చ॥ జలధర చారు గాత్ర, నవ సారసపత్ర విశాల నేత్ర, ని
ర్మల పటుయోగి హృత్కమల రాజిత మిత్ర, రమా కళత్ర ని
శ్చల చరితా విచిత్ర రిపు సంహర శ్రీ వసుదేవ పుత్ర, యు
జ్వల శరదిందు కుంద ఘనసార యశో మహనీయ కేశవా
ఈ పద్యం శ్రీ రెడ్రెడ్డి మల్లారెడ్డి దేశాయ్ గారు రచించిన గంగాపుర మహాత్మ్యం అనే కావ్యం లోనిది. అప్పటి మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్లకు మూడు మైళ్ల దూరంలో ఉన్న గ్రామం గంగాపురం. చోళుల పాలనలో క్రీ.శ.1000 సంవత్సరంలో నిర్మితమైన కేశవ దేవాలయం, చౌదీశ్వరీ దేవాలయం ఇక్కడ ఉన్నాయి. చాళుక్యుల శాసనాలు కూడా ఉన్నాయి. ఇక్కడనే గొల్లత్త గుళ్లు అనే ప్రాచీన నిర్మాణాలు కనిపిస్తాయి. రుద్రమ దేవి శా.శ.1183లో విశ్వేశర గోళకీ మఠానికి మందడం (గుంటూరు)లో భూములు దానం చేసినట్లు శాసనాల్లో ఉంది. ఆ గోళకీ మఠాలనే ఇక్కడ గొల్లత్త గుట్టలుగా పిలుస్తారని పరిశోధకుల అభిప్రాయం.
ఈ కావ్య రచయిత మల్లారెడ్డి 17వ శతాబ్దానికి చెందిన కవి.
ఈ గ్రామంలోని దేవాలయాలను ఉద్ధరించిన చోళరాజులను ఈ కావ్యంలో పేర్కొన్నారు కవి. ఈయన కవిత్వం చక్కని ధారాశుద్ధితో సరళంగా ఉంటుంది. ఇది ద్వితీయ ఆశ్వాసంలోని కృష్ణ స్తుతి. నీలమేఘకాంతిని పోలు దేహసౌందర్యం కలవాడు, విశాలమైన తామర పత్రాల వంటి నేత్రద్వయం కలవాడు, స్వచ్ఛమైన యోగి పుంగవుల హృదయమనే కమలాలను ప్రకాశింపజేసే వాడు (మిత్రుడు అంటే సూర్యుడు, స్నేహితుడు. హృదయమనే కమలాలకు సూర్యుని వంటి వాడు అని శ్లేష) లక్ష్మీదేవి భర్త, నిశ్చల చరిత్రుడు, శత్రు సంహారకుడు, వసుదేవుని పుత్రుడు, శరచ్ఛంద్ర, మొల్ల పూల, కర్పూరం లాంటి తెల్లని కీర్తితో ప్రకాశించే కృష్ణుడికి నమస్కారం అని స్థూలంగా పద్యం భావం.
-చేపూరి శ్రీరాం, హన్మకొండ