ఇంట్లో చిన్నపిల్లలు ఆడుకునేందుకు బొమ్మలు కావాలని మారాం చేస్తే చాలామంది అప్పటికప్పుడు ఏదో ఒక బొమ్మను కొనిస్తుంటారు కదా. కానీ ఈ తండ్రి మాత్రం అలా చేయలేదు.. తన కూతురు బొమ్మ కావాలని అడగగానే కాస్త సమయం తీసుకొని జీవితాంతం గుర్తుండిపోయే రోబో టాయ్‌ను తయారు చేసిచ్చాడు. అక్కడితో ఆగకుండా ఏకంగా దానికి పేటెంట్ హక్కులను కూడా సంపాదించాడు. ఆయన ఎవరో కాదు రాయదుర్గంలోని ఎఫ్‌డీడీఐ ఫ్యాకల్టీ డాక్టర్ రాంబాబు ముప్పిడి. నిత్యం కొత్త వస్తువులను తయారు చేస్తూ పేటెంట్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన రాంబాబు బతుకమ్మతో పంచుకున్న ముచ్చట్లు ఆయన మాటల్లోనే..
మా పూర్వికులంతా చేతివృత్తుల పనులు చేస్తుండేవారు. మా తాత తాటినారతో ఇంట్లో వాడుకునే ఉట్లు తయారు చేసేవాడు. ఆ తరువాత మా నాన్న, అన్నయ్య కలిసి కాస్త వినూత్నమైన పనులు చేసేవారు. చిరంజీవి, బాలకృష్ణ సినిమాలకు కలపతో కటౌట్లు తయారు చేస్తూ బతుకీడ్చుకొచ్చారు. ఆ తరువాత వాటికి పెద్దగా గిరాకీ లేకపోవడంతో స్టోన్ కర్వింగ్ పనులు చేసుకుంటు జీవిస్తున్నారు. ఇంట్లోవాళ్లు చేస్తున్న పనులను దగ్గరనుంచి గమనించిన నాకు కలప పనులమీద ఆసక్తి ఏర్పడింది. అందుకే ఇష్టపడి మరీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఫైన్ ఆర్ట్స్ అండ్ డిజైన్ కోర్సును తీసుకున్నాను. క్రాప్ట్స్ అండ్ డిజైన్ కల్చర్‌లో పీహెచ్డీ చేసి పట్టా పొందాను. ప్రస్తుతం హైదరాబాద్ రాయదుర్గంలోని ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ (ఎఫ్‌డీడీఐ)లో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. లెదర్, కలప వంటి ఉపకరణాలతో కొత్త కొత్త డిజైన్లను తయారు చేస్తూ పలు పేటెంట్లు సైతం సొంతం చేసుకున్నా.
ఒకే బొమ్మలో అన్ని ఆటలు
కొత్త డిజైన్ల మీద కసరత్తు చేయడం నా జీవితంలో భాగం. రోజూ అదే పనిలో నిమగ్నమవుతుంటాను. మూడో తరగతి చదువుతున్న నా కూతురు అనన్య ఒకరోజు నా దగ్గరికొచ్చి.. ‘ఆడుకునేందుకు బొమ్మలు కొనివ్వు డాడీ’ అని మారాం చేసింది. బిడ్డ కోరిక తీర్చడం ఒక తండ్రిగా నా బాధ్యత. అందుకోసం ఆమెకు జీవితాంతం గుర్తుండిపోయే బొమ్మను ఇవ్వాలని అప్పుడే అనుకున్నాను. అందుకోసం డిజైనర్‌గా వినూత్నమైన ఆలోచన మొదలుపెట్టా. అందుకోసం చిన్నారులు బొమ్మలతో ఎలా సంభాషిస్తారు, వాటిని వాళ్లు పట్టుకొని కదిలించే తీరు, వాటి చుట్టూ అల్లుకునే కథలు, భావోద్వేగాలకు లోనయ్యే తీరు.. ఈ అంశాలన్నిటినీ తెలుసుకోవాలని రెండు నెలలపాటు శ్రమించాను. పార్కులకు వెళ్లి పిల్లలను గమనిస్తూ ఉండేవాణ్ని. పిల్లలు తమ బొమ్మలను హత్తుకోవడం, కోపం వచ్చినప్పుడు అందాక ఆడుకున్న బొమ్మను విసిరిపారేయడం, కాళ్లూ చేతులు విడదీయడం, మళ్లీ అతికించడం.. ఇలా చిన్నారులు చేసే చేష్టలన్నీ గమనించాను. ఒక్కో బొమ్మలో ఒక్కో ఆనందాన్ని వెతుక్కునే చిన్నారుల కోసం వాటన్నిటినీ ఒకే బొమ్మ ద్వారా అందించాలని ‘రోబో టాయ్’కు శ్రీకారం చుట్టాను.
డిజిటల్ మాడలింగ్ వైపు
ఏటికొప్పాక బొమ్మల నుంచి ప్రేరణ పొంది ప్లాస్టిక్, సింథటిక్ పదార్థాలను ఎంచుకోకుండా తేలికైన కలపతో ‘రోబో టాయ్’ తయారు చేశాను. 20 గ్రాముల బరువుతో 463 అంగుళాల కాంపాక్ట్ పరిమాణంలో దీనిని రూపొందించాను. పసుపు, నలుపు రూపురేఖలతో తీర్చిదిద్ది మా అమ్మాయి ఆడుకునేందుకు అనుకూలంగా అందమైన రోబోటిక్ బొమ్మను సృష్టించాను. అక్కడితో ఆగకుండా దాన్ని మరింత వినూత్నంగా అందించడం కొరకు CAD టెక్నాలజీని ఉపయోగించి డిజిటల్ ఫార్మాట్లోకి అనువదించాను. మాన్యువల్ కార్వింగ్ నుంచి డిజిటల్ మాడలింగ్ వైపు తన ఆధునిక ఆవిషరణకు వారధి పడింది. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు జరిగిన ఈ కసరత్తులో గతేడాది డిసెంబర్ 24న పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకోగా ఈ ఏడాది ఫిబ్రవరి 13న ఇండియన్ పేటెంట్ ఆఫీస్ ఆమోదం తెలిపింది.
ఉచితంగా పేటెంట్ ఇస్తా
కనుమరుగవుతున్న ఏటికొప్పాక, నిర్మల్ బొమ్మలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ బొమ్మను ఆలోచనాత్మకంగా రూపొందించాను. పట్టణాలకు గ్రామీణ చేతివృత్తులను పరిచయం చేయడమే ధ్యేయంగా పనిచేశాను. అడిగిన బొమ్మ కొనివ్వకుండా అద్భుతమైన బొమ్మను చేసిచ్చినందుకు నా కూతురు ఎంతగానో సంతోషించింది. ఈ ఆనందం కేవలం నా కూతురుకి మాత్రమే పరిమితం కావొద్దు అనిపించింది. ఈ బొమ్మ పేటెంట్ ఎవరు అడిగినా ఉచితంగా ఇవ్వడానికి నేను సిద్ధం. ఈ విధంగా అయినా వృత్తి కళాకారుల జీవితాలు మారుతాయన్న విశ్వాసంతో ఉన్నాను.
ప్రస్తుతం నేను తయారు చేసిన రకరకాల డిజైన్లలో 44 దరఖాస్తులు చేసుకోగా 26 డిజైన్లకు పేటెంట్ పొందాను. నా రిజిస్టర్డ్ డిజైన్లలో తోలు ఉపకరణాలు, జీవనశైలి ఉత్పత్తులు, హస్తకళలు, యుటిలిటీ ఉత్పత్తులు, పిల్లల బొమ్మలు వంటివే అనేకం ఉన్నాయి. ఈ పేటెంట్ పొందిన వాటిల్లో మూడు నా కూతురు కోసం చేసినవే ఉండటం విశేషం.
…? రాజు పిల్లనగోయిన