ప్రతి ఇంటి పెరట్లో పెంచుకునే చెట్టు జామ. ఇది ఎక్కని పిల్లలు లేరేమో! జామచెట్లు ఇరవై అడుగుల ఎత్తు పెరుగుతాయి. ఏడాది పొడవునా మనకు జామపండ్లు లభిస్తాయి. దోరగా పండినప్పటి నుంచి జామ చాలా తియ్యగా ఉంటుంది. ఇవి కమ్మని ప్రత్యేకమైన వాసన కలిగి ఉంటాయి. జామపండులో కమలాపండు కంటే ఎక్కువ మోతాదులో విటమిన్ సి ఉంది. జామపండ్లలో కొన్ని తెల్లని గుజ్జు, మరికొన్ని ఎర్రని గుజ్జు కలిగి ఉంటాయి. ఈ గుజ్జులో ఉండే గింజలు ఆవ గింజల కన్నా కొద్దిగా ఎక్కువ పరిమాణంలో ఉంటాయి. జామకాయలతో పచ్చళ్లూ, జామపండ్లతో జామ్లూ, కాండీలూ చేసుకోవచ్చు. తేయాకుతో టీ కాచుకున్నట్టే జామ ఆకులతో చాయ్ కాచుకుని కొంతమంది తాగుతారు. జామపండు తినడానికే కాదు సంగీత సాహిత్యాల్లో జామపండు ప్రస్తావన ఉంది.
విటమిన్ ఎ, విటమిన్ సితోపాటు జామలో పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. జామ ఆకులు, బెరడు నుంచి తయారుచేసిన పదార్థాన్ని బాక్టీరియా ద్వారా వచ్చే అంటువ్యాధులు, వాపులు, నొప్పి నివారణకు ఔషధంగా వాడుతారు. చక్కెర వ్యాధిని తగ్గించడంలో కూడా జామను ఉపయోగిస్తారు. రుతు సంబంధ బాధల్లో జామ ఆకు రసం ఔషధంగా వాడతారు. జామలోని వాపులను తగ్గించే గుణాల వల్ల రుతుసంబంధమైన సమస్యలు ఉన్నవారికి ఉపశమనం కలిగిస్తుంది. బరువు తగ్గించుకునే ఆహార ప్రణాళికలో జామపండు ఉండాల్సిందే! చాట్ మసాలా చల్లుకొని గాని, ఇతర పండ్ల ముక్కలతో కలుపుకొని ఫ్రూట్ సలాడ్ చేసుకునిగాని తినవచ్చు.
ప్రపంచంలో వంద రకాల జామచెట్లు ఉన్నాయి. మన దేశంలోనూ జామతోటలను విరివిగా పెంచుతున్నారు. అలహాబాద్ సఫేదా, సర్దార్, లలిత్, అర్క, మృదుల, అమృద్ జామపండ్లు మన దేశంలో పండుతున్నాయి. అలహాబాద్ సఫేదా రకం జామపండ్లు కిలోకి రెండే తూగుతాయి. అంత పెద్దగా ఉంటాయి. జామపండ్లను మెక్సికో, అమెరికా వంటి దేశాల్లోనూ విరివిగా పండిస్తున్నారు. మన రాష్ట్రంలో మామిడిలాగే జామను వాణిజ్యపంటగా రైతులు సాగు చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో జామ తోటలు ఎక్కువగా ఉన్నాయి. జెల్, జామ్, జ్యూస్ల తయారీకి అనుకూలమైనందున వాణిజ్యపరంగా జామతోటలు విరివిగా పెంచి లాభపడుతున్నారు.
-ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, పీవీ కూతురు