ఆనందకరమైన సంఘటనలను ఎలా గుర్తుచేసుకుంటామో.. కొన్నిసార్లు మనల్ని భయపెట్టే సందర్భాలు కూడా జీవితాంతం గుర్తుండిపోతాయి. అలాంటి సంఘటనే ఇది. జరిగింది ఏప్రిల్ 28, 1980. నాకు అప్పుడు పదిహేడేళ్లు, అక్కకు పంతొమ్మిది ఉంటాయి.
సాయంత్రం అవుతున్నది. ఎండాకాలం ఎండలో తీక్షణత అప్పుడప్పుడే తగ్గుతున్నది. పశువుల కాపర్లు గుంపులుగుంపులుగా పశువుల్ని అదిలిస్తూ ఇంటిదారి పట్టారు. కాలి గిట్టల దుమ్ము పైకిలేస్తూ.. గాలి నిండా ఆ ధూళి నిండి కొంత వెలుగును కమ్మేస్తూ ఉంది. రైతులు కూడా మెల్లమెల్లగా ఇంటిదారి పడుతున్నారు. కనిపిస్తున్న కొన్ని పెంకుటిళ్ల చూరుల్లోంచి వంటలు చేస్తున్న గుర్తుగా పొగ సుళ్లు తిరుగుతూ ఉంది. గుడిసెల ముందు కట్టెల పొయ్యిలు వెలిగించి వంటలు మొదలుపెట్టారు. మమ్మల్ని అక్కడ దింపిన సవారీ కచ్చడం బండి వెళ్లిపోయి కూడా అరగంట దాటింది. ఇంకా బస్సు జాడే లేదు. నేనూ, అమ్మా, అక్కా ఓ చెట్టు కింద రాతి అరుగు మీద సర్దుకుని కూర్చున్నాం.
“వాళ్లు ఉండమన్నప్పుడు అక్కడ్నే ఉంటె అయిపోయేది. ఈ బస్సింక రాకపాయె! చీకటి పడబట్టె!”.. అమ్మ గొంతులో కొంచెం దిగులు ధ్వనించింది. “ఎట్లుంటమమ్మా?! మనం బట్టలు గిన తీస్కపోకపోతిమి. రేపు ఇగ టైం ఎక్కడుంటది? పగలు అన్నాలు తినంగనె వాండ్లు గుట్టకు బయల్దేరుడేనాయె! మళ్ల వాండ్లు పొయ్యేది గూడ మనూరు మీంచి కాదు. వేరే రూట్ల పోతరు”అన్నది అక్క. అవునన్నట్లు అమ్మ తల ఊపింది.
ఎల్లుండే యాదగిరిగుట్టలో మా చిన్నాయన కూతురు సరస్వతక్క పెండ్లి. ఇవాళ పెళ్లి కూతుర్ని చేసే కార్యక్రమం ఉందంటే.. నిన్ననే మా తాతయ్య వాళ్ల ఊరు కూనూరుకు వచ్చాం. నిన్న జీతగాడు మా సవారీ కచ్చడంలోనే మా ముగ్గుర్నీ కూనూరులో దింపాడు. పొలం దగ్గర పని ఎక్కువ ఉండటంతో బండిని తీసుకుపొమ్మనీ, మేము బస్సులో వస్తామనీ చెప్పి అతణ్ని నిన్ననే పంపేశాం.
ఇవాళ కార్యక్రమాలన్నీ పూర్తయి భోజనాలు అయ్యేసరికే బాగా ఆలస్యమైంది. మేము బయల్దేరి మా ఊరు ఘనపూర్ వెళ్లాలి. మళ్లీ బట్టలు సర్దుకుని రేపు సాయంత్రానికల్లా మగపెళ్లి వాళ్లొచ్చే సరికే.. యాదగిరిగుట్టకు చేరుకోవాలి. మాకు యాదగిరిగుట్ట దగ్గరే. ఓ గంట ప్రయాణం. అదే మా చిన్నాన్న వాళ్లకైతే రెండు గంటలు పడుతుంది. పైగా కూనూరుకు, మా ఊరికి మధ్య ఉప్పుగల్లు వద్ద పెద్ద వాగు అడ్డు ఉంటుంది. వర్షాకాలంలో ఆ వాగు పొంగి పొర్లుతుంది. అలాంటప్పుడు రాకపోకలు ఉండవు. మామూలప్పుడు కూడా మా ఊరి నుంచి ఎక్కువసార్లు బండిలో వెళ్లేవాళ్లం. బస్సులో వెళ్తే ఉప్పుగల్లులో దిగి వాగు నుంచి మూడు కిలోమీటర్లు నడిచి కూనూరు వెళ్లడమో, అవతలి నుంచి మా చిన్నాన్న వాళ్లు బండి పంపిస్తే వెళ్లడమో చేసేవాళ్లం. వాళ్లు ఇటు రావాలన్నా కూడా అంతే !
పెళ్లి కూతుర్నీ, ఇతర సామాన్లూ తీసుకుని రావడానికి మా వాళ్లు రెండు జీపులు, ఓ చిన్న ఓపెన్ టాప్ వ్యాన్ మాట్లాడారు. పెళ్లి కొడుకు వాళ్లు హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్టకు రావడానికి వాళ్లకోసం ఓ బస్సు మాట్లాడి పంపారు. ఇక అమ్మాయి తరఫు వాళ్లకు కూడా ఓ బస్సు పెట్టాలంటే కష్టం. పెళ్లి యాదగిరిగుట్టలో చేస్తామనే మొక్కు ఉండటం వల్ల.. యాదగిరిగుట్టకు వెళ్లాల్సి వచ్చింది. వీలైనవాళ్లు ఎవరికి వారు వస్తే చిన్నాన్న వాళ్లూ, మా మేనత్తలూ ఆ రెండు జీపుల్లో రావచ్చని అనుకున్నారు. తీరా మేము ప్రయాణమయ్యేసరికి.. “అయ్యో! మీరెందుకు పోవుడు?! మా తోనే ఒస్తే అందరం కల్సి పోవొచ్చు గద!” అన్నారు వాళ్లు. కానీ, మేమేమో ఇంటికి వెళ్లి వద్దామనుకుని పెళ్లికి సరిపడా బట్టలు తెచ్చుకోలేదు. వాళ్లే ఒక మొద్దు బండి (సామాన్లు తెచ్చేది) ఏర్పాటు చేసి, మమ్మల్ని ఉప్పుగల్లులో దింపి రమ్మని పంపారు. మాతో వచ్చినతను మేము ఇక్కడ దిగగానే.. “ఇగ గీడనే బస్సు ఆగుతది. ఈడ కూకోండి” అని చెప్పి వెళ్లిపోయాడు. కానీ, బస్సు ఎంతకూ రాలేదు. చూస్తూ ఉండగానే చీకటి చిక్కబడటం మొదలైంది. ఈ ఉప్పుగల్లు ఊరు కల్లుకు ప్రసిద్ధి. మేము కూర్చున్న చోటికి కొద్దిదూరంలోనే ఊరు ఆఖరవుతున్న చోట దట్టంగా తాటి చెట్లున్నాయి. వాటి కింద కూర్చుని బోలెడు మంది కుండల్లో కల్లు తాగుతున్నారు. ఇంకొంత మంది కుండల్లో, సీసాల్లో కొనుక్కుపోతున్నారు.
“ఇక్కడ సైకిళ్లు కిరాయికి దొరుకుతయో! నేనొకటీ, నువ్వొకటీ తీసుకోని పోవచ్చు. అమ్మను నేను వెనుక కూచోబెట్టుకుంట” అని.. వెంటనే నాలుక కర్చుకున్నాను. అక్కకు సైకిల్ తొక్కడం అంత బాగా రాదు. పైగా పది కిలోమీటర్లు. “ఏదన్న బండి బాడుగకు దొరికితే బాగుండు!” అంది అమ్మ ఏదో ఆలోచిస్తూ. అప్పటికి చీకటి పెరిగింది. వీధి దీపాలు వెలిగాయి. కొందరిళ్లలో లైట్లు, మరి కొందరిళ్లల్లో దీపాలు వెలిగాయి.
“ఇక్కడెవ్వరు తెలువదాయె.. ఎవరినడుగుతం?!” అంటూ చుట్టూ చూసింది అమ్మ. మాకు ఎదురుగానే పెద్ద భవంతి ఉంది. అది ఆ ఊరి దొరది అనుకుంటా! ఓ వైపు ప్రహరీ రాళ్లు కూలి ఉండటం వల్ల.. లోపలి భాగం కొంచెం కనిపిస్తున్నది. నగిషీ చెక్కిన దర్వాజలతో, కిటికీలతో పెద్ద ఇల్లు, మేడపైన కూడా గదులు ఉన్నట్టున్నాయి. వరండాలో ఒకాయన ఆరామ్ కుర్చీలో కూర్చుని.. దానికే అమర్చి ఉన్న పొడవాటి కర్రచేతులపై కాళ్లు చాపుకొని సిగరెట్ కాలుస్తూ ఉన్నాడు. బుర్ర మీసాలతో ఉన్న ఆయన్ను చూస్తే.. సినిమాల్లో ఎస్వీ రంగారావు గుర్తొచ్చాడు. పక్కనే ఒకతను వంగి ఆయన కాళ్లకు ఏదో నూనె రాస్తూ మసాజ్ చేస్తున్నాడు. “ఈ బస్సుకేం రోగం పుట్టిందో ఏమో!”.. అమ్మ విసుగ్గా అన్నా, ఆ కంఠంలో దిగులు తెలిసింది. ఎవరినైనా అడుగుదామన్నా.. ఆ తాటిచెట్ల దగ్గర తప్ప పెద్దగా జనసంచారమే లేదు.
ఉన్నట్టుండి ఆ మసాజ్ చేసే ఆయన మా వైపు రావడం కనిపించింది. ధోతీ మోకాళ్ల పైకి ఎగగట్టి, నడుము చుట్టూ తుండు చుట్టుకుని వేగంగా నడుచుకుంటూ అతను మా దగ్గరికి వస్తుంటే.. మాకు మొదటిసారిగా భయం వేసింది. దూరం నుంచి చూసినదానికన్నా దగ్గరికొచ్చాక అతను ఇంకా క్రూరంగా ఉన్నాడు. పెద్ద మీసాలతో, దట్టమైన కనుబొమ్మలతో, ఎత్తుగా, నల్లగా ఉన్న అతణ్ని చూసి మా భయం రెట్టింపైంది. అక్కణ్నుంచి ఎలా బయటపడ్డాం.. మళ్లీ ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నాం.. ఆ ముచ్చట్లు వచ్చేవారం.