్న వయసులో దీని ప్రభావంతో పిల్లల మానసిక ఎదుగులపై ప్రభావం పడుతుంది. అయితే, నిపుణులైన థెరపిస్ట్‌లు చెబుతున్న ప్రకారం.. కొన్ని ప్రత్యేక థెరపీలతో పిల్లల మానసికస్థితిని మెరుగుపరచొచ్చు. అయితే, ఆటిజంపై ఉన్న అపోహల్ని తొలగించేలా అవగాహన కార్యక్రమాల్ని పలు సంస్థలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో షైన్ టోమ్ చాకో తనకున్న అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ (ఏడీహెచ్‌డీ) గురించి బోల్డ్‌గా స్పందించాడు.
టోమ్ చాకో అప్పటికే తన చిత్రమైన ప్రవర్తనతో స్టేజ్‌పై అందర్నీ ఆశ్చర్యపరిచేవాడు. ఆయా సంఘటనలు నెట్టింట వైరల్ అయ్యాయి కూడా. మైక్‌ని గాల్లో తిప్పడం.. చిత్రమైన హావభావాలతో డ్యాన్స్‌లు చేయడం.. భిన్నంగా మాట్లాడటం.. ప్రేక్షకులు చూసినప్పుడు తనలో కనిపించే విలక్షణమైన తీరుకు కొందరు షాక్ అయ్యే ఉంటారు. కానీ, తనెప్పుడూ నటనలోగానీ, పబ్లిక్ ఫ్లాట్‌ఫామ్‌పై మాట్లాడేటప్పుడు గానీ జంకలేదు. ఇప్పుడు ఎంతో ఆత్మవిశ్వాసంతో తనలోని లోపాన్ని పాజిటివ్‌గా ప్రపంచానికి చెప్పాడు. ‘నేనో ఏడీహెచ్‌డీ పిల్లాడిని. అందుకేనేమో అందరి దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తా. ఓ నటుడిగా దాన్నో వరంగా భావిస్తున్నా. ఎందుకంటే.. నటులంతా చేసేది ఆయా పాత్రల ద్వారా అందర్నీ ఆకట్టుకోవడమే..’ అని ఏడీహెచ్డీపై ఓపెన్‌గా స్పందించాడు. ఈయనే కాదు.. ఫహద్ ఫాజిల్ కూడా ఈ మధ్యే తనూ ఏడీహెచ్‌డీతో బాధ పడుతున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో దీనిపై అందరూ మాట్లాడుకుంటున్నారు. ఆటిజంతో కూడిన మానసిక స్థితి మనిషి క్రియేటివిటీపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఇప్పుడో ప్రశ్న?
ఈ మధ్యే తన రిలేషన్షిప్ స్టేటస్పైన టోమ్ చాకో ఓ ఇంటర్యూలో స్పందించాడు. ‘ప్రేమికుల ఇరువురి ఆలోచనలు పొసగనప్పుడు అది కచ్చతంగా కాంప్లికేట్ అవుతుంది. అది ఇద్దరికీ మంచిది కాదు. ప్రాణంగా ప్రేమించుకున్నాం అనే ఒక్క కారణంతో కలిసి ముందుకు సాగలేం. అది ఒకరినొకరు ఇంకా నిందించుకునేలా చేస్తుంది. ఇంకా హర్ట్ చేస్తుంది. అప్పుడు ప్రేమ కంట్రోల్ తప్పుతుంది. నేను అలాంటి పరిస్థితిని ఫేస్ చేయలేను. నా మానసిక స్థితి అదుపు ఉండదు. అందుకే మా ప్రేమకి ఇప్పుడే బ్రేక్ అప్ చెప్పేశాం.’ అంటూ తన బ్రేక్ అప్ ని బోల్డుగా ప్రకటించాడు. ఆలోచనల్లో వైవిధ్యం చూపడమే కాదు.. తను నటించే సినిమాల్లోని పాత్రలూ అంతే భిన్నంగా ఉంటాయి. ప్రస్తుతం ఈ మలయాళీ యాక్టర్ దేవరలో యన్టీఆర్ని ఢీ కొట్టడం పాటు.. బాలయ్య కొత్త సినిమాలోనూ కీలకమైన రోల్ చేస్తున్నాడట.
టోమ్ చాకో 2002లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన కెరీర్ స్టార్ట్ చేశాడు. అన్ని భాషల్లో సుమారు 100 సినిమాల్లో నటించాడు. యాక్ట్ చేయడం తప్ప సినిమాలు చూడటం ఇష్టం ఉండదట. ఎందుకు? అంటే.. మ్యాజిక్ ట్రిక్స్ చూసేవారికి బాగుంటుంది తప్ప.. మెజీషియన్‌కి నచ్చదని చెబుతున్నాడీ ‘థింక్ డిఫరెంట్ మాన్’.