కుత్బుల్లాపూర్, జూన్ 3: పోలీసులమని నమ్మించి వ్యాపారస్తులను, ఆర్ధికంగా బలంగా ఉన్న వ్యక్తులను టార్గెట్ చేస్తూ కిడ్నాప్‌లు, బెదిరింపులతో పాటు డిజిటల్ వసూళ్లకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర నకిలీ పోలీసు(సూడో పోలీసు)ల ముఠా పోలీసులకు చిక్కింది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కూకట్పల్లి సీసీఎస్, జగద్గిరిగుట్ట పోలీసులు సంయుక్తంగా ఛేదించిన కేసుకు సంబంధించిన వివరాలను కుత్బుల్లాపూర్ జోన్ డీసీపీ కోటిరెడ్డి వెల్లడించారు.
కూకట్‌పల్లికి చెందిన కావురి పూర్ణచందర్రావు అనే వ్యాపారి మే 18న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో తన మోటర్ సైకిల్‌పై జగద్గిరిగుట్ట పరిధిలోని ప్రశాంత్‌నగర్ వైపునకు వెళ్తున్నాడు. శుభోదయ కాలనీలోని లేక్ బార్ ఎదురుగా కారులో వచ్చిన దుండగులు అతడిని అడ్డుకొని తాము హర్యానాకు చెందిన పోలీస్ అధికారులమని.. మీపై హర్యానాలో ఒక క్రిమినల్ కేసు నమోదైందని, విచారణ నిమిత్తం తమతో రావాలని నమ్మించారు. కాగా అప్పటికే హర్యానాలో పూర్ణచందర్రావుపై ఓ కేసు వ్యవహారం నడుస్తుండటంతో నిజమైన పోలీసులేనని బాధితుడు నమ్మగా.. అతడు తేరుకునేలోపే బలవంతంగా కారులోకి ఎక్కిం చి అక్రమంగా బంధించారు. అతని మొబైల్ ఫోన్, ఏటీఎం కార్డు, నగదు లాక్కొని బ్యాంకింగ్ ఐడీలు, పాస్వర్డ్లు తెలుసుకున్నారు.
ఈ క్రమంలో బాధితుడు తమను పూర్తిగా నమ్మించేందుకు హర్యానాకు చెందిన ఒక పొలీస్ అధికారితో ఫోన్లో మాట్లాడుతున్నట్లుగా ఒక నకిలీ వీడియో కాల్‌ను క్రియే ట్ చేసి డ్రామా ఆడారు. అనంతరం బాధితుడిని కారులోనే సూర్యాపేటకు తీసుకెళ్లారు. అక్కడ ఏటీఎం ద్వారా మొదటగా రూ.లక్ష డ్రా చేశారు. అలాగే ఫోన్ పే ద్వారా బ్యాంకింగ్ అప్లికేషన్ల ద్వారా వివిధ అకౌంట్లకు దాదాపుగా రూ.5 లక్షల 26 వేలు వసూలు చేసి తర్వాత భౌతికంగా దాడిచేసి, అతడి ఫోన్లోని సిమ్‌కార్డులు తొలగించి, ఒక సాధారణ బేసిక్ ఫోన్‌ను చేతిలో పెట్టా రు.
ఆ తర్వాత తిరిగి నగరానికి తీసుకొచ్చి జనసంచారం లేని నిర్మానుష్య ప్రాంతంలో వదిలేసి పరారయ్యారు. జరిగిన ఘటనపై బాధితుడు పూర్ణచందర్రావు మే 20న జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. టేటెస్ట్ టెక్నాలజీ ఫేషియల్ రికగ్నిషన్ యాప్ ద్వారా పాత నేరస్తుల డేటాతో పోల్చి చూసి ప్రధాన నిందితుడైన తూ ర్పు గోదావరి జిల్లాకు చెందిన ఎ-1 నాగరాజును ట్రాక్ చేసి పట్టుకున్నారు. విచారణలో ప్రధాన నిందితుడితో పాటు బీహర్‌కు చెందిన ప్రదీప్‌కుమార్ మిశ్రా, ఆగ్రాకు చెందిన సత్యభాన్సింగ్, మహబూబాబాద్‌కు చెందిన నాగేంద్రశర్మ, మరో ముగ్గురు నిందితులను నిజాంపేట్‌లోని ఓ రూమ్‌లో అరెస్ట్ చేసారు.
యశ్వంత్‌సింగ్, సునీల్కుమార్సింగ్ పరారీలో ఉన్నారు. వారి వద్ద నుంచి కంట్రీ మేడ్ పిస్టల్, నకిలీ పోలీస్ యూనిఫామ్‌లు, ఐడీకార్డులు, ర్యాంక్బ్యాడ్జీలు, బేడీలు, లాఠీలు, పోలీస్ స్టాం పులు, నేమ్ప్లేట్లు, షూస్, నకిలీ ప్రభుత్వ పత్రాలు, లెటర్ప్యాడ్లు, నకిలీ కోర్టు సీళ్లు, మొబైల్ఫోన్లు, ల్యాటాప్లు, కారు, ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఆపరేషన్‌లో జోన్ క్రైమ్ డీసీపీ ముత్యంరెడ్డి, అడిషనల్ డీసీపీ పురుషోత్తం, కుత్బుల్లాపూర్ ఏసీ పీ బాలగంగిరెడ్డి, సీసీఎస్ ఏసీపీ నాగేశ్వర్రావు, జగద్గిరిగుట్ట సీఐ పీ నరేంద్రరెడ్డి, సీసీఎస్ ఇన్స్పెక్టర్ కే రవికుమార్, క్రైమ్ టీం పాల్గొన్నారు.