నవంబర్, డిసెంబర్ ఆంగ్ల ఏడాదికి ముగింపు నెలలు. ప్రకృతి ప్రేమికులు, యాత్రికుల సంతోషాలకు స్వాగత మాసాలు. వెచ్చని ఎండ, చల్లని గాలితో ఆహ్లాదం పంచే వాతావరణంలో ప్రకృతి అందాలు చూసి రావడం మాటల్లో చెప్పలేని అనుభూతి. రాతి కోటల్లో విహారాలు, కోవెల కోనేటిలో జలకాలాటలు, పచ్చని మైదానాలు, దట్టమైన అడవులు, ఇసుక ఎడారులు.. ఇలా ఏ ప్రాంతమైనా చూసి రావడానికి ఇది అనుకూల సమయం. ఇన్ని ఆనందాల్లో ఏవో కొన్ని అగచాట్లు. దారితప్పితే సంతోషాలు కాస్తా ఆవిరవుతాయి. ఇలాంటి బాధలకు చెక్ పెడుతూ, పర్యాటకులకు సరికొత్త సౌకర్యాలు కల్పిస్తున్నది గూగుల్ మ్యాప్స్. ఈ గూగుల్ దారి సంతోషాలకు రహదారి.
తీరాలు తిరిగొద్దాం. ఎత్తయిన కొండలు ఎక్కేద్దాం. కొత్త జనాన్ని చూసొద్దామని ఎక్కడికైనా వెళ్తే.. ‘అమ్మో కొత్త చోటు.. కొత్త భాష.. ఇప్పుడు అడ్రస్ ఎలా కనుక్కోవాలి? ఎవరిని అడగాలి?’ అని సందేహించడం. తీరా అడిగాక ‘టేక్ రైట్.. లెప్ట్ లేలో.. సీదా పో..’ అని చెబుతుంటే కన్ఫ్యూజన్ పెరుగుతుంది. ఈ తికమకలో వాళ్ల మాటలకు తెలిసిన దారి కాస్తా మర్చిపోతాం. ఇవన్నీ అక్టోబర్ మాసం బాధలు. నవంబర్ మాసంలో పాత బాధలుండవు. ఎక్కడికి పోయినా.. దారి కనుక్కోవడం సింపుల్. జేబులో ఫోన్ బయటికి తీయండి. గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేయండి. చేరాల్సిన అడ్రస్ సెర్చ్ చేస్తే ఏ ఇబ్బందీ లేకుండా అనుకున్నచోటుకు దారి చూపిస్తుంది. ఇలాగే అనుకుని బయల్దేరితే ఆ దారిలో పోలేక ఇబ్బంది పడ్డామని పాత ఫిర్యాదులే చెప్పకండి. ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ కొత్తగా వచ్చిన ఏఐ టెక్నాలజీతో అప్డేట్ అయింది. ఇందులోని స్మార్ట్ సౌకర్యాల్ని వాడుకుని ట్రావెల్‌ని సుఖమయం చేసుకోవచ్చు. గూగుల్ మ్యాప్స్‌లోని ఏఐ ఫీచర్లతో ఎన్ని లాభాలో తెలుసా?
రూట్ మ్యాప్‌ని ఓపెన్ చేసి ఎక్కడికి వెళ్లాలో ఎంటర్ చేశాక… ‘స్టార్ట్’ నొక్కేసి స్టీరింగ్ తిప్పుకొంటూ బ్లైండ్‌గా ఫాలో అయిపోవడమే. కొన్నిసార్లు మ్యాప్ చూపిస్తుంది కదా అని.. ఇరుకు సందుల్లో ఇరుక్కుపోవడం.. కారు వెనక్కి తిప్పలేక ఇబ్బందిపడటం అనుభవమే. ఆ చేదు అనుభవాలు మళ్లీ ఎదురుకాకుండా ఏఐ టెక్నాలజీతో గూగుల్ మ్యాప్స్‌లో కారు, పెద్ద వాహనాల ప్రయాణానికి ఉన్న వెసులుబాటు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ దారి చూపే ఫీచర్‌ను త్వరలో ప్రవేశపెడుతున్నది. ఇప్పటికే కొన్ని నగరాల్లో అందుబాటులోకి వచ్చింది. త్వరలో అన్ని ప్రాంతాలనూ చుట్టేస్తుందీ ఏఐ టెక్నాలజీ.
కొన్ని ప్రధాన నగరాల్లో ైప్లె ఓవర్లు పెద్దగా ఉంటాయి. అనుకోకుండా ఆ బ్రిడ్జ్ గనుక ఎక్కామంటే చాలు.. చేరుకోవాల్సిన గమ్యం దూరమవుతుంది. ఒక్కసారి వంతెన ఎక్కితే డైవర్షన్ తీసుకోవడానికి వీలుండదు. అందుకే.. మనం వెళ్లే రూట్లో ఫ్లై ఓవర్ ఉంటే ముందే తెలుసుకునేలా ‘ఫ్లై ఓవర్ నావిగేషన్’ సదుపాయం గూగుల్ మ్యాప్స్ అందిస్తుంది. ప్రస్తుతానికి దేశంలోని 40 నగరాల్లో ఉన్న బ్రిడ్జ్‌లను హైలైట్ చేస్తూ గూగుల్ మ్యాప్స్ వీటిని చూపిస్తున్నది.
ప్రధాన నగరాల్లోని మెట్రో సేవల గురించి తెలిసిందే. ప్రయాణికులు మ్యాప్స్ నుంచే మెట్రో టికెట్స్ బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. సో.. పర్యాటకులు ఇతర బుకింగ్ యాప్స్‌ని ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు.
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్నది. దారిలో చార్జింగ్ స్టేషన్ల కోసం వెదుక్కోవడం కూడా సమస్యే. దీనికీ గూగులే దారి చూపిస్తుంది. మ్యాప్స్‌లోనే చార్జింగ్ స్టేషన్ లొకేషన్ చూపిస్తుంది. దేశ వ్యాప్తంగా సుమారు 8,000 చార్జింగ్ స్టేషన్ల లొకేషన్స్‌ని ఈ మ్యాప్ చూపుతుంది.
పర్యాటక ప్రదేశాల్లో ఉన్న ముఖ్యమైనవన్నీ చూసి రావాలని కోరుకుంటారు. టూరిస్టులు ఏ ఒక్కటీ మిస్ కాకుండా ఉండేందుకు గూగుల్.. లోకల్స్‌తో జట్టు కట్టింది. ముఖ్య నగరాల్లో ఆయా టూరిస్ట్ స్పాట్స్ గురించి తెలుసుకునేలా మ్యాప్స్‌లో వివరాల్ని పొందుపరుస్తున్నది. ఎక్కడికి వెళ్లాలి? ఎలా చేరుకోవాలి? ఎక్కడ ఉండాలి? ఏమేం చూసి రావాలి? అన్నీ గూగుల్ చేప్పేస్తుంది. అది చెప్పినట్టు చేస్తే టూర్ విజయవంతం అయినట్టే.
టూరిస్టులు ఒక ప్రాంతాన్ని సందర్శించినప్పుడు ఆ అనుభూతుల్ని ఇతరులతో పంచుకుంటారు. ఈ అనుభవాలను ఇక నుంచి గూగుల్ మ్యాప్స్‌లోనూ పంచుకోవచ్చు. ఆ సమాచారాన్ని ఆయా ప్రదేశాలకు జోడించవచ్చు. కొందరి అనుభవాల మార్గదర్శనంలో ఏ ఇబ్బందీపడకుండా చేరుకోవాల్సిన ప్రదేశం చేరుకోవచ్చు.
ఓ ప్రాంతానికి వెళ్లకుండానే, కూర్చున్నచోటు నుంచే గూగుల్ ఎర్త్‌లో ఎక్కడెక్కడో తిరిగిరావొచ్చు! ‘స్ట్రీట్ వ్యూ’ అందుకు ఓ ఉదాహరణ. గూగుల్ ఎర్త్‌లో ఏకంగా 80 ఏండ్ల వెనక్కి వెళ్లి ఆనాటి వీధుల్ని చూసి రావొచ్చు. ఈ స్ట్రీట్ వ్యూలో ఏటికేడూ ఎలా మారుతూ వచ్చిందో తెలుసుకోవచ్చు. ప్రకృతిలో వచ్చిన మార్పులైతే స్పష్టంగా చూడొచ్చు. ఏఐ టెక్నాలజీ వల్ల స్ట్రీట్ వ్యూ మరింత మెరుగవుతుందని గూగుల్ చెబుతున్నది.