అవిసె చెట్టును ఇట్టే గుర్తుపట్టవచ్చు. ఇది మధ్యస్తంగా పెరిగే మొక్క. దీని పూలు తెలుపు, ఎరుపు రంగుల్లో ఎగిరే పిట్ట ఆకారాన్ని పోలి ఉంటాయి. కాయలు మునగకాయల్లా పొడుగ్గా ఉంటాయి. ఆకుల అమరిక, పూలు, కాయలు చూడగానే అవిసె చెట్టుని గుర్తించవచ్చు. అవిసె గింజలు నల్లగా, నువ్వుల ఆకారంలో, గట్టిగా ఉంటాయి. వీటిని ఆంగ్లంలో ‘ఫ్లాక్స్ సీడ్స్’ అంటారు. అవిసె గింజల పొడిని కూరల్లో వాడతారు. ఈ పొడికి ఎటువంటి రుచీ లేకపోయినా… అనేక ఔషధ గుణాలు ఉండటం వల్ల వంటకాల్లో వాడతారు.
అవిసె ఆకులను దంచి, రసం తీసి ఔషధంగా ఉపయోగిస్తారు. కడుపులో నులిపురుగుల బాధ నివారణకు ఇది దివ్యౌషధం. సైనసైటిస్ వల్ల కలిగే నొప్పిని ఈ ఆకు రసం తగ్గిస్తుంది. అవిసె పూల కషాయంతో రేచీకటిని నివారించవచ్చు. పశువుల మేతకు ఈ అవిసె చెట్టు ఆకులను వేయడం వల్ల పశువులు ఆరోగ్యంగా ఉంటాయి. పల్లెల్లో ఎక్కడ చూసినా ఈ అవిసె చెట్లు విరివిగా కనిపిస్తాయి. ఈ మధ్య పట్టణాల్లో కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అవిసె గింజల్లో పీచు పదార్థాలు అధిక మొత్తంలో ఉంటాయి. వీటిని కొలెస్ట్రాల్ తగ్గించే గింజలని కూడా పిలుస్తారు. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. దీంతో మన ఆరోగ్యానికి హామీ లభిస్తుంది. అవిసె గింజలు శరీరంలోని గ్లూకోజ్‌ని అదుపులో ఉంచుతాయి. కేశ సౌందర్యాన్ని పెంపొందిస్తాయి.
అవిసె గింజలను మానవులు వేల సంవత్సరాల నుంచి ఉపయోగిస్తున్నారని చరిత్ర ఆధారంగా తెలుస్తున్నది. జీవక్రియలను సరి చేయడంతోపాటు గుండె జబ్బులు, క్యాన్సర్ వ్యాధులను నిరోధించే శక్తి అవిసె గింజలకు ఉంది. రోజూ ఒక చెంచా అవిసె గింజలు బాగా నమిలి తినడం వల్ల అనేక రుగ్మతలకు చెక్ పెట్టవచ్చు. ఈ అవిసె గింజలను మొదటిసారి ‘అమెరికా మార్కెట్’లో చూశాను. దానిమీద లేబుల్ చదివాను. హైదరాబాద్ రాగానే ఈ చెట్టుని చూసి నివ్వెరపోయాను. దీనిని అనేకసార్లు చూశాను. అన్నిచోట్లా అత్యంత సులభంగా పెరుగుతుంది. అందుకే ఔషధ మొక్కను గుర్తించడం గొప్ప కళ. మా పీవీ ఔషధ వనంలో పది అవిసె చెట్లు ఉన్నాయి. వాణిజ్యపరంగానూ ఈ చెట్లను పెంచవచ్చు.
-ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, పీవీ కూతురు