మహాభారతంలో భీష్ముడి ప్రతిజ్ఞ గురించి విన్నారు కదా? నేటి డిజిటల్ ప్రపంచంలో కూడా ప్రతిఒక్కరూ అలాంటి గట్టి నిర్ణయం తీసుకోవడం అనివార్యం అంటున్నారు సైబర్ సెక్యూరిటీ నిపుణులు. అప్పుడే నెటిజన్‌గా మీరు బాధ్యతగా ముందుకెళ్తారు. సేఫ్‌గా నెట్టింట్లో సంచరిస్తారు. ఆన్లైన్లో జెట్స్పీడుతో దూసుకెళ్లను అనుకోవడం.. భీష్ముడు చేసినంత త్యాగమైతే కాదు! మన ప్రైవసీ కోసం మనం తీసుకునే సింపుల్ నిర్ణయం! పేరు కోసం, లైకుల కోసం పరుగులు తీసే ఈ ఆన్లైన్ ప్రపంచంలో మీ వ్యక్తిగత సమాచారం ఎంత సురక్షితంగాఉందో తెలుసుకోవాల్సిన టైమ్ వచ్చింది. బీ అవేర్, భీష్ముడిలా బలమైన ప్రతిజ్ఞ తీసుకోవాల్సిన సమయమూ వచ్చేసింది.
మహాభారతంలో భీష్ముడి ప్రతిజ్ఞ గురించి తెలుసు కదా! తండ్రి సంతోషం కోసం బ్రహ్మచారిగా ఉండిపోతానని మాటిస్తాడు. ఆ మాటకు కట్టుబడి ఆజన్మాంతం బ్రహ్మచారిగా మిగిలిపోతాడు. భీషణ ప్రతిజ్ఞ చేసినందుకే ఆయన అసలు పేరు దేవవ్రతుడు కన్నా.. భీష్ముడిగానే లోక ప్రసిద్ధి చెందాడు. ఆయన ఇచ్చిన మాట భీష్మ ప్రతిజ్ఞగా యుగాలు దాటినా గుర్తుండిపోయింది.
అంతటి స్థితప్రజ్ఞత కలిగిన భీష్ముడిని నేటి తరానికి, ముఖ్యంగా వర్చువల్ వరల్డ్ సేఫ్టీకి ఎలా ఆదర్శంగా తీసుకోవచ్చు? భీష్ముడు చేసిన ప్రతిజ్ఞ కేవలం వ్యక్తిగత త్యాగం కాదు. విలువలే ఆస్తి అనుకుని స్థిరంగా నిలిచిన వ్యక్తిత్వం ఆయనది. ఎంతలా అంటే, తండ్రి ఉన్నా లేకపోయినా ఆయన కోసం ఇచ్చిన మాటకు నిలబడి ఉన్నాడు. సో, నేటి డిజిటల్ యుగంలో, భీష్ముడి గాథలాంటి ఒక అర్థవంతమైన కథ ఇప్పుడు మరింత అవసరం ఉన్నది. ఈ ఆన్లైన్ ప్రపంచంలో రీల్స్, మీమ్స్, లైక్స్, షేర్స్, ఫాలోవర్స్… వెనక మనం పరుగులు తీస్తున్నాం. మానసిక ఆరోగ్యం, సోషల్ మీడియా గుర్తింపు కోసం ఏం చేయడానికైనా వెనకాడటం లేదు. రియల్ లైఫ్‌ని, వర్చువల్ లైఫ్‌ని హెల్తీగా బ్యాలెన్స్ చేయడం నేడు అందరికీ అనివార్యం!
ఒక గొప్ప లక్ష్యం కోసం తన వ్యక్తిగత సుఖాలను త్యాగం చేశాడు భీష్ముడు. వంశపారంపర్యంగా వచ్చే సింహాసనాన్ని కోరుకోలేదు. అదే మాదిరిగా నేటి తరం ఇంటర్నెట్ యూజర్లు కూడా ఫేక్ ఐడెంటిటీ, గుర్తింపు కోసం ఆరాటాన్ని పక్కన పెట్టాలి. తమ దీర్ఘకాలిక ప్రైవసీ, భద్రత గురించి ఆలోచించాలి. సోషల్ లైఫ్, వర్చువల్ వరల్డ్‌లో దొరికే కిక్కు బానిస కావొద్దు. ఆలోచించకుండా యాప్ పర్మిషన్లకు ఓకే చెబుతున్నప్పుడు, కుటుంబం గురించి సున్నితమైన సమాచారాన్ని పోస్ట్ చేస్తున్నప్పుడు ఒకసారి ఆగాలి, బాగా ఆలోచించాలి.
‘ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను!!’ డైలాగ్‌ను స్ఫూర్తిగా తీసుకుని క్షణం ఆలోచించకుండా ఏది పడితే అది షేర్ చేస్తే అసలుకే ఎసరు రావొచ్చు. నెట్టింట చిన్న చిన్న ఆనందాలు కూడా వదులుకోవాలా అనుకుంటారేమో! కానీ, వీటివల్లే స్వేచ్ఛను కోల్పోతారు. అనాలోచితంగా చేసే చిన్న పోస్టుకు విలువైన వ్యక్తిగత సమాచారం అంగట్లో పెట్టేస్తున్నాం. ఇంటి గుట్టంతా ఆన్లైన్ వీధిలో పడేస్తున్నాం. చివరికి మానసిక ఒత్తిడికి లోనై, రియల్ లైఫ్‌లో గౌరవాన్ని కోల్పోతున్నాం.
వర్చువల్ వరల్డ్ అన్న తర్వాత ఆ మాత్రం ఫన్ ఉండదా? అనుకునేరు. యస్, అన్ని సరదాలు ప్రమాదకరం కావు. కానీ, చాలా ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లు వినోదాన్ని ఒక ఎరగా వేస్తాయి. పదే పదే యాక్సెస్ అయ్యేలా చేస్తూ, వ్యసనపరులుగా మార్చేస్తాయి. ఈ క్రమంలోనే యూజర్ని ఓ ప్రొడక్ట్‌లా మార్చి, డేటాను సేకరిస్తాయి. నిత్యం నిఘా వేస్తాయి. ప్రవర్తనను పర్యవేక్షిస్తాయి. తర్వాత యూజర్లను నియంత్రించడం మొదలుపెడతాయి. భావోద్వేగాలను మార్చడానికి ప్రయత్నిస్తాయి. ఈ క్రమంలో ఆన్లైన్లో యాక్టివ్‌గా లేకపోతే బతుకే వేస్ట్ అన్నంతగా అడిక్ట్ అయ్యేలా చేస్తాయి.
కానీ, గుర్తుంచుకోండి, భీష్ముడు గొప్ప యోధుడు, శక్తిమంతుడు అయినా, నిత్యం తనను తాను నియంత్రించుకున్నాడు. తండ్రి లేకపోయినా ప్రమాణం నిలిచే ఉంటుందని నమ్మాడు. కురువంశం వృద్ధి చెందడానికి తన కోడళ్లకు గర్భాదానం చేయాలని, రాజుగా పట్టాభిషేకం చేసుకోవాలని శంతనుడి భార్య, భీష్ముడి సవతి తల్లి అయిన సత్యవతి కోరుతుంది. ఆ సత్యవతి తన తండ్రిని పెండ్లాడాలనే భీష్ముడు బ్రహ్మచారిగా ఉంటానని ప్రమాణం చేశాడు. చివరికి ఆమె వచ్చి ఒట్టు తీసి గట్టు మీద పెట్టమని కోరినా.. మాట తప్పలేదు. మనకు అపరిమిత ఇంటర్నెట్ యాక్సెస్ ఉండొచ్చు. అయినా, అన్ఎథికల్గా దేనికీ ఫ్రీ యాక్సెస్ ఉండకూడదు. మనం పెట్టుకున్న నియమాలను అనుసరిస్తూనే వెబ్ విహారం చేయాలి.
మీరు నెట్టింట్లో ప్రైవేట్‌గా ఉండాలనుకుంటే ఉండాలి!! ఎక్కడా తొందరపడొద్దు. దేన్నీ అతిగా షేర్ చేయకూడదు. కుకీలను ఆఫ్ చేయాలి. లొకేషన్ యాక్సెస్ డిసేబుల్ చేయాలి. ఇంకా, హానికరమైన సోషల్ మీడియా నుంచి దూరంగా ఉండాలి. అప్పుడు అది బలహీనత కాదు. అది ఒక బలమైన, స్పృహతో కూడిన చర్య. అచ్చం భీష్ముడి ప్రతిజ్ఞ లాగే! ఇది మిమ్మల్ని కాసేపు మీ పీర్ గ్రూప్ నుంచి దూరం చేయవచ్చు. కానీ, అది మీ గౌరవం, ఆన్లైన్ భద్రతలను కాపాడుతుంది. ఇలా ఎప్పుడైతే కట్టుదిట్టమైన నియమాలను పాటిస్తామో, అప్పుడు ఫొటో లీక్ అవ్వడం, ట్రోలింగ్కి బలవ్వడం, బ్లాక్‌మెయిల్‌కి గురవ్వడం లాంటివి చోటు చేసుకోవు. ఈ ఆన్లైన్ గందరగోళంలో చిక్కుకోకుండా సేఫ్‌గా మీ నెట్టింటి గౌరవాన్ని నిలబెట్టుకోండి. చివరిగా మహాభారతంలో భీష్ముడు నైతికతకు ప్రతీక. ఈనాటి డిజిటల్ భారతంలో మనం కూడా ఆయనలాగే నిలబడాలి!!
– అనిల్ రాచమల్ల వ్యవస్థాపకులు ఎండ్‌నౌ ఫౌండేషన్