Tech Talk | స్మార్ట్‌ఫోన్ ఉన్నాక.. అందులో యాప్‌లు ఉండాల్సిందే! మెసేజుల కోసం ఓ యాప్, రింగ్టోన్ల కోసం మరో యాప్, వాట్సాప్ స్టేటస్‌ల కోసం ఇంకో యాప్.. ఇలా ప్లేస్టోర్‌లోకి వచ్చిన ప్రతి యాప్ మన ఫోన్లో ఇన్స్టాల్ చేయాల్సిందే! అనుకుంటారు కొందరు. కానీ, ఈ యాప్‌లు ఇన్స్టాల్ చేసే క్రమంలో రకరకాల అనుమతులు అడుగుతాయి. ఆ యాప్ దేనిని ఉద్దేశించింది? అడుగుతున్న పర్మిషన్లు ఏమిటి? అనే స్పృహ కలిగి ఉండాలి. ఎందుకంటే ‘మీరు ఇన్స్టాల్ చేసే యాప్‌లకు ఇచ్చే ప్రతి అనుమతి.. మీ ఫోన్లోకి చొరబడే చిన్న ద్వారం లాంటిది. ఆ దారి ఫ్రాడ్స్టర్లకు తెలిసిపోతే.. మీ డేటా వాళ్లకు చిక్కినట్టే.
కొన్ని యాప్‌లు.. తమ పనికి సంబంధం లేని అనుమతులను అడుగుతుంటాయి. ఉదాహరణకు, మీరు టార్చ్ లైట్ కోసం ఒక యాప్‌ను డౌన్లోడ్ చేశారనుకోండి. దానికి మీ ఫోన్లోని కాంటాక్టులు, మెసేజ్‌లు, లొకేషన్ యాక్సెస్ ఎందుకు అవసరం? ఆలోచించండి! ఇలాంటి అనవసర అనుమతులే ప్రమాదకరంగా మారుతాయి. యాప్‌లకు మీరు అనవసరమైన అనుమతులు ఇవ్వడం వల్ల మీ వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది.
-అనిల్ రాచమల్ల
ఎండ్‌నౌ ఫౌండేషన్ వ్యవస్థాపకులు