‘సార్..! శ్రీలంకలోని ఇండియన్ ఎంబసీ నుంచి ఫోన్ వచ్చింది. మీరు త్వరగా రాగలరా?’ అటునుంచి కానిస్టేబుల్ ఫోన్. విషయమేంటని ఆరా తీశాడు ఇన్స్పెక్టర్ రుద్ర. తనకేమీ వివరాలు చెప్పలేదని, ఇన్స్పెక్టర్ రాగానే, ఒకసారి ఫోన్ చేయమన్నారని అటునుంచి సమాధానం. దీంతో చేసేదేమీలేక, స్టేషన్‌కు బయల్దేరాడు రుద్ర. ‘ఏంటి నాన్నా..! ఈ రోజు సాయంత్రం ఇంట్లో ఫంక్షన్ ఉంది. సెలవు పెట్టమన్నాను కదా..!’.. ఆప్యాయంగా పలకరించింది రుద్ర అమ్మగారు రూప.
‘ఏం చేయమంటావ్.. అమ్మా? ఏదో ఎంబసీ వాళ్లు ఫోన్ చేశారట. నాతోనే మాట్లాడాలన్నారట. అలా వెళ్లి.. ఇలా వస్తా?’ అంటూ సర్దిచెప్పాడు రుద్ర. ఇన్స్పెక్టర్ వాళ్లింట్లో ఆ రోజు చిన్న ఫ్యామిలీ గెట్ టు గెదర్ ఫంక్షన్ ఉంది. దీనికి కుటుంబసభ్యులతోపాటు దగ్గరి బంధువులు కూడా హాజరవుతారు. ఆ రోజు కోసమే రుద్ర ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాడు. ఇంతలో ఈ ఫోన్! స్టేషన్‌కు చేరుకోగానే… ఎంబసీ అధికారులకు కనెక్ట్ అయ్యాడు. భార్యతో శ్రీలంక టూర్‌కు వెళ్లిన భర్త అక్కడే అనుకోని పరిస్థితుల్లో మృత్యువాత పడ్డాడు. యాక్సిడెంట్‌గా కేసును నమోదు చేసిన అక్కడి పోలీసులు వివరాలను ఎంబసీకి ఇచ్చారు. మృతదేహాన్ని స్వదేశానికీ పంపించేశారు. ఆ వివరాలనే ఎంబసీ అధికారులు ఫోన్లోనే కాకుండా మెయిల్ ద్వారా కూడా రుద్రకు తెలియజేశారు. తన స్టేషన్ పరిధిలోనే బాధితుడు నివసిస్తుండటంతో ఈ వివరాలు ఇచ్చినట్టు వెల్లడించారు. ‘సరే..!’ అంటూ రుద్ర ఫోన్ పెట్టేస్తుండగా.. అటునుంచి పోలీసు అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘మా వరకు మేము కేసు దర్యాప్తు పూర్తిచేశాం. మీకు అనుమానాలు ఉంటే, మళ్లీ రీ-ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చు’ అని చెప్పారు. ‘ఎందుకు? మీరు దర్యాప్తు సరిగ్గా చేయలేదా?’ అంటూ రుద్ర సూటిగా ప్రశ్నించాడు. ‘అదేం లేదు. కేసు మూసివేసే ముందు, ఒకసారి చూసుకోండి అని చెప్తున్నా. ఏ వివరాలు కావాల్సినా ఇస్తాం’ అన్నాడు ఆ అధికారి. కేసు ఫైల్‌ను స్టడీ చేసి డౌట్స్ ఉంటే, ఫోన్ చేస్తానని బదులిచ్చాడు రుద్ర. మెయిల్ చెక్ చేశాడు.
కల్యాణ్, రేణు నూతన దంపతులు. ఆరు నెలల కిందటే పెండ్లయ్యింది. పెద్దలు కుదిర్చిన వివాహం. హనీమూన్ కోసమని శ్రీలంక వెళ్లారు. నాలుగు రోజుల తర్వాత రిటర్న్ అవ్వాలని ప్లాన్. అయితే, ఎల్లా టౌన్‌లోని ‘కుడా రావణా’ జలపాతం దగ్గర ఫొటోలు దిగుతూ ప్రమాదవశాత్తూ కల్యాణ్ లోయలో పడిపోయి మరణించాడు. ఇదే విషయమై రేణు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తిచేసిన అక్కడి పోలీసులు, ఎంబసీ అధికారులు కల్యాణ్ డెడ్‌బాడీని భారత్‌కు తరలించారు. కేసు ఫైల్‌ను పూర్తిగా చదివేసిన రుద్ర.. ‘ఇందులో మళ్లీ రీ-ఇన్వెస్టిగేట్ చేయడానికి ఏముంది?’ అని తనలో తాను అనుకొన్నాడు. ‘రేణు ఒకసారి స్టేషన్‌కు రాగలరా? కనుక్కో’మని కానిస్టేబుల్‌ను పురమాయించాడు. ‘సార్.. ఆమె గంటలో వస్తారట’ కానిస్టేబుల్ సమాధానం. సరేనన్నట్టు తలాడించాడు రుద్ర. రేణు స్టేషన్‌కు వచ్చింది.
కేసు ఫైల్‌ను క్షుణ్ణంగా చదివినప్పటికీ, మరోసారి ఆమెను వివరాలు అడిగాడు రుద్ర. ఫైల్లో ఉన్న విషయాలనే రేణు కూడా చెప్పింది. శ్రీలంక నుంచి రాగానే, కల్యాణ్ మృతదేహాన్ని తమ సంప్రదాయం ప్రకారం దహనం చేశామన్నది. ఇంకా ఏదో అడగబోయాడు రుద్ర. ‘సార్..! ప్లీజ్. ఆ రోజు ఏం జరిగిందో.. అక్కడి పోలీసులకు, అక్కడి ఎంబసీకి, ఇక్కడి ఎంబసీకి పదేపదే చెప్పి ఎంతో అలసిపోయా! మీకూ అన్నీ చెప్పా. ఇక, చెప్పడానికి నా దగ్గర ఏమీ లేదు. గుచ్చిగుచ్చి అడుగుతూ.. నా భర్త మరణాన్ని గుర్తుచేస్తూ నన్ను ఇంకా బాధపెట్టొద్దు’ అంది రేణు.
అవునన్నట్టు తలూపాడు రుద్ర. ఆమె చెప్పినట్టే కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలూ సరిగ్గానే ఉన్నాయి. ఇంతలో రుద్ర.. ‘మేడం.. ఈ టూర్ ప్లాన్ ఎవరిది?’ సూటిగా ప్రశ్నించాడు. ‘నాదే!’ తడుముకోకుండా ఆమె సమాధానం ఇచ్చింది. ‘టైమ్ వేస్ట్ కాకూడదని టూర్‌కి వెళ్లడానికి ముందే రిటర్న్ ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేశా. అంతా ప్రీ-ప్లాన్డ్‌గానే వెళ్లాం.. ఇంతలో..’ అంటూ వస్తున్న దుఃఖాన్ని ఆపుకొంది రేణు. నిజానికి, రేణు చెప్పినట్టే.. ఆమె రిటర్న్ ఫ్లైట్ టికెట్ ప్రయాణానికి ముందే బుక్ చేసి ఉంది. కల్యాణ్ మరణించడంతో ఎంబసీ వాళ్లు ప్రత్యేక విమానంలో డెడ్‌బాడీని పంపించినట్టు ఆమె చెప్పింది. అవునన్నట్టు తలాడించాడు రుద్ర. కల్యాణ్‌ది ప్రమాదం వల్ల జరిగిన మరణమేనని నిశ్చయానికి వచ్చిన రుద్ర.. చేసేదేమీలేక రేణును వెళ్లొచ్చని చెప్పాడు. కేసు కొలిక్కి రావడంతో ప్రశాంతంగా ఇంటికి బయల్దేరాడు రుద్ర.
కుటుంబసభ్యులు, బంధువులతో ఇల్లంతా ఓ పండుగలా ఉంది. ఆత్మీయులతో కాసేపు ముచ్చటించిన రుద్ర.. డిన్నర్‌కు సిద్ధమయ్యాడు. ఇంతలో.. ‘తిన్న తర్వాత నేను వెళ్తానురా..’ అంటూ రుద్ర మామయ్య సందీప్ అన్నారు. ‘అదేంటి.. మామయ్య? అత్తవాళ్లు రెండ్రోజులు ఉంటాం అన్నారుగా’ అన్నాడు రుద్ర. ‘వాళ్లు ఉంటార్రా.. నేను రాత్రి బస్సుకు వెళ్తా. నా ఒక్కడికే రిటర్న్ టికెట్ తీశా’ అన్నాడు సందీప్. ‘సరే..’ అన్నట్టు తలూపిన రుద్రకు ఏదో క్లూ దొరికినట్టు అనిపించింది. వెంటనే, భోజనం ముగించి ‘అమ్మా.. మళ్లీ ఇప్పుడే వస్తా..!’ అంటూ స్టేషన్‌కు కారు తీశాడు రుద్ర.
స్టేషన్లోకి వెళ్లి సరాసరి కల్యాణ్ కేసు ఫైలు తెరిచాడు. రుద్ర కండ్లు మెరిశాయి. అతని అనుమానమే నిజమైంది. కల్యాణ్‌ది ప్రమాదవశాత్తూ జరిగిన మరణం కాదు.. హత్య అని నిర్ధారించుకున్నాడు. రేణును మరుసటి రోజు ఉదయమే స్టేషన్‌కు రమ్మన్నాడు. మర్నాడు రేణు స్టేషన్‌కు వచ్చింది. ‘ఏమిటి సార్.. మళ్లీ పిలిచారు’ అని ఆమె అడుగబోతుండగా.. ‘మీ భర్తను ఎందుకు చంపారు?’ అని సూటిగా ప్రశ్నించాడు రుద్ర. ‘నేనెందుకు ఆయన్ను చంపుతానని’ రేణు అనేలోపే తన చేతిలోని ఫ్లైట్ టికెట్స్ ఆమెకు చూపించాడు రుద్ర. ఇంతకీ, కల్యాణ్‌ను రేణునే హత్య చేసిందని రుద్ర ఎలా కనిపెట్టాడంటారు??