ఎరుకతో వ్యాయామం చేద్దాం
ఈ ఏడాది ఫిట్‌గా, సంతోషంగా ఉండటానికి వ్యాయామం ప్రారంభించాలని అనుకుంటున్నారా? అయితే, కసరత్తు చేసేటప్పుడు దానిమీదే దృష్టిపెట్టి ఎరుకతో (మైండ్‌ఫుల్‌నెస్) చేయాలని తాజా అధ్యయనం ఒకటి సూచిస్తున్నది. దీనివల్ల మన మూడ్, ఆరోగ్యం మెరుగు పడతాయని మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం పేర్కొన్నది. ఎరుకతో వ్యాయామం చేయడం వల్ల కసరత్తు కఠినమైనప్పుడు మనం నొప్పిని, అసౌకర్యాన్ని తేలిగ్గా అధిగమిస్తామట. కాబట్టి, 2024లో వ్యాయామం ఎరుకతో చేయడం మొదలుపెట్టండి. ఇది మన మానసిక బలాన్ని పెంచడంతో పాటు, భౌతిక శ్రమను ఆసక్తికరంగా, ఆనందదాయకంగా మారుస్తుందని అంటున్నారు పరిశోధకులు. పైగా ఆ వ్యాయామ ప్రయోజనాలను కూడా మనం గుర్తిస్తామట.
ఉద్యోగులు.. మానసిక సమస్యలు
నవతరం ఉద్యోగుల్లో మానసిక సమస్యలు సాధారణం అయిపోయాయి. దాదాపు 15 శాతం మంది కుంగుబాటు, ఆందోళన లాంటి మానసిక రుగ్మతలు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించిన ఓఅధ్యయనం ‘లాన్సెట్’ జర్నల్‌లో ప్రచురితమైంది. మానసిక సమస్యలు ఉన్నవారు తరచూ పనికి గైర్హాజరు అవుతారు, బాధ్యతల్లో నిర్లక్ష్యం కారణంగా ఉద్యోగాన్ని వదులుకుంటారు. ఎదుగుదల అవకాశాలకు దూరమైపోయి.. తక్కువ జీతంతో బతుకుబండి లాగిస్తారు. అందువల్ల మానసిక సమస్యలు ఉన్న ఉద్యోగులకు ఆయా సంస్థలు అండగా నిలవాలని అధ్యయనం సూచించింది. విధాన రూపకర్తలు కూడా ఈ విషయంపై దృష్టి సారించాలని కోరింది.
పొగ మానాలనుకునే వారికి..
ధూమపానం మానాలని అనుకుంటున్నారా? దీనికి ఓ మెరుగైన పరిష్కారాన్ని కనుగొన్నారు పరిశోధకులు. మొక్కలకు సంబంధించిన సైటిసిన్ అనే మూలకం పొగతాగే అలవాటును మాన్పించగలదట. అదీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానే. ‘అడిక్షన్ జర్నల్’లో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం.. ప్లాసెబో, నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీలతో పోలిస్తే సైటిసిన్కు ధూమపానాన్ని మాన్పించే సామర్థ్యం రెండురెట్లు ఎక్కువని తెలిసింది. తూర్పు ఐరోపాదేశాల్లో ఇది 1960ల నుంచే అందుబాటులో ఉంది. కానీ, ఇతర దేశాల్లో దీని వినియోగానికి చట్ట
పరమైన అనుమతులు లేకపోవడంతో ప్రచారంలోకి రాలేదు.