ఎంటర్టైన్మెంట్ను థియేటర్ హంగులతో ఇంటి హాల్లోకి తెచ్చేసింది సోనీ కంపెనీ. ‘బ్రావియా 9’ సిరీస్‌తో 4కే టీవీలను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ‘ఏఐ’ ప్రాసెసర్‌తో ఇది పని చేస్తుంది. హెచ్డీఆర్, డాల్బీ విజన్‌తో ఇల్లే థియేటర్లా మారిపోతుంది. 4కే రిజల్యూషన్‌తో గ్రాఫిక్స్ అదుర్సే. హాలులో ఏ మూల నుంచి చూసినా గ్రాఫిక్స్ క్వాలిటీలో ఎలాంటి మార్పుండదు. ‘ఎక్స్-యాంటీ రిఫ్లెక్షన్’ టెక్నాలజీతో స్క్రీన్‌పై ఎలాంటి నీడలూ కనిపించవు. ‘వాయిస్ జూమ్ టెక్నాలజీ’తో డైలాగ్స్ అన్ని చాలా స్పష్టంగా వినిపిస్తాయి. టీవీ తెరల పరిమాణం 75, 85 అంగుళాలు.
ఓన్లీ ‘వన్ ప్లస్’లోనే!
చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉందంటే.. చెవిలో ఇయర్ బడ్స్ ఉన్నట్టే! అంతలా ఇయర్ఫోన్లు బడ్స్ రూపంలో టెక్నాలజీ ప్రియులకు దగ్గరై పోయాయి. వాటిల్లో ముఖ్యంగా వన్‌ప్లస్ బడ్స్. ఓ బ్రాండ్ యువత చెవికి ఎక్కేశాయి. అందుకేనేమో గత ఏడాది వెర్షన్‌ని అప్డేట్ చేస్తూ వన్‌ప్లస్ ‘బడ్స్ ప్రో 3’ వెర్షన్‌ని మార్కెట్లోకి తెచ్చింది. ‘డ్యూయల్ డ్రైవర్’ దీంట్లోని ప్రత్యేకత. దీంతో రెండు బడ్స్ నుంచి నాణ్యమైన క్వాలిటీతో మ్యూజిక్ వినడంతోపాటు.. క్లియర్‌గా కాల్స్ మాట్లాడొచ్చు. ‘హే మెలోడీ’ యాప్‌తో జతకట్టి బడ్స్ పని చేస్తాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు యాప్ ఇన్స్టాల్ చేసుకుని బడ్స్‌లోని ఫీచర్స్‌ను ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఈక్వలైజర్ సెట్టింగ్స్‌లో మార్పులు చేసుకునే వీలుంది. అంతేకాదు.. బడ్స్‌లోని సెన్సర్ల సాయంతో మీ మెడని ఎలా ఉంచుతున్నారో ట్రాక్ చేయొచ్చు. అడ్డదిడ్డంగా మెడని ఉంచే క్రమంలో బడ్స్ మిమ్మల్ని అలర్ట్ చేస్తూ.. మెడ సంబంధిత సమస్యలు రాకుండా కాపాడుతుంది. కుడి, ఎడమ బడ్స్ని ఇట్టే గుర్తించేలా రెండు బడ్స్ పైనా స్పష్టమైన ఇండికేటర్స్ కనిపిస్తాయి. బడ్స్కేస్ గతంలో అడ్డంగా ఉంటే.. ఇప్పుడు నిలువుగా డిజైన్ చేశారు. చూడ్డానికి కేస్ లెదర్ డిజైన్లా కనిపించినా.. ప్లాస్టిక్ మెటీరియల్‌తో రూపొందించారు. ఒక్కసారి బడ్స్ని చార్జ్ చేస్తే.. 43 గంటలు పని చేస్తాయి.
వ్యోమగామి తోడుగా.!
చెప్పుకోవడానికే ఐటీ కొలువులు గానీ.. వాటిల్లో ఉండే ఒత్తిళ్లు తట్టుకోవాలంటే ఎన్నో నిద్రలేని రాత్రులు గడపాల్సిందే! గడియారంతో పోటీపడి పని చేయాలి. ఈ క్రమంలో మిమ్మల్ని మీరు ఉత్సాహ పరుచుకునేలా పని వాతావరణాన్ని మార్చుకోవాల్సిందే కదా! అందుకు తగినదే ఈ ‘ఆస్ట్రోనాట్ యూఎస్బీ లైట్’. రాత్రి సమయంలో మీ వర్క్‌లో తోడుగా ఈ వ్యోమగామి పక్కనే ఉంటాడు. పున్నమి వెన్నెల లాంటి వెలుతురు ప్రకాశింపజేస్తూ.. మీ ల్యాప్‌టాప్ పక్కనే మీతో మేల్కొని కాపుకాస్తాడు. వ్యోమగామిలోని ఎల్ఈడీ లైట్లు వెలిగేందుకు ముఖానికి ఉన్న మాస్క్‌ని పైకి జరపాలి. ల్యాపీ యూఎస్బీ పోర్ట్‌కు కనెక్ట్ చేస్తే చాలు.. చార్జింగ్‌తో పని లేదు. 30 సెంటీమీటర్ల ఫ్లెక్సిబుల్ కేబుల్‌తో ఆస్ట్రోనాట్‌ని మీకు కావాల్సినట్టుగా పెట్టుకోవచ్చు. ఎవరైనా టెక్కీలకు దీన్ని గిఫ్ట్‌గా ఇచ్చేందుకు మంచి ఎంపిక.
మడత ఫోన్లో మరో ట్విస్ట్
ఫోన్లలో వైవిధ్యం నేటిది కాదు. గత కొన్నేళ్లుగా భిన్నమైన ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లు ముస్తాబై వచ్చేస్తున్నాయి. ఈ ప్రయత్నంలోనే మోటోరోలా తన ఫ్లిప్ ఫోన్ (రేజర్ 50)ను వినూత్నంగా పరిచయం చేయనున్నది. అదేంటంటే.. ఎక్స్టర్నల్ డిస్ప్లే. ఇప్పటి వరకూ ‘ఎక్స్టర్నల్ కెమెరాలు తెలుసుగానీ.. ఈ ఎక్స్టర్నల్ డిస్ప్లే ఎప్పుడూ వినలేదే!’ అనుకుంటున్నారా? ఇదే మడత ఫోన్లో మతిపోగొట్టే ట్విస్ట్. ఫోన్‌కు వెనకవైపు కెమెరాలతోపాటు కనిపించే తాకే తెరే.. ఈ ఎక్స్టర్నల్ స్క్రీన్. ఈ తెర పరిమాణం 3.6 అంగుళాలు. రిజల్యూషన్ 1056X1066 పిక్సల్స్. గొరిల్లా గ్లాస్ రక్షణ కూడా ఉంది. ఫోన్‌ను మడత పెట్టినప్పుడు ఈ బుజ్జి తెరపైనే అన్నీ చక్కబెట్టొచ్చు.
ఇక మెయిన్ డిస్ప్లే విషయానికొస్తే.. 6.9 అంగుళాలు. ఫోల్డబుల్ AMOLED ప్యానల్ ఇది. బ్యాటరీ సామర్థ్యం 4,200 ఎంఏహెచ్. ప్రైమరీ డ్యూయల్ కెమెరాల సామర్థ్యం వరుసగా.. 50ఎంపీ, 13 ఎంపీ. ర్యామ్ 8 జీబీ. ఇంటర్నల్ మెమరీ 256జీబీ. ఫ్లిప్ ఫోన్లతో ఎప్పటినుంచో తనదైన బాణీలో వెళ్తున్న మోటోరోలా రేజర్ 50తో ఈ ఏడాది సందడి చేయనుంది.