తెలుగు సినిమా ప్రేక్షకుల గుండెల్లో ‘హాసిని’గా ప్రత్యేకస్థానం సంపాదించుకున్న నటి జెనీలియా డిసౌజా. దక్షిణాదితోపాటు బాలీవుడ్‌లోనూ స్టార్ హీరోలతో జతకట్టిన జెనీలియా తక్కువ సమయంలోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. బబ్లీ క్యారెక్టర్లకు కేరాఫ్‌గా కెరీర్ దూసుకుపోతున్న సమయంలోనే రితేశ్ దేశ్‌ముఖ్‌ని పెళ్లి చేసుకుని నటనకు బ్రేక్ ఇచ్చింది. తాజాగా కిరీటి రెడ్డి హీరోగా పరిచయమైన ‘జూనియర్’ సినిమాతో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ముంబయి బ్యూటీ జెనీలియా పంచుకున్న కబుర్లు..
నేను ముంబయిలో పుట్టాను. అమ్మ జీనెట్ డిసౌజా ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్‌గా, నాన్న నీల్ డిసౌజా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో సీనియర్ ఆఫీసర్‌గా పనిచేసేవారు. సెయింట్ ఆండ్రూస్ కాలేజీలో బీఏ పూర్తిచేశాను. చిన్నప్పటి నుంచీ అన్నింట్లోనూ చాలా చురుగ్గా ఉండేదాన్ని. రాష్ట్రస్థాయిలో అథ్లెట్‌గా గుర్తింపు సాధించాను.
‘తుఝే మేరీ కసమ్’ షూటింగ్ సమయంలో రితేశ్, నేను మొదటిసారి కలుసుకున్నాం. ఆ సినిమా సమయంలోనే మా స్నేహం ప్రేమగా మారింది. దాదాపు పదేళ్ల ప్రేమ తర్వాత 2012లో పెళ్లి చేసుకున్నాం. రితేశ్ నాకు పెద్ద సపోర్టర్. ‘జూనియర్’ సినిమా కథ వినగానే నన్ను ఒప్పించాడు. గత మూడేళ్లుగా నా రీ-ఎంట్రీ కోసం టార్చర్ చేశాడు! తన ప్రోత్సాహం వల్లే నేను మళ్లీ కెమెరా ముందుకు వచ్చాను.
ఎన్టీఆర్, రామ్ చరణ్, సిద్ధార్థ్, రామ్‌లతో కలిసి నటించడం గొప్ప అనుభవం. ఎన్టీఆర్ ఒక్క టేక్‌లో భారీ డైలాగ్‌లు చెప్పేస్తారు. రామ్ చరణ్‌తో ‘ఆరెంజ్’లో నటించినప్పుడు అతని ప్రొఫెషనలిజం చూసి ఆశ్చర్యపోయాను. బాలీవుడ్లో ‘తుఝే మేరీ కసమ్’, ‘ఫోర్స్’, ‘వేద్’ వంటి సినిమాలు చేశాను. ‘వేద్’ సమంత నటించిన ‘మజిలీ’ రీమేక్. బాలీవుడ్ నాకు మంచి అవకాశాలిచ్చింది, కానీ తెలుగు ప్రేక్షకుల ఆప్యాయత వేరే లెవెల్!
నా మొదటి సినిమా 2003లో వచ్చిన ‘తుఝే మేరీ కసమ్’. ఆ సినిమాలో రితేశ్‌తో కలిసి నటించాను. అదే సమయంలో తమిళ డైరెక్టర్ శంకర్ రూపొందించిన ‘బాయ్స్’ సినిమాలో చాన్స్ వచ్చింది. తెలుగులో
నా మొదటి సినిమా ‘సత్యం’. సుమంత్‌తో కలిసి నటించాను. ఆ చిత్రానికి మంచి ఆదరణ లభించింది. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులు నన్ను ఓన్ చేసుకున్నారు.
‘బొమ్మరిల్లు’ సినిమా నా కెరీర్లో టర్నింగ్ పాయింట్. ఆ పాత్ర అమాయకత్వం, అల్లరి, సహజత్వం అందరికీ నచ్చాయి. నన్ను ఇప్పటికీ హాసిని అని పిలిచేవాళ్లు ఉన్నారు. హాసిని నాకు చాలా స్పెషల్. ఆ పాత్రలో నటించడం చాలా కష్టమైనా, అది నా నటనా సామర్థ్యాన్ని బయటికి తీసుకొచ్చింది.
2012లో రితేశ్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత కుటుంబానికి ప్రాధాన్యం ఇవ్వాలనుకొని ఇండస్ట్రీకి దూరం అయ్యాను. మాకు ఇద్దరు అబ్బాయిలు రియాన్, రాహుల్. వాళ్ల ఆలనాపాలనలో బిజీగా ఉండిపోయాను. 13 ఏళ్ల విరామం తర్వాత ‘జూనియర్’ సినిమాతో తెలుగు తెరకు తిరిగి వచ్చాను. కిరీటి రెడ్డి, శ్రీలీలతో కలిసి నటించాను. ఈ సినిమా కథ నన్ను ఆకర్షించింది.