‘హలో ఇన్స్పెక్టర్ రుద్ర. కొద్దిరోజుల కిందట కమలాకర్ బ్రదర్స్ అనే సైకో ట్విన్స్‌ను ఎంతో చాకచక్యంగా పట్టుకొని బాగా ఫేమస్ అయినట్టు ఉన్నావ్. ఇప్పుడు మీ సిటీలోకి నేనొచ్చా! నాకు చిన్నప్పటి నుంచి గెలవడం అంటే ఎంతో ఇష్టం. ఇప్పటివరకూ ఓడిపోలేదు. మిమ్మల్ని ఓడించాలని చాలా కసిగా ఉంది. అందుకే, ల్యాగ్ చేయకుండా డైరెక్టుగా మ్యాటర్‌లోకి వస్తున్నా…’ అంటూ చెబుతూ పోయింది ఓ గొంతు.
‘రుద్రా! గత బుధవారం ఐదుగురు స్కూల్ పిల్లలను కిడ్నాప్ చేశా. ఈ లెటర్ మీకు చేరేసరికి శనివారం కావొచ్చు. సో.. గత నాలుగు రోజులుగా ఆ ఐదుగురు పిల్లలు నా డెన్లోనే ఉన్నట్టు లెక్క. నేను ఎవరు? ఎందుకు ఇలా చేశా? ఇవన్నీ పక్కనపెట్టు. నిజానికి ఆ పిల్లలను ర్యాండమ్‌గా సెలక్ట్ చేసుకొన్నా. డబ్బు, ఇంకా ఏదో ఆశించి నేను ఈ కిడ్నాప్‌లు చేయలేదు. అల్టిమేట్‌గా నిన్ను ఓడించడమే నా టార్గెట్. దమ్ముంటే ఆ పిల్లలను కాపాడుకో. కమలాకర్ బ్రదర్స్‌లాగే, నీకు కొన్ని పజిల్ క్వశ్చన్లు, టైమ్ ఇస్తా. ఆ లోపు నువ్వు కరెక్ట్ సమాధానం చెబితే, ఒక్కో చిన్నారిని వదిలిపెడ్తా. నేను అడిగే క్వశ్చన్లు ఎలాగోలా నీకు చేరుతాయ్. నువ్వు తప్పు ఆన్సర్ చెప్తే, ఆ తర్వాత ఎంతమంది పిల్లలు నా డెన్‌లో ఉంటారో వాళ్లందరూ డెడ్బాడీలుగా మారిపోతారు. నెక్ట్స్ లెటర్ వచ్చే వరకూ వెయిట్ చెయ్యి..’ తన స్టేషన్‌కు పోస్ట్ ద్వారా వచ్చిన లెటర్‌ను చదివిన రుద్ర నిశ్చేష్టుడై నిల్చున్నాడు.
పిల్లలు కిడ్నాప్ అయ్యింది నిజమేనని కన్ఫర్మ్ చేసుకున్నాడు రుద్ర. ఆ లెటర్ ఏ పోస్టాఫీస్‌లో పోస్ట్ అయ్యిందో స్టాంప్ ద్వారా తెలుసుకొని సిబ్బందితో అక్కడికి వెళ్లి ఆరా తీశాడు. అయితే, రూ.5 స్టాంప్ అంటించిన లెటర్ కావడంతో ఫ్రమ్ అడ్రస్ లేకపోయినా లెటర్లో పేర్కొన్న చిరునామాకు తాము డెలివరీ చేశామని పోస్ట్ మాస్టర్ చెప్పాడు. స్టాంప్ ఆధారంగా ఈ లెటర్‌ను గురువారం పోస్ట్ చేశారన్న ఆయన.. బయట పోస్ట్‌బాక్స్ దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజీని చూస్తే, నిందితుడిని పట్టుకోవచ్చని సలహా ఇచ్చాడు.
దీంతో రుద్ర అండ్ టీమ్ సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. నాలుగు గంటల పాటు విశ్లేషించి వడపోయగా.. ఒక పదేండ్ల పిల్లాడు ఈ లెటర్‌ను పోస్ట్ చేసినట్టు తేలింది. ఆ పిల్లాడి ఆచూకీ కనుక్కోవాలని సిబ్బందిని పురమాయించాడు రుద్ర. ఇంతలో మొబైల్ రింగ్ అయ్యింది. ‘సార్.. స్టేషన్‌కు ఫ్యాక్స్ వచ్చింది’ అంటూ అటువైపు నుంచి సందేశం. వెంటనే స్టేషన్‌కు చేరుకొన్న రుద్ర.. ఆ ఫ్యాక్స్ లెటర్‌ను తెరిచాడు. ‘మిస్టర్ రుద్ర.. అప్డేట్ అవ్వు. ఇంకొంచెం షార్ప్‌గా ఆలోచించు. మొదటి లెటర్ రాగానే దాని స్టాంపును బట్టి నువ్వు పోస్టాఫీసుకు వెళ్తావని, అక్కడ పోస్ట్‌బాక్స్ దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజీ వెతుకుతావని నాకు తెలియదా? అందుకే, నేను కిడ్నాప్ చేసిన పిల్లాడి ద్వారా ఆ లెటర్‌ను మరో పిల్లాడికి ఇచ్చి పోస్ట్ చేయించా. ఇప్పుడు నువ్వు చదువుతున్న ఈ ఫ్యాక్స్ అడ్రస్‌ను కనుక్కోవాలని కూడా ప్రయత్నించకు.. ఎందుకంటే, మళ్లీ రూట్ మార్చుతా.. ఆ తర్వాత ఏదో ఓ నంబర్ నుంచి మెసేజీ పంపుతా.. దాని తర్వాత ఇంటర్నెట్ వాయిస్ కాల్‌తో మాట్లాడుతా.. సో..! నన్ను పట్టుకోవడం ఆపేసి, నేను ఇచ్చే పజిల్స్‌ను సాల్వ్ చేసి పిల్లల్ని కాపాడుకో’ అంటూ సైకో ముగించాడు.
దీంతో చేసేదేమీ లేక లెటర్‌ను పోస్ట్ చేసిన పిల్లాడి ఆచూకీ కనుక్కోవాలని పంపించిన సిబ్బందిని వెనక్కి రప్పించాడు రుద్ర. ఇంతలో స్టేషన్‌కు మరో ఫ్యాక్స్ వచ్చింది. ‘హాయ్ రుద్ర.. నేనే! ఇక గేమ్ మొదలుపెడ్తున్నా. నీకు ఫస్ట్ పజిల్ క్వశ్చన్ ఏమిటంటే.. ‘సంవత్సరంలో ఏ నెలలో 28 రోజులు ఉంటాయి?’ ఇప్పుడు సాయంత్రం 5 గంటలు అవుతుంది. సాయంత్రం 5.30 గంటలలోపు అంటే మరో అరగంటలో సమాధానాన్ని అన్ని న్యూస్ చానెల్స్‌లో బ్రేకింగ్ న్యూస్‌గా టెలికాస్ట్ చెయ్యి. 5.30 గంటలకు ఒక్క సెకన్ ఆలస్యమైనా, సమాధానం తప్పుగా చెప్పినా.. నా దగ్గర ఉన్న ఐదుగురు పిల్లలు శవాలుగా మారుతారు. జాగ్రత్త! యువర్ టైమ్ సార్ట్స్ నౌ..’ అంటూ ఆ ఫ్యాక్స్‌లో ఉంది. అప్పటికే సమయం 5.10 గంటలు కావస్తున్నది. ఇంకా 20 నిమిషాలు మాత్రమే ఉంది. అప్పటికే, న్యూస్ చానెల్స్‌తో కనెక్ట్ అయిన రుద్ర టీమ్.. బ్రేకింగ్ ప్లేట్లను సిద్ధం చేసుకోవాలని, తాము ఇచ్చే ఆన్సర్‌ను టెలికాస్ట్ చేయాలని సూచించారు.
సైకో క్వశ్చన్‌కు ఆన్సర్‌ను రుద్ర అండ్ టీమ్ ఆలోచించడం మొదలుపెట్టారు.‘సార్.. ఇంత తెలివైన సైకో.. ఇంతటి ఈజీ క్వశ్చన్‌ను ఇస్తాడు అనుకోవడానికి వీలులేదు. ‘సంవత్సరంలో ఏ నెలలో 28 రోజులు ఉంటాయి?’ అంటే ఫిబ్రవరి అని ఈజీగా చెప్పేయవచ్చు. అయితే, అది ఏ సంవత్సరం అనేది ఇక్కడ ముఖ్యం. ఒకవేళ ఆ ఏడాది లీపు సంవత్సరం అయితే, ఫిబ్రవరిలో 29 రోజులు ఉంటాయి కదా?!’ తన సందేహాన్ని వెలిబుచ్చాడు రామస్వామి. ‘బాబాయ్.. మనకు చాయిస్ అనేది ఇప్పుడు లేదు. తప్పు సమాధానం చెప్పినా.. సమయానికి ఆన్సర్ చేయకపోయినా ఐదుగురు పిల్లలు చనిపోతారు’ గద్గద స్వరంతో అన్నాడు రుద్ర. ఇంతలో విషయం తెలుసుకొన్న డీఎస్పీ సత్యనారాయణ రుద్రకు ఫోన్ చేసి స్టేటస్ ఆరా తీశాడు. ధైర్యంగా ఉండాలని చెప్తూ.. డిపార్ట్మెంట్ నుంచి అన్ని విధాలుగా సహకారంతోపాటు సైకోను పట్టుకోవడంలో స్పెషల్ పవర్స్ ఇస్తున్నట్టు చెప్పాడు.
సాయంత్రం 5.25 గంటలు కావస్తున్నది. స్టేషన్ సిబ్బందిలో పల్స్ రేట్ పెరగసాగింది. రుద్ర సార్ ఎలాగైనా పిల్లలను కాపాడుతాడని వాళ్లలో గట్టి నమ్మకం ఉన్నప్పటికీ.. ఈ సైకో అడిగిన క్వశ్చన్ మరీ ఈజీగా ఉండటంతో ఏదో తెలియని భయం మొదలైంది. ఇంతలో బాధిత పిల్లల తల్లిదండ్రులు స్టేషన్‌కు చేరుకొన్నారు. మొత్తం ఆగమాగం. గందరగోళ పరిస్థితులు. ‘పిల్లలు ఎప్పుడో బుధవారం తప్పిపోతే.. వీళ్లు ఇప్పుడు, ఇక్కడికి రావడమేంటి?’ అంటూ రామస్వామిలో అనుమానం మొలకెత్తుతుండగానే.. టీవీలో బ్రేకింగ్ న్యూస్ ప్రసారం కావడం మొదలైంది. అందరూ నిశ్శబ్దంగా దాన్ని చదవడం ప్రారంభించారు. సైకో క్వశ్చన్‌కు రుద్ర ఇచ్చిన ఆన్సర్‌ను చూసి అందరూ షాకయ్యారు. ‘అసలేం జరుగుతున్నది?’ అంటూ అర్థంకాక ఒకరి ముఖాలు ఒకరు చూసుకొన్నారు. పిల్లల పరిస్థితి ఏమైందోనని వాళ్ల పేరెంట్స్ గగ్గోలు పెట్టడం మొదలుపెట్టారు.
ఇంతలో స్టేషన్‌కు మరో ఫ్యాక్స్ వచ్చింది. ‘మిస్టర్ రుద్ర.. వాట్ ఏ బ్రిలియంట్ ఆన్సర్. నేనడిగిన ప్రశ్నకు కరెక్ట్‌గా అన్సర్ చెప్పావ్. సో.. మొదటి రౌండ్లో నువ్వు గెలిచినట్టే. అయితే, ఈ క్వశ్చన్‌కు ఆన్సర్ చెప్తే.. పిల్లల్లో ఎవర్నో ఒకర్నీ వదిలిపెడుతా అని నేను ఎక్కడా ప్రామిస్ చేయలేదు. సో.. ఇది ట్రయల్ క్వశ్చన్ అనుకో! సో.. మెయిన్ క్వశ్చన్ కోసం వెయిట్ చెయ్యి..’ అంటూ ఆ ఫ్యాక్స్‌లో ఉంది. ఇప్పటికైతే, పిల్లలను ఎలాగోలా రక్షించానని రుద్ర ఊపిరి పీల్చుకున్నాడు. ఇంతకీ, సైకో క్వశ్చన్‌కు రుద్ర ఇచ్చిన ఆన్సర్ ఏంటో కనిపెట్టారా?
‘సంవత్సరంలో ఏ నెలలో 28 రోజులు ఉంటాయి?’ అని సైకో ప్రశ్న అడిగాడు. దీనికి అందరూ ఫిబ్రవరి అంటూ ఠక్కున ఆన్సర్ చెప్తారు. అయితే, అది తప్పు. ‘సంవత్సరంలో ఏ నెలలో 28 రోజులు మాత్రమే ఉంటాయి?’ అన్న ప్రశ్నకు ఫిబ్రవరి అనేది కరెక్ట్ ఆన్సర్‌గా చెప్పొచ్చు. ఇక్కడ సైకో ట్రిక్కీగా.. ‘సంవత్సరంలో ఏ నెలలో 28 రోజులు ఉంటాయి?’ అని ప్రశ్నించాడు. అంటే సంవత్సరంలో అన్ని నెలల్లోనూ 28 రోజులు ఉంటాయి. అంటే జనవరిలో ఉండే 31 రోజుల్లో 28 రోజులు అనేవి ఉండనే ఉంటాయి. ఫిబ్రవరి, మార్చి అలా డిసెంబర్ వరకూ 28 రోజులు ప్రతీ నెలలో ఉంటాయి. కొన్ని నెలల్లో 28 రోజుల కంటే ఎక్కువ ఉంటాయి. అయితే, సైకో.. 28 రోజులు ఏ నెలలో ఉంటాయని మాత్రమే అడిగాడు కాబట్టి.. రుద్ర.. టీవీ బ్రేకింగ్ న్యూస్‌లో ‘అన్ని నెలల్లో’ అని స్క్రోలింగ్ వేయించాడు. దీంతో సైకో కరెక్ట్ అన్సర్ అని చెప్పాడు. కాగా, సైకో రెండో క్వశ్చన్ కోసం రుద్ర ఎదురుచూస్తుండగా, పిల్లల తల్లిదండ్రులు స్టేషన్‌కు ఇన్ని రోజుల తర్వాత రావడమేంటని రామస్వామి ఆరాతీయడం మొదలుపెట్టాడు.