చిన్నతనంలో జరిగిన కొన్ని విషయాలను, తారసపడిన కొందరు వ్యక్తులను జీవితాంతం మరచిపోలేం. మన స్మృతిపథంలో భద్రంగా ఉన్న ఆనాటి సంగతులను తల్చుకోవడం ఎంతో బావుంటుంది. అలాంటిదే.. నాట్యం నేర్చుకోవాలన్న నా ఆశ!
అప్పుడు నాకు పదమూడేళ్ల వయసు ఉంటుంది. ఒకరోజు సడన్‌గా మా ఇంటికి ఒకాయన వచ్చాడు. ఆయన మామూలు వాళ్లలా కాకుండా పసుపు పచ్చని ధోతి కట్టుకుని, పైన ముదురు గులాబీరంగు ఉత్తరీయం వేసుకుని ఉన్నాడు. కనుబొమలు తీర్చిదిద్దుకుని కళ్లకు కాటుక, నుదుటన పొడవుగా బొట్టు, పెదవులకు ఎర్రని రంగు వేసుకుని.. పూర్తి మేకప్‌లో ఉన్నాడు. అప్పటికి నాకు ‘మేకప్’ అన్న మాటే తెలియదు. ఆయన వస్తూనే మా నాన్నకు నమస్కారం పెట్టి.. “మాది కూచిపూడి అగ్రహారం. కులమున మీ సరివారం. మేముండేది కృష్ణా తీరం..” అంటూ రాగయుక్తంగా పాడుతూ నృత్యం చేశాడు. అప్పటిదాకా అలా మగవాళ్లు పూర్తిస్థాయిలో నృత్యం చేయడం చూడలేదు గనుక.. నాకు ఆశ్చర్యంగా అనిపించింది. పాట అయిపోగానే ఆయన వెళ్లిపోయాడు.
“నానా! గీయినెందుకు అట్ల డాన్సు చేస్తుండు?!” అని నాన్నను అడిగాను. “ఎమ్మో! నాకు తెల్వదు. మీ అమ్మను అడుగకపోయినవ్?!” అన్నాడు. నాన్నకు నిజంగా ఇలాంటి విషయాలు తెలియవు. మనం ఆగుతామా?! వెంటనే అమ్మ దగ్గరికి పరిగెత్తాను. “అవును. ఈ కూచిపూడి వాండ్లు ఎక్వ మొగోళ్లే డాన్సు చేస్తరు. రేపు ఆయిన ఒచ్చినప్పుడు అడుగుదాం తియ్యి.. నువ్వు మొదలే ‘పంచ కళ్యాణి – ప్రశ్నల రాణి’వి. ఏమేం అడుగాలెనని ఇప్పటి నుండే ఆలోచిస్తవు” అన్నది అమ్మ. ఆయన శివాలయం పూజారుల ఇంట్లో ఉండేవాడు. మొత్తం పది రోజులుండి రోజొక వేషం వేసుకుని వచ్చి కొద్దిమంది దాతల ఇళ్లకు మాత్రం వచ్చి.. పాటలు పాడుతూ, నృత్యం చేస్తూ అయిదు నిమిషాలు ఉండి వెళ్లిపోయేవాడు. ఆఖరు రోజున ధోతి, లాల్చీ వేసుకుని మామూలుగా వచ్చి డబ్బులు అడిగి తీసుకువెళ్లేవాడు. మా ఊర్లో ఉన్న పదిరోజుల్లో మూడు నాలుగు సార్లయిన మా ఇంటికి భోజనానికి వచ్చేవాడు. ముందుగానే చెప్పేవాడు కనుక మా అమ్మ రెండుమూడు వంటలు ఎక్కువగా చేసేది. మరుసటి ఆదివారం ఆయన మా ఇంటికి భోజనానికి వచ్చాడు.
నేను ఆయన వచ్చేదాకా నా ప్రశ్నల్ని ఉగ్గబట్టుకుని ఎదురు చూశాను. ఆయనకు పీట వేయడం దగ్గర్నుంచి, విస్తరి తేవడం, మంచినీళ్లు ఇవ్వడం లాంటి పనులన్నీ నేనే చేసినట్టు బిల్డప్ ఇచ్చాను. ఆయన తినేదాకా ఏమీ అడగొద్దని అమ్మ కళ్లతోనే నన్ను హెచ్చరించింది. దాన్ని ధిక్కరిస్తే ఏమవుతుందో నాకు తెలుసు కనుక ఆ చుట్టుపక్కలే తిరుగుతూ.. ‘ఆయన ఎప్పుడు తినడం పూర్తి చేస్తాడా!?’ అని వేచిచూశాను. ఆయన చేయి కడుక్కుని రాగానే అమ్మ వంక చూసి సైగ చేశాను.
నేను ఎలా అడుగుతానో ఏమో అనుకుందో.. మా అమ్మే ముందుగా.. “మా అమ్మాయికి ఒక అనుమానం ఒచ్చింది. మిమ్ములను అడుగుదామని..” అన్నది మెల్లగా. దానికి ఆయన మెల్లగా.. “అయ్యో! దానికేముందమ్మా.. అడగండి!” అన్నాడు. “మీ వాళ్లలో ఇట్ల మొగవాండ్లే నాట్యం చేస్తుంటరు.. ఎందుకని అన్నది దాని ప్రశ్న!” అన్నది అమ్మ. ఆయన నవ్వి నావైపు మెచ్చుకున్నట్టు చూశాడు. నాకు కొండంత ధైర్యం వచ్చింది. ‘క్లాసులో టీచర్లే కాదు, మనమూ కొన్ని మంచి ప్రశ్నలు అడగ్గలం.. పర్లేదు!’ అనుకున్నాను. “మాది కూచిపూడి అగ్రహారం. కృష్ణా జిల్లాలో ఉంటుంది. సిద్ధేంద్ర యోగి అన్న గురువు అక్కడ కూచిపూడి అనే నాట్య విధానానికి మెరుగులు దిద్ది.. ‘భామా కలాపం’ అనే నృత్యరూపకం కూర్పు చేశారు. ఆ ఊరిలో పుట్టిన ప్రతి మొగ పిల్లవాడికీ ఆయన పేరు చెప్పి, ముక్కు కుట్టి, కాలికి గజ్జె కట్టాలని ఆయన చెప్పారు. అలా నాట్యం నేర్చుకున్నవాళ్లు పెద్దవాళ్లయ్యాక ఏ వృత్తిలోకి వెళ్లినా.. మొదట దేవుని సన్నిధిలో సత్యభామ వేషం వేయాలని సిద్ధేంద్ర యోగి చెప్పిన పద్ధతిని అందరూ పాటిస్తారు. ఆయనే ఆడవాళ్లు ఈ నాట్యం నేర్చుకోవద్దని కూడా శాసించాడని చెబుతారు. అందుకని ఎక్కువగా మగవాళ్లే సంప్రదాయ నృత్యం నేర్చుకొని చేస్తారు” అని ఆయన వివరంగా చెప్పాడు. “వేదాంతం, వెంపటి, పసుమర్తి ఇంటిపేర్ల వాళ్లు కూచిపూడి నాట్యాన్ని బాగా ప్రచారంలోకి తెచ్చారు. వాళ్లలో కొందరు సినిమాల్లోకి కూడా పోయారు. మేము వేదాంతం వాళ్లమే! కొన్నేళ్లుగా ఆడవాళ్లు కూడా బాగా నేర్చుకుంటున్నారు” అని కూడా చెప్పి వెళ్లిపోయాడు ఆయన.
నాకు అప్పటికే మా అమ్మ అదివరకే చెప్పిన విషయాలు, నేను చూసిన సినిమాల్లో వైజయంతిమాల, ఎల్. విజయలక్ష్మి లాంటి వాళ్ల నాట్యాలు కళ్ల ముందు న్యూస్ రీళ్లుగా తిరగడం మొదలు పెట్టాయి. దానికితోడు ఆ మర్నాడు సత్యభామ వేషం వచ్చింది. “భామనే సత్యభామనే.. భామనే పదహారు వేల కోమలులందరి లోన..” అంటూ జడ ముందుకు వేసుకుని, కళ్లు తిప్పుతూ సొగసుగా నాట్యం చేస్తుంటే.. ఈమె వేరే అనుకున్నాను. తీరా చూస్తే.. రోజూ వచ్చే ఆయనే!
అది మొదలు ఆయన ఓ రోజున దశావతారాలు, మరోరోజు క్షీరసాగర మథనం, ఇంకోరోజు మోహినీ వేషధారణలో వచ్చేవాడు. పొద్దున్నే నేను స్కూల్‌కు వెళ్లకముందే వచ్చేవాడు కనుక.. నేను గబగబా తయారై ఎదురుచూసే దాన్ని. చివరికి అమ్మతో చెప్పాను.. “అమ్మా! ప్లీజ్.. నేను కూడ కూచిపూడి డాన్సు నేర్చుకుంటా!” అని. అమ్మ విస్తుపోయి నావంక చూసి.. “నేను అనుకుంటనే ఉన్న.. నువ్వు ఇట్లాంటిది ఏదో అడుగుతవని! లేడికి లేచిందే పరుగని.. ఏది తోస్తె అదేనా?! అదేమన్న గౌనా, పుస్తకమా, రిబ్బనా?! కూచిపూడి డాన్సు అంటే ఎంతో శ్రద్ధ గావాలె! కష్టపడాలె! జీవితమంత దానికి అంకితం జేయాలె. నీకు అసలే ఆరంభ శూరత్వం. ఏదైనా కొస ఎళ్లాలె! అయినా మొదలు మీ నాన ఒప్పుకోవాలె. అన్ని పైసలుండొద్దా మన దగ్గర?! నేర్పే గురువుండాలె. ఇగ చాలు గానీ.. చప్పుడు జెయ్యకుండ బడికి పొయ్యి మంచిగ చదువుకో.. చాలు ” అన్నది కచ్చితంగా. మరి మనం ఊరుకోం కదా! పట్టుపట్టామంటే విడువం కదా! మరి కూచిపూడి నేర్చుకోవాలన్న నా నాట్యాభిలాష నెరవేరిందా? అందుకోసం ఎన్ని తిప్పలు పడ్డానో.. వచ్చేవారం చదువుకుందాం..
-నెల్లుట్ల రమాదేవి
రచయిత్రి