డైనింగ్ టేబుల్ మీద ఓ పండ్లబుట్ట… అదీ మట్టితోనో లేదా రబ్బర్తోనో చేసిన పండ్లను పెట్టిన బుట్ట ఉండటం చాలామందికి ఓ నోస్టాల్జిక్ ఫీలింగ్. మనం తినడానికి కూర్చునే చోట అరటి దానిమ్మల్లాంటి బొమ్మల్ని అలంకారంగా పెట్టుకోవడం అన్నది ఎప్పటినుంచో తెలిసిన విషయమే. అయితే మనం తినే చోటే కాదు, తిరిగే చోటంతా ఏదో ఒక నోరూరించే ఆహారాన్ని పోలిన హోమ్ డెకార్ ఉండటం అన్నది ఇప్పటి విషయం. కొన్నాళ్లుగా జోరందుకున్న ఈ మోజు మీద ప్రపంచవ్యాప్తంగా రానున్న ట్రెండ్లను అంచనా వేసి చెప్పే ఓ సంస్థ ఇటీవల ఒక నివేదికను విడుదల చేసింది. దాని ప్రకారం ఇంటి అలంకరణలో ఇలా ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వడం అన్నది 2025లో 107 శాతం పెరగనున్నట్టు అంచనా.
హాల్లోకి రాగానే సోఫా మీద పండ్ల ముక్కల్ని పోలిన రంగు రంగుల మెత్తటి కుషన్లు కనిపిస్తే… ఎంచక్కా ఒళ్లో పెట్టుకుని ఓ సెల్ఫీ తీసుకుంటాం. కాస్త ముందుకు అడుగు పెడితే డైనింగ్ హాల్లోని టేబుల్ మీద రోజ్ క్రీమ్‌లో నిండిన కేక్, దాని పక్కనే కాసిన్ని కుకీలు కనిపిస్తే ఏదో పార్టీకి వెళ్లిన ఫీలింగ్ కలగదూ! వర్కింగ్ డెస్క్ పక్కన కమలా పండును పోలిన చిన్ని వేజ్ ముద్దుగా ఒదిగిపోతే, లివింగ్ రూమ్ గోడకు డోనట్ లాంటి క్లాక్ అందంగా వేలాడుతుంటే… ఇవన్నీ కాస్త చిత్రమైన అనుభూతిని కలిగించేవే.
కొన్ని పదార్థాల్ని, వాటిని పోలిన వస్తువుల్ని చూసినప్పుడు మనసుకు సంతోషంగా అనిపిస్తుంది. ఇందులోనూ ఒక్కొక్కరి అభిరుచీ ఒక్కోలా ఉంటుంది. ఇలా ఎవరికి ఏవి చూస్తే ఉత్సాహంగా అనిపిస్తాయో వాటిని సృజనాత్మక ధోరణిలో ఇంటి అలంకరణకు ఉపయోగిస్తే ఇంట్లోకి వస్తేనే కడుపు నిండిన ఫీలింగ్… అదే మనసు నిండిన ఫీలింగ్ కలుగుతుంది అంటున్నారు హోమ్ డెకరేషన్ నిపుణులు. అంటే ఈ ఫేక్ హోమ్ ఫుడ్ డెకార్ ట్రెండ్ అన్నది సంతోషంగా ఉండటానికి మరో మార్గం అన్నమాట!
నోరూరించే రుచులు ఇప్పుడు మనసూరిస్తున్నాయట. అందుకే హోమ్ డెకరేషన్లో ఆహారానికి అమాంతంగా డిమాండ్ పెరిగిపోయింది. ఇష్టమైన పదార్థాలు కళ్ల ముందు కనిపిస్తుంటే గుండె నిండినట్టు ఉంటుందంటున్నారు నేటి తరం మనుషులు. గది ఏదైనా అక్కడో తినే పదార్థం కనిపించాలని ఆశ పడుతున్నారు. అందుకే ‘ఫేక్ ఫుడ్ హోమ్ డెకార్’ ఇప్పుడు ట్రెండయిపోతున్నది.