ఓ ఫిబ్రవరి నెలలో మధ్యాహ్నం వేళ 77 ఏండ్ల వైజనాథ్ జగన్నాథ్ ఘోంగాడే మహారాష్ట్రలో ప్రవహించే మాన్గంగ నది ఒడ్డున నిలబడి ఉన్నాడు. అప్పుడు ఆ నది పరిస్థితి దయనీయంగా ఉండింది. అది చూసిన వైజనాథ్కు ఎంతో సిగ్గుగా అనిపించింది. వ్యవసాయ శాఖ నుంచి పెన్షన్ తీసుకుంటున్నప్పటికీ, బదులుగా తానేమీ చేయలేకపోతున్నానని అనిపించింది. చివరికి ఎలాగైనా సరే మాన్గంగ నదికి పునరుజ్జీవం కల్పించాలని నిర్ణయించుకున్నాడు. వైజనాథ్ సొంతూరు సోలాపూర్ జిల్లాలోని వాడెగావ్ మీదుగా మాన్గంగ ప్రవహిస్తుంది. ఈ నది సతారా జిల్లాలోని కొండల్లో పుడుతుంది. తూర్పుగా ప్రవహించి సర్కోలి దగ్గర భీమా నదిలో కలిసిపోతుంది.
ఈ నది ప్రవహించే సంగ్లి, సతారా, సోలాపూర్ జిల్లాలు కరువు ప్రాంతాలు. అయినప్పటికీ వర్షకాలంలో అప్పుడప్పుడు వరదలు వస్తుంటాయి. “నా చిన్నతనంలో ఈ నదిని చూసినప్పుడు ఎంతో ఆనందంగా ఉండేది. కానీ తర్వాత కాలంలో పరిస్థితులు బాగా మారిపోయాయి. నదిలో పిచ్చిమొక్కలు మొలిచాయి. అది నాకెంతో ఆందోళన కలిగించింది” అంటాడు వైజనాథ్. 2011లో వైజనాథ్ మరో పదకొండు మంది కలిసి ‘చలా నదీ లా జానుయా’ (నది గురించి తెలుసుకుందాం) పేరుతో బృందంగా ఏర్పడ్డారు. ఈ బృందం తమ ప్రయాణంలో నది గురించి క్షుణ్నంగా పరిశీలించారు. స్థానికులకు మాన్గంగ ప్రాధాన్యం వివరించారు. అలా తమ 21 రోజుల ప్రయాణాన్ని ‘పరిక్రమ మాన్గంగేచి’ పేరుతో పుస్తకం వేశారు.
ఏండ్ల తరబడి ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో మాన్గంగ మురుగుకాల్వలా మారిపోయింది. ప్రవాహ మార్గంలో ముండ్ల చెట్లు పెరిగిపోయాయి. నది మీద నిర్మించిన ఆనకట్ట కూడా ఇసుకమేటలతో నిరుపయోగంగా మారిపోయింది. దీనికి పరిసర ప్రజలు పారవేసే చెత్త, ఇతర కాలుష్య పదార్థాలు తోడయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో 2014లో వైజనాథ్ ఆధ్వర్యంలో పునరుద్ధరణ పనులు మొదలయ్యాయి.
ఈ బృహత్తర కార్యంలో ఆయనకు రైతులు, ఉపాధ్యాయులు, ఎన్జీవోలు, వ్యాపారులు తమవంతు చేయూతను అందించారు. కేవలం శ్రమదానంతోనే ఈ కార్యక్రమం పూర్తికాదని, భారీ వాహనాలను కూడా అందుబాటులో ఉంచారు. పనులు ఎండాకాలంలో చేసేవాళ్లు. దీంతో పని పూర్తవడానికి ఆరేండ్లు పట్టింది. 2021లో భారీ వర్షాలకు మాన్గంగ నిండుగా ప్రవహించింది. నదిలో నీరు నిండుగా ఉండటంతో చుట్టుపక్కల బావులు, బోరుబావుల్లో నీటిమట్టం పెరిగింది. నది నుంచి తీసిన పూడిక వేల ఎకరాల్లో సారాన్ని పెంచింది. అయితే, మాన్గంగ నదిపై ఆక్రమణలు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. వైజనాథ్ ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాడు.