ఆహారమనేది మనిషి జీవితంలోముఖ్యమైన భాగం. అయితే ఏం తింటున్నాం.. ఎలాతింటున్నాం అన్నది కూడా చాలా అవసరం. అదేంటి? అందరూ ఒకేలా తింటారు కదా అంటారా?అలా అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఒక్కో మనిషి తినే విధానం ఒక్కోరకంగా ఉంటుంది.అందులో కొన్ని ఆరోగ్యానికి మంచివైతే, మరికొన్ని అనారోగ్యాన్ని మోసుకొస్తాయి.మీ ఈటింగ్ కాన్సెప్ట్‌ను బట్టి… విషయం ఉంటుందన్నమాట!
ఫాగ్ ఈటింగ్
ఈ ఫాగ్ ఈటింగ్‌కు మరోపేరు మైండ్‌లెస్ ఈటింగ్. ఈ పద్ధతి మనకు సుపరిచితమే! కొవిడ్ సమయంలో చాలామంది బోర్ డమ్‌ను అనుభవించారు. అప్పుడే ఫాగ్ ఈటింగ్‌కు అలవాటుపడ్డారు. చాలామంది ఇప్పటికీ అదే పాటిస్తున్నారు. ఇంతకీ ఫాగ్ ఈటింగ్ అంటే ఎంటో చెప్పలేదు కదూ.. టీవీ చూస్తూ మిర్చీల్లాంటివి లాగించడం, కంప్యూటర్ మీద వర్క్ చేస్తూ… పిజ్జాలు నమిలేయడం, బోర్‌గా ఫీల్ అయినా ఏదో తింటూ కాలక్షేపం చేయడం.. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు, ఏది పడితే అది తినడం అన్నమాట! దీనివల్ల ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి.
స్టార్మ్ ఈటింగ్
ఈ స్టార్మ్ ఈటింగ్‌ను బింజ్ ఈటింగ్ అని కూడా అంటారు. ఈ పద్ధతిలో ఏమాత్రం క్రమశిక్షణ ఉండదు. ఏ పని చేస్తున్నా తింటూనే ఉంటారు. తినడాన్ని నియంత్రించలేకపోవడమే స్టార్మ్ ఈటింగ్ అన్నమాట. దీనివల్ల శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బ తింటుందని డాక్టర్లు చెప్తున్నారు. అలాగే బరువు తగ్గాలనుకునే వాళ్లు ఈ పద్ధతిని పూర్తిగా దూరం పెట్టాలి. లేదంటే బరువు పెరగడం, జీర్ణాశయ సమస్యలు, డిప్రెషన్ వంటివి వస్తాయి.
ఫ్యూయెల్ ఈటింగ్
కారు నడవాలంటే ఫ్యూయెల్ ఎంత అవసరమో, మనిషి మనుగడకూ ఆహారం అంతే అవసరం. అయితే ఆకలి వేసినప్పుడు మాత్రమే తినడాన్ని ఫ్యూయెల్ ఈటింగ్ అంటారు. ఈ రకంగా తినడం చాలా సాధారణం, ఆరోగ్యకరం కూడా. ఈ ఫ్యూయెల్ ఈటింగ్‌లో కడుపు నిండగానే ఆపేసే నియమం ఉంటుంది. దీన్ని జపనీయులు ఎక్కువగా ఆచరిస్తారు. ఇందులో భోజనాన్ని నెమ్మదిగా 20 నిమిషాలు తింటారు. అది మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు బాగా తోడ్పడుతుంది.
జాయ్ ఈటింగ్
ఈ జాయ్ ఈటింగ్ పద్ధతిలో పోషకాహార లోపం ఉంటుంది. కేవలం రుచి, వాసనను చూసి తింటారు తప్ప, పోషకాల పట్టింపు ఉండదు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో జరిగే ఈవెంట్లలో ఈ రకం ఈటింగ్ ఉంటుందన్నమాట. వేడుకల విందులో ఎక్కువగా జంక్ పదార్థాలే ఆరగిస్తుంటారు. ఫలితంగా అనారోగ్య సమస్యలు పలకరిస్తాయి. అలా జరగొద్దంటే.. ఇలాంటి విందు మెనూలోనూ పండ్లు, కూరగాయలు జోడిస్తే.. పోషకాలు అందుతాయి.
ఆరోగ్యమే మహాభాగ్యం..