చేతులకు సంకెళ్లు.. కాళ్లకు బేడీలతో కనిపిస్తున్నా.. వాళ్లేం నేరస్థులు కారు. అమెరికాలో అడుగుపెట్టాలని అందమైన కలలు కన్న స్వాప్నికులు. అర్హతలను, అవకాశాలను ఆఖరికి పేదరికాన్ని కూడా లెక్కచేయని సాహసవంతులు. కొండలు, అడవులు, నదులను దాటుకుని ముందుకు సాగిన యోధులు.
నా అనేవాళ్లు లేకపోయినా పరాయిగడ్డమీద ఒంటరి పోరాటం చేసిన ఆశావహులు. అమెరికా కాదు పొమ్మంటే కలలు ఛిద్రమై, కాళ్ల కింద నేల కదిలిపోయి… గోడకు కొట్టిన బంతిలా ఉన్నచోటికే తిరిగివచ్చేసిన విధి వంచితులు. అడుగడుగునా మోసాలకు గురై సర్వం కోల్పోయిన బాధితులు. రేపటి బతుకుతెరువు ప్రశ్నార్థకంగా మారిన దురదృష్టవంతులు. అమెరికా డాలర్ల వేటలో డంకీ రూట్లో వెళ్లిన వాళ్లిప్పుడు చెదిరిన కలలకు నిజమైన నమూనాలు.
– డా॥ పార్థసారథి చిరువోలు
ఆడామగా అన్న తేడా లేదు. మా అందరి చేతులకు బేడీలు వేశారు. కాళ్లకు సంకెళ్లు కట్టారు. 40 గంటలపాటు అలాగే కదలకుండా కూర్చున్నాం. లేచి నిలబడటానికి మమ్మల్ని అనుమతించలేదు. తిండి తినాలన్నా అంతే. బాత్రూంకి వెళ్లాలంటే.. అమెరికన్ సిబ్బంది కాపలాగా వచ్చారు. చేతికి ఒక వైపు బేడీలను మాత్రమే తొలగించారు. మాతో మానవత్వం లేకుండా వ్యవహరించారు. మమ్మల్ని నేరస్థులుగా చూశారు. అమెరికా నుంచి ఓ మిలటరీ వాహనంలో తీసుకొచ్చి భారత గడ్డమీద విడిచిపెట్టారు. ఇదంతా చూసిన వాళ్లు ఇంకెప్పుడూ ఈ డంకీ రూట్లో ప్రయాణించరు.
– అమెరికా బహిష్కరణకు గురై భారత్ తిరిగివచ్చిన బాధితుడు గుర్ప్రీత్ సింగ్ వ్యాఖ్యలు
అమెరికా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి అవకాశాల స్వర్గం. ఆశల సౌధం, కలలకు గమ్యస్థానం. అందుకే ఆ దేశానికి ఎన్నో దేశాల నుంచి ప్రతి ఏటా లక్షలాది మంది వలస వెళ్తుంటారు. వీటిలో అన్ని పత్రాలతో కూడిన సక్రమ వలసలు కొన్నైతే, మరికొన్ని అక్రమమైనవి. ఇలా అమెరికాలో అడ్దదారుల్లో అడుగుపెట్టాలని అనుకునేవారు ఎక్కువమంది అగ్రరాజ్యం దక్షిణ సరిహద్దు దేశం మెక్సికో మీదుగా వెళ్తారు. ఇది అత్యంత ప్రమాదభరితమైన ప్రయాణం. గడ్డ కట్టించే చలి, దుర్గమమైన అడవులు, సుళ్లు తిరిగే జల ప్రవాహాలు, సుదీర్ఘమైన ఎడారుల గుండా సాగుతుంది. విషసర్పాలు ఒకవైపు.. ధన, మాన, ప్రాణాలను దోచుకునే మానవ మృగాలు మరో వైపు తటస్థపడతాయి. వీటన్నిటినీ దాటుకుని అమెరికా గమ్యాన్ని చేరటం అంత తేలిక కాదు.
ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలు, బయటి వ్యక్తులు దాడిచేయటం మొదలైన కారణాల వల్ల చాలామంది మధ్యలోనే ప్రాణాలు కోల్పోతారు. మరికొంతమంది గాయాల బారినపడి అత్యంత దయనీయ పరిస్థితుల్లో తమ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. కానీ ఇవేవీ బయటి ప్రపంచానికి తెలియవు. ఈ ప్రయాణం వివిధ దశలలో సాగుతుంది. భారతీయ పౌరులు ముందుగా చట్టపరమైన వీసాలతో ఈక్వెడార్, కొలంబియా, పెరు లాంటి లాటిన్ అమెరికా దేశాలకు ప్రయాణించాలి. అక్కడినుంచి స్మగ్లర్లు, ఇతరుల సాయంతో మరికొంత దూరం ముందుకు వెళ్లవలసి ఉంటుంది. అప్పుడుగానీ మెక్సికో-అమెరికా సరిహద్దుకు చేరలేరు.
అందుకే బ్రోకర్లు వీసా సమస్యలు అంతగా లేని బ్రెజిల్, ఈక్వెడార్, బొలీవియా, గయానా వంటి దేశాలకు, సెంట్రల్ అమెరికాలోని కోస్టారికా, నికారాగువా, హోండురాస్, గ్వాటెమాల, మెక్సికో దేశాలకు ప్రయాణికులను చేరవేస్తున్నారు. కొన్నిసార్లు దుబాయ్ నుంచి మెక్సికోకు నేరుగా వీసా ఇప్పిస్తారు. ఇది వలసదారులు చెల్లించే ధరలను బట్టి ఉంటుంది. అక్కడినుంచి డంకీ రూట్లో మెక్సికో మీదుగా ప్రయాణం చేయాలి.
డంకీ రూట్.. దీన్నే డేరియన్ గ్యాప్ అని పిలుస్తారు. దక్షిణ అమెరికా నుంచి ఉత్తర అమెరికా వరకూ విస్తరించి ఉండే దాదాపు 100 కిలోమీటర్ల నిడివి కలిగిన మార్గం. దట్టమైన భూమధ్య రేఖాప్రాంతపు వర్షారణ్యాలు, నిటారుగా ఉండే పర్వతాలు, చిత్తడినేలలతో కూడిన ఈ ప్రాంతం అక్రమ కార్యకలాపాలకు, స్మగ్లింగ్‌కు కేంద్రం. ఇది దాటితే కనిపించేవి పనామా అడవులు. వీటిమీదుగా వెళ్లేటప్పుడు ప్రయాణికులకు కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు లాంటి ప్రకృతి వైపరీత్యాలు ఎదురవుతాయి. అంతేకాదు, పులి మీద పుట్రలా వన్యప్రాణుల ముప్పు కూడా పొంచి ఉంటుంది.
మూడోది కొలంబియన్ సరిహద్దు.. ఇక్కడి ప్రయాణంలో సాయుధ గెరిల్లా దళాలు, అవినీతి అధికారులు తటస్థపడతారు. వలసదారులు కొలంబియా నుంచి పనామా దేశపు రాజధాని పనామా సిటీకి చేరడానికి ముందుగా వంద కిలోమీటర్లకు పైగా ట్రెక్కింగ్ చేయాలి. గతేడాది దాదాపు 2,50,000 మంది డేరియన్ గ్యాప్‌ను దాటుకుని ముందుకు వెళ్లారు. ఇది కొలంబియా-పనామా సరిహద్దుల్లో ఉంటుంది. అక్కడినుంచి రోజుల తరబడి నడుచుకుంటూ ముందుకు సాగితే గానీ వలసదారుల రిసెప్షన్ కేంద్రానికి చేరుకోవటం సాధ్యం కాదు. అక్కడినుంచి కూరగాయల లారీల్లో పనామా సిటీకి తరలిస్తారు. ఆ తర్వాత బస్సు ద్వారా కోస్టారికా, నికారాగువా, హోండురాస్, గ్వాటెమాల దేశాల మీదుగా ప్రయాణించి, చివరికి మెక్సికో అమెరికా దేశాల సరిహద్దులకు చేరుకుంటారు. ఇక్కడే చాలామంది అమెరికా సరిహద్దు నిఘా సిబ్బందికి చిక్కుతారు.
రెండేళ్ల క్రితం రాజ్‌కుమార్ హిరానీ ‘డంకీ’ పేరుతో ఓ చిత్రం నిర్మించాడు. ఇందులో షారుఖ్ ఖాన్ హీరోగా నటించాడు. ఈ చిత్రం ద్వారా చాలామందికి అమెరికా వెళ్లాలనే ఆకాంక్ష, అందుకు అడ్దదారి ఉందనే అవగాహన పెరిగాయి. దాంతో మెక్సికో గుండా అమెరికా వెళ్లే వాళ్ల సంఖ్య పెరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు. హర్యానాకు చెందిన నిశాంత్ మోర్ ఇలా అడ్డదారుల్లోనే అమెరికాలో అడుగుపెట్టి చివరికి అక్కడ అధికారులకు చిక్కాడు. కానీ కొండలు, గుట్టలు, అడవులు, నదుల మీదుగా సాగిన తన అవస్థల ప్రయాణాన్ని సెల్‌ఫోన్ కెమెరాలో చిత్రీకరించాడు. ఆ తర్వాత ఫోన్లోనే ఎడిట్ చేసి ఆరు భాగాల సిరీస్ రూపొందించాడు. దీన్ని వివిధ భాషల్లో డబ్ చేసి సామాజిక మాధ్యమాల్లో అందుబాటులో ఉంచాడు. ఈ ప్రయాణం ఎంత ప్రమాదభరితమైందో అది చూసినప్పుడు అర్థమవుతుంది. అమెరికాలో బహిష్కరణకు గురై ఈ ఏడాది భారత్‌కు తిరిగివచ్చిన వలసదారులు తమ దయనీయ గాథలను ఏకరువు పెట్టారు. హృదయ విదారకమైన ఆ సంఘటనలు ఎవరినైనాసరే ఇట్టే కదిలిస్తాయి.
అడ్డదారుల్లో అమెరికాలో అడుగుపెడుతున్న వాళ్ల సంఖ్య ఏడాదికేడాది పెరుగుతూ వస్తున్నది. 2013 ప్రాంతంలో ఈ సంఖ్య నామమాత్రంగా ఉండేది. 2017 తర్వాత.. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే, 2019 తర్వాత నుంచి క్రమేణా పెరుగుతూ వచ్చింది. 2020-21లో 30 వేల మంది భారతీయులు ఈ ప్రయత్నం చేస్తే, మరుసటి ఏడాదే ఆ సంఖ్య రెట్టింపై 63,000కు చేరింది. అక్టోబరు 2022, సెప్టెంబరు 2023 మధ్య ఈ సంఖ్య 96,000కు చేరింది. ఇందులో ముప్పైవేల మంది కెనడాలో పట్టుబడితే, నలభై ఒక్కవేల మంది మెక్సికోలో దొరికిపోయారు. ఇది ఒక్క భారతదేశానికి మాత్రమే పరిమితమైన వ్యవహారం కాదు. అనేక దేశాలకు చెందినవారు డంకీ పద్ధతిలోనే అమెరికాలో అడుగుపెడుతున్నారు. ఇలా భారత్ కంటే ఎక్కువ సంఖ్యలో వెళ్తున్న వాళ్లలో అమెరికా సరిహద్దు పంచుకున్న మెక్సికో దేశస్తులూ ఉన్నారు. ఆసియా ఖండపు దేశాల్లో మాత్రం భారత్‌దే పైచేయి.
భారత్‌లో నిరుద్యోగ సమస్య కారణంగానే ఎక్కువమంది అమెరికా వైపు చూస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. ఇందుకు హర్యానా బలమైన ఉదాహరణగా నిలుస్తుంది. 2022 సెప్టెంబరులో సెంటర్ ఫర్ మానిటరింగ్ ఎకానమీ నివేదిక ప్రకారం దేశంలో నిరుద్యోగం అత్యధికంగా ఉన్న రాష్ట్రంగా హర్యానా నిలిచింది. ఇక్కడ నిరుద్యోగ రేటు జాతీయ సగటు కంటే నాలుగు రెట్లు అధికంగా 37.3 శాతంగా నమోదైంది. ఇక హర్యానా గ్రామీణ ప్రాంతాల్లో అయితే పరిస్థితి మరింత దయనీయం. దాంతో గ్రామీణులు ఎంత కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవటానికైనా సిద్ధపడుతున్నారు. హర్యానాలోని జింద్ జిల్లా ధరత్, మోర్ఖీ, కల్వా గ్రామాల ప్రజలు ‘డంకీ రూట్’ను ఎంచుకుంటున్నారు. తమకు ఉన్న పొలాన్ని, బంగారాన్ని అమ్మేసి మరీ ఈ దుస్సాహసానికి ఒడిగడుతున్నారు. ఇంకొంత మంది టూరిస్ట్ వీసాపై దుబాయ్ వెళుతున్నారు. ఓ హోటల్లో తాత్కాలికంగా బస చేస్తారు. ఆ తర్వాత సరకుల కంటైనర్ల ద్వారా రహస్యంగా ఇతర దేశాలకు ప్రయాణం కడుతున్నారని కొన్ని కథనాలు వెలువడ్డాయి.
హర్యానాకే చెందిన నిశ్చయ్ శర్మదీ ఇదే కథ. అతను పెద్దగా చదువుకోలేదు. దాంతో విద్యార్థి, జాబ్ వీసాలతో అమెరికాలో అడుగుపెట్టడానికి అవకాశం లేదు. దాంతో డంకీ ఫ్లైట్ మార్గాన్ని ఆశ్రయించాడు. తను చాలా అదృష్టవంతుడినని.. ఐదు నెలల్లోనే అనుకున్న గమ్యాన్ని చేరుకోగలిగానని నిశ్చయ్ గర్వంగా చెబుతాడు. తొమ్మిది దేశాల మీదుగా ప్రయాణించి కాలిఫోర్నియాకు చేరుకున్నాడు మరి!
చట్టపరమైన వీసా లేకుండా ఒక దేశంలోకి అడుగుపెట్టడం. లేదంటే చట్ట వ్యతిరేకంగా బ్యాక్ డోర్ ఎంట్రీ చేపట్టాన్ని ‘డంకీ’ అంటారు. మొదట్లో ఈ పదాన్ని బ్రిటన్‌కు అడ్డదారుల్లో వెళ్లేవారికి మాత్రమే ఉపయోగించేవాళ్లు. ఒకప్పుడు చాలామంది భారతీయులు బ్రిటన్‌లో అడుగుపెట్టడానికి ఈ మార్గాన్ని ఆశ్రయించేవాళ్లు. మొట్టమొదట వాళ్లు యూరప్‌లోని స్వేచ్ఛా సంచార ప్రాంతమైన షెంజెన్ జోన్లో అడుగుపెడతారు. అది 27 ఐరోపా ఖండపు దేశాల సమాహారం. దీనికి షెంజెన్ వీసా అవసరం అవుతుంది. ఈ వీసా ఉంటే ఎవరైనా పక్కదేశాలకు అడుగుపెట్టవచ్చు. షెంజెన్ జోన్లో బ్రిటన్ భాగం కాదు. కానీ ఇది కూడా ఐరోపా దేశమే కావడంతో… వివిధ మార్గాల ద్వారా ఎవరైనా అక్కడ అడుగుపెట్టడానికి దారి దొరుకుతుంది. కార్లలో, ట్రక్కులలో ప్రయాణించవచ్చు. కాలినడకన ప్రయాణించి కూడా బ్రిటన్‌కు చేరుకోవచ్చు.
మైగ్రేషన్ పాలసీ ఇన్స్టిట్యూట్ నివేదిక ప్రకారం పదేళ్ల క్రితం దాదాపు 150 మంది భారతీయులు బ్రిటన్ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఈరోజు ‘డంకీ’ విధానంలో అనేక అడ్డదారులు కనిపిస్తున్నాయి. అలాగే ఎక్కువమంది బ్రిటన్‌కు బదులుగా అమెరికా వెళ్తున్నారు. డంకీ మార్గంలో అమెరికాలో అడుగుపెడుతున్న వారిలో మనదేశంలో గుజరాత్, పంజాబ్, హర్యానా రాష్ర్టాల నుంచి ఎక్కువమంది ఉంటున్నారు.
అమెరికాకు సులువుగా చేరుస్తామన్న తియ్యటి మాటలు నమ్మి చాలామంది బ్రోకర్ల ఉచ్చులో చిక్కుకుంటారు. ఇది మొదటి అబద్ధం కాగా, అక్కడ అడుగుపెట్టగానే మంచి ఉద్యోగం మీకు స్వాగతం పలుకుతుందనేది రెండో అబద్ధం. ప్రయాణంలో కష్టనష్టాలను, అమెరికాలో కఠినమైన చట్టాల గురించి వివరిస్తే అడ్డదారుల్లో వెళ్లాలనుకునే వాళ్లు వెనకా ముందూ ఆలోచిస్తారు. కానీ డబ్బు ఆశతో బ్రోకర్లు నిజాలు దాచిపెడతారు. వీసా పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నవాళ్లు ఇది తప్ప మరో ప్రత్యామ్నాయం లేదన్న భావనతో బ్రోకర్లు చెప్పినట్టల్లా నడుచుకుంటారు. ఇందుకోసం ఆస్తులను తెగనమ్ముకుంటారు. జీవితకాలం పాటు దాచుకున్న డబ్బుల్ని పణంగా పెడతారు. అందమైన భవిష్యత్తు కోసం అప్పులు చేస్తారు. చిట్టచివరకు మధ్యవర్తులు, ఏజెంట్లు, బ్రోకర్ల చేతిలో మోసపోయి లబోదిబోమంటారు.
అమెరికా వెళ్లడానికి సంబంధించి రకరకాల ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయని బ్రోకర్లు నమ్మబలుకుతారు. డీలక్స్ ట్రావెల్ ప్యాకేజీ అంటే.. నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి ఇవ్వటం, అలాగే ప్రయాణానికి సహకరించటం లాంటివి ఇందులో ఉంటాయి. తక్కువ బడ్జెట్లో పని పూర్తి కావాలంటే.. ఏజెన్సీలు మిమ్మల్ని సరిహద్దు దగ్గర వదిలేస్తాయి. మిగిలిన దూరం కాలినడకన ప్రయాణించవలసి ఉంటుంది. ఎంచుకున్న ప్యాకేజీ ప్రకారం.. ఏజెన్సీలు 35 లక్షల నుంచి 60 లక్షల రూపాయల వరకు, కొన్నిసార్లు కోటి రూపాయల దాకా వసూలు చేస్తున్నాయి. కానీ రెగ్యులర్ వీసాకు ఇంత ఖర్చుచేయాల్సిన పని లేదన్న ఆలోచన కలిగితే ఎవరూ ఈ మార్గంలోకి రారు. కావాలని కష్టాలను కొని తెచ్చుకోరు.
ఆయా వ్యక్తులు సరిహద్దు దాటిన తర్వాత ఏం చేస్తారు? పోలీసుల నుంచి తప్పించుకుంటూ రహస్యంగా జీవిస్తారా? అంటే అదేం లేదు. ఆశ్చర్యకరంగా చాలామంది సరిహద్దుల్లో కావలి కాస్తున్న సరిహద్దు నిఘా సిబ్బంది ఎదుట లొంగిపోతారు. అధికారుల నుంచి దాగుడుమూతలు ఆడటం కాకుండా అక్కడున్న వారిని కలిసి వాళ్లు చెప్పినట్టల్లా నడుచుకుంటారు. ఇందుకు కారణం అమెరికా గడ్డమీద అడుగుపెట్టగానే ప్రభుత్వం నుంచి వాళ్లు రక్షణ కోరుకోవటం. దాన్ని ‘ఎసైలం’ (శరణుకోరడం) అంటారు. ఐక్యరాజ్య సమితి శరణార్థుల సంస్థ నిర్వచనం ప్రకారం.. ఎసైలం కోరుకునే వ్యక్తికి సంబంధిత దేశం తమ దేశంలో నివసించేందుకు అంగీకరిస్తుంది. అలాగే వారికి రక్షణ కల్పించేందుకు సమ్మతిస్తుంది. ఇందుకు ‘డంకీ రూట్’లో పరాయి దేశానికి రావటానికి గల కారణాలను బాధితులు నివేదించుకోవాలి. ఇందులో ఐదారు రకాలు ఉంటాయి.
తమ స్వదేశంలో ఏ రకమైన వివక్షను ఎదుర్కొన్నారో వాళ్లు వివరించవలసి ఉంటుంది. అది రాజకీయపరంగానా, మతపరంగానా, జాతి, కుల పరంగానా? ఎలాంటి వివక్షను ఎదుర్కోన్నారు అనేది చెప్పగలగాలి. మహిళలు, ఎల్జీబీటీ సమాజంలో ఉండటం వల్ల ఇబ్బందులు ఎదురైతే, ఆ విషయాన్ని చెప్పాలి. ఇలాంటి నేపథ్యం ఉన్నప్పుడు కొన్నిసార్లు ప్రాణాంతకమైన పరిస్థితులు ఏర్పడతాయి. సాంకేతికంగా మరెన్నో రకాల పరిస్థితులు ఉన్నా ఎక్కువమంది ప్రస్తావించే అంశాలు వీటిలో ఏవో ఒకటి అయ్యుంటాయి.
ఎసైలం కోరుకునే వ్యక్తులు తమ పరిస్థితిని ఇమ్మిగ్రేషన్ కోర్టులో.. జడ్జి ముందు నివేదించుకోవాలి. దీన్ని పరిగణనలోకి తీసుకోవాలా వద్దా అనేది న్యాయమూర్తి నిర్ణయంపైన ఆధారపడి ఉంటుంది.
ఇకపోతే తాము ప్రస్తావించే అంశాలు యథార్థమైనవని నిరూపించగలగాలి. అది అబద్ధమని తేలితే బహిష్కరణ (డిపోర్టేషన్)కు గురవుతారు. అబద్ధం చెప్పి పట్టుబడితే ఆ వ్యక్తిమీద నిషేధం విధిస్తారు. అప్పుడు అప్పటి దాకా ఖర్చుపెట్టిన లక్షల సొమ్ము దుర్వినియోగం కావటంతోపాటు భవిష్యత్తులో చట్టపరంగా కూడా అమెరికాలో అసలే అడుగుపెట్టలేని పరిస్థితి దాపురిస్తుంది.
ఎసైలం విధానంలో వ్యక్తులు ఎన్నో కష్టాలను భరించవలసి ఉంటుంది. దర్యాప్తునకు నెలల తరబడి, కొన్నిసార్లు సంవత్సరాలు గడిచిపోతాయి. అన్ని రోజుల తర్వాత కూడా అబద్ధం చెబుతున్నారని తేలితే ముందే చెప్పినట్టు బహిష్కారానికి గురికావలసి వస్తుంది. మరో విషయం ఒక వ్యక్తి సరిహద్దులు దాటి ఆ దేశంలో అడుగుపెట్టిన వెంటనే ఇమ్మిగ్రేషన్ కోర్టులో హాజరుపరచరు. ముందుగా వారిని డిటెన్షన్ సెంటర్‌కి తరలిస్తారు. అక్కడ పరిస్థితులు అత్యంత దయనీయంగా ఉంటాయి. ఒక చిన్నగదిలో లెక్కలేనంత మంది కిక్కిరిసి ఉంటారు. అధికారుల పిలుపు వచ్చేవరకూ అక్కడ కొన్ని వారాలపాటు, ఒక్కోసారి నెలల వరకు గడపాలి. మీకు బయటికి వెళ్లే స్వేచ్ఛ ఉండదు. ఇతరులతో గడపటానికి అనుమతించరు. ఇలాంటి పరిస్థితుల్లో గడపటం అనేది ఎవరికైనా దుర్భరంగా ఉంటుంది. అదీకాక పేదరికం తదితర కారణాల వల్ల చట్టపరమైన సలహాలు, సంప్రదింపులకు కూడా ఆస్కారం ఉండదు.
అక్రమ వలసలను అడ్డుకునేందుకు అమెరికా పటిష్ఠమైన చర్యలు తీసుకుంది. సరిహద్దు భద్రతను కట్టుదిట్టం చేసింది. నిఘాను, పెట్రోలింగ్‌ను ముమ్మరం చేసింది. దీనికి సంబంధించిన మౌలిక వసతులను మెరుగుపరచడానికి చర్యలు చేపట్టింది. ఈ అంశంలో దౌత్యపరంగా ముందుకువెళ్లి అమెరికాతో చర్చించేందుకు భారత్ ముందుకువచ్చింది. తగిన పత్రాలు లేకుండా అమెరికాలో అడుగుపెట్టినవారిని వెనక్కి తీసుకునేందుకు సంసిద్ధత ప్రకటించింది. ఈమేరకు అమెరికా నుంచి అక్రమ వలసదారులు భారత్‌కు తిరిగి వస్తున్నారు. అలాగే చట్టపరంగా వీసాలు పొందటానికి ఉన్న అవకాశాలను మెరుగుపరచటం, సురక్షితమైన, చట్టపరమైన వలసలను ప్రోత్సహించడం, అక్రమ వలసదారులకు సంబంధించిన సమాచారం ఇచ్చి పుచ్చుకోవటంలో రెండు దేశాలు కలిసి పనిచేస్తున్నాయి. ఇది నిజంగా శుభ పరిణామం. అది అక్రమ వలసలపైన ప్రభావం చూపుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు.
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి నెలలో.. అంటే 2025 ఫిబ్రవరిలో దాదాపు 11వేల మంది అక్రమ వలసదారులను వెనక్కి పంపామని ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ ప్రకటించింది. 2024 ఫిబ్రవరిలో బైడెన్ హయాంలో వెనక్కి పంపిన వారికంటే ఈ సంఖ్య తక్కువని కొన్ని అమెరికన్ పత్రికలు కథనాలు ప్రచురించాయి. అప్పట్లో 12 వేల మందిని వెనక్కి పంపారు. దీనికి సంబంధించి ట్రంప్ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఈ ఏడాదితో పోలిస్తే గత ఏడాది బోర్డర్ క్రాసింగ్స్ అధికంగా ఉండేవి. అక్కడికక్కడే వాళ్లను అరెస్టు చేసి పంపించేవారు. అమెరికాలో అడుగుపెట్టనిచ్చి విచారణల అనంతరం వెనక్కిపంపటం కంటే అప్పటికప్పుడు పంపేయటం సులువు. అలా చూసుకున్నప్పుడు బైడెన్ హయాంలో 2,100 మందిని పంపితే, ఇప్పుడు 4,300 వలసదారులను వెనక్కి పంపామని ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది.
ప్యూ రీసెర్చి సెంటర్ 2022లో వెలువరించిన నివేదిక ప్రకారం అమెరికాలో 7,25,000 మంది తగిన పత్రాలు లేకుండా అక్రమంగా ఉన్నారు. మెక్సికో, ఎల్ సాల్వడార్ దేశాల తర్వాత మూడో స్థానంలో భారతీయులు ఉన్నారు.
భారత విదేశాంగ శాఖ లెక్కల ప్రకారం 2009 నుంచి 2024 వరకూ దాదాపు 16వేల మంది భారతీయులను అమెరికా వెనక్కి పంపింది.
ట్రంప్ రెండో మారు అధికారం చేపట్టిన తర్వాత 205 మందిని ఒకసారి, 116 మందిని ఒకసారి, 104 మందిని ఇంకోసారి వెనక్కి పంపించారు. నేరస్తుల
మాదిరిగా కాళ్లకు చెయిన్లు, చేతులకు బేడీలు వేసి పంపటం బాధితులను ఆవేదనకు గురిచేసింది.
శారీరక సమస్యలు: ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్య అడవులు, కొండలు, గుట్టలు, పర్వతాలు, లోయలు నదుల మీదుగా సాగే ప్రయాణం అనేక శారీరక సమస్యలకు దారితీస్తుంది.
ఆరోగ్య సమస్యలు: ప్రయాణంలో తీవ్రంగా గాయపడటం, ప్రమాదాలకు గురికావటంతోపాటు మలేరియా, డెంగీ, కలరా లాంటి వ్యాధులు చుట్టుముట్టే ప్రమాదం ఉంది.
మానసిక సమస్యలు: ఈ ప్రయాణం మానసికంగా ఎంత భయపెడుతుందంటే చాలామంది ఆందోళన, కుంగుబాటు, పీటీఎస్డీ వంటి మానసిక వ్యాధుల బారినపడతారు.
ఆకలి, దాహం: ఆహారం, నీరు లేకుండా రోజుల తరబడి గడపవలసిన పరిస్థితులు ఎదురవుతాయి. దాంతో బాధితులు పస్తులు ఉండవలసి వస్తుంది. డీ హైడ్రేషన్ ముప్పు ఉంటుంది.
ఆత్మీయులను కోల్పోవడం : కొన్ని సందర్భాల్లో తమ కుటుంబసభ్యులను కోల్పోవటమో, వారి నుంచి తప్పిపోవటమో సంభవిస్తుంది.
భయం, అనిశ్చితి: తమకు అంతగా పరిచయం లేని ప్రాంతంలో సంచరించటం, అనేక సవాళ్లు ఎదుర్కోవలసి రావటం తదితర కారణాల వల్ల చాలామంది భయం, అనిశ్చితిల మధ్య నలిగిపోతారు.
వన్యప్రాణులతో సమస్యలు: విషసర్పాలు, సాలీళ్లు, ఇతర విషప్రాణులు, మృగాలతో కూడిన అడవులు కొన్నిసార్లు ప్రాణాంతకంగా పరిణమిస్తాయి.
మానవ అక్రమ రవాణా: స్మగ్లర్లు, ఇతర సంఘవిద్రోహ శక్తుల నుంచి ముప్పు పొంచి ఉంటుంది. అవినీతి అధికారులు, దోపిడీ: మార్గమధ్యంలో తారసపడే పోలీసులు, మిలిటరీ అధికారులకు ముడుపులు సమర్పించుకోవలసిన పరిస్థితులు ఎదురవుతాయి.