కంటినిండా నిద్రపోయినప్పుడే.. పిల్లల మెదడు అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే.. నిద్రలో ఉన్నప్పుడే మెదడుకు కావాల్సినంత విశ్రాంతి దొరుకుతుంది. అప్పుడే, అది కొత్త సమాచారాన్ని ప్రాసెస్ చేసి.. జ్ఞాపకాలను పటిష్టం చేసుకుంటుంది. అభ్యాస మార్గాలను బలోపేతం చేస్తుంది. భావోద్వేగాలను క్రమబద్ధీకరిస్తుంది. అయితే, నేటితరం పిల్లల్ని నిద్రలేమి పట్టిపీడిస్తున్నది. తల్లిదండ్రులు చేసే చిన్నచిన్న తప్పులే.. ఇందుకు కారణంగా కనిపిస్తున్నది. ఆ తప్పులను సరిచేసుకుంటే.. పిల్లల బ్రెయిన్ మరింత పవర్‌ఫుల్‌గా తయారవుతుంది.
స్క్రీన్కు దూరం: పడుకోవడానికి కనీసం గంట ముందునుంచైనా పిల్లల్ని ‘బ్లూ స్క్రీన్’కు దూరంగా ఉండాలి. టీవీ, స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్ లాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌ను పక్కన పెట్టేయాలి. బ్లూలైట్ పిల్లలను ఎక్కువసేపు మేల్కొని ఉండేలా చేస్తుంది. వారి జ్ఞాపకశక్తి, అభ్యాసానికి కీలకమైన రాపిడ్ ఐ మూమెంట్ (కలలు కంటున్నప్పుడు కనురెప్పల వెనక కళ్ల కదలిక)కు అంతరాయం కలిగిస్తుంది.
స్థిరమైన నిద్రవేళలు: కొన్ని కుటుంబాల్లో.. తల్లిదండ్రులతోపాటు పిల్లలు కూడా వారాంతాల్లో రాత్రంతా మేల్కొనే ఉంటారు. శని, ఆదివారాలు స్కూల్ ఉండదని.. ఆలస్యంగా నిద్రలోకి జారుకుంటారు. దీనివల్ల పిల్లల్లో జీవగడియారం దెబ్బతింటుంది. క్రమంగా వారిలో ఒత్తిడి, కుంగుబాటు లాంటి సమస్యలు పెరుగుతాయి. మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
ఆలస్యం.. విషం: చాలా ఇళ్లల్లో రాత్రి భోజనం ఆలస్యమవుతుంది. ఇక సాయంత్రం పార్కుల్లో ఆటలు, అధిక శ్రమతో కూడిన పనులు కూడా మెదడును అతిగా ప్రేరేపిస్తాయి. ఇవన్నీ పిల్లల్ని నిద్రకు దూరం చేసేవే! అలాకాకుండా ఉండాలంటే.. నిద్రపోవడానికి ముందు శరీరానికి అలసట రాకుండా చూసుకోవాలి. కఠినమైన పనులకు బదులుగా.. చదవడం, రాయడం వంటి తేలికైన నిత్యకృత్యాలతో విశ్రాంతి తీసుకోవాలి. దీనివల్ల పిల్లలు సజావుగా నిద్రలోకి జారుకునే అవకాశం ఉంటుంది.
నాణ్యతే ముఖ్యం: కొందరు తల్లిదండ్రులు పిల్లలు ఎంతసేపు నిద్రపోయారు? అనేదే చూస్తారు. నిద్ర నాణ్యతను అంతగా పట్టించుకోరు. కానీ, నాణ్యమైన నిద్ర ఉన్నప్పుడే మెదడు చురుగ్గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సిఫారసు చేసిన సమయం కంటే తక్కువ నిద్రపోయే పిల్లల్లో.. శ్రద్ధాసక్తులు తగ్గడం, జ్ఞాపకశక్తి లోపించడం, మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని గుర్తించారు.