సోషల్ మీడియా వాడకం పెరిగేకొద్దీ నకిలీ అకౌంట్ల బెడద కూడా పెరుగుతున్నది. ముఖ్యంగా రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, కంపెనీల అధినేతల పేర్లతో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి ఫ్రాడ్స్టర్లు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. సెలెబ్రిటీల ఇమేజ్ను అడ్డం పెట్టుకొని నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నారు. వీటిని నిజమని నమ్మేలా చేసి ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. సాంకేతికత పెరగడంతో డీప్‌ఫేక్ టెక్నాలజీ ద్వారా ఫేక్ వాయిస్, వీడియోలు కూడా క్రియేట్ చేస్తున్నారు. ఈ నకిలీగాళ్ల వలకు చిక్కకుండా ఉండాలంటే.. సైబర్ సెక్యూరిటీపై కనీస అవగాహన చాలా అవసరం.
ఇంతకు ముందు సోషల్ మీడియాలో మోసాలంటే ఫేక్ అకౌంట్లు సృష్టించి.. వాటిని ప్రమోట్ చేయడం మాత్రమే అనుకున్నాం! కానీ, ఇప్పుడు డీప్‌ఫేక్ టెక్నాలజీ వల్ల నేరస్తులు మరింత స్మార్ట్‌గా మోసాలకు పాల్పడుతున్నారు. రాజకీయ నాయకుల డీప్‌ఫేక్ వీడియోలు విడుదల చేస్తున్నారు. ఈ వీడియోలు ఎన్నికల ఫలితాలపై ప్రభావితం చూపేంతగా వైరల్ అవుతున్నాయి. ప్రముఖ కంపెనీల అధినేతల వాయిస్ క్లోనింగ్ చేసి ఉద్యోగులను మోసం చేయడం లాంటి ఘటనలు ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్నాయి. కంపెనీ సీఈవో చెప్పాడనుకొని అమెరికాలోని ఓ కార్పొరేట్ సంస్థ ఉద్యోగి రూ.50 కోట్లు హ్యాకర్ అకౌంట్లో జమ చేసిన ఘటన ఇటీవల వెలుగుచూసింది. అంతేకాదు.. యూరప్‌లో ఒక ప్రముఖ నాయకుడి డీప్‌ఫేక్ వీడియోలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు కూడా జరిగాయి.
ప్రస్తుతం ఎక్కువగా నమోదవుతున్న మోసాల్లో బ్యాంకులు, కంపెనీల పేరుతో జరుగుతున్నవే మొదటిస్థానంలో ఉన్నాయి. వాట్సాప్, టెలిగ్రామ్‌లో ఫేక్ బిజినెస్ గ్రూపులను క్రియేట్ చేసి, బ్యాంకు ఉద్యోగుల్లా నటిస్తూ ఖాతాదారుల నుంచి డబ్బు వసూలుచేయడం ఎక్కువైంది. ‘మీ అకౌంట్ బ్లాక్ అవుతుంది, వెంటనే ఈ లింక్ క్లిక్ చేయండి’ అని భయపెడతారు సైబర్ మోసగాళ్లు. అది నిజమని లింక్ క్లిక్ చేశామో.. అకౌంట్ ఖాళీ కావడం ఖాయం! ఇక సోషల్ మీడియాలో నకిలీ ఖాతాదారులు కూడా వెరిఫైడ్ బ్యాడ్జ్ (బ్లూ టిక్) పొంది అఫీషియల్ అకౌంట్లుగా ఏమార్చుతున్నారు. మరోవైపు నకిలీ ప్రొఫైల్స్‌తో యువతీ యువకులను ప్రేమలో పడేసే బాపతు మరోరకం. యువతను హనీ ట్రాప్ చేసి వారి వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు సేకరించి.. బ్లాక్మెయిల్ చేస్తున్న సంఘటనలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. డీప్‌ఫేక్ టెక్నాలజీతో నగ్న చిత్రాలను సృష్టించి పరువు మంటగలుపుతున్నారు.
ప్రొఫైల్ లింక్ : ఫేక్ అకౌంట్స్‌లో పేర్లు అసలు పేరుకు దగ్గరగా ఉన్నా, గమనిస్తే తేడా స్పష్టంగా కనిపిస్తుంది (ఉదాహరణ: ‘official_brand’ ప్లేస్‌లో ‘officialbrand_’).
ఎంగేజ్మెంట్స్ : ఫాలోవర్లు ఎక్కువగా ఉన్నా లైక్స్, కామెంట్లు తక్కువ ఉంటే అనుమానించాలి.
అకౌంట్ క్రియేషన్ డేట్ : ఒక ప్రముఖుడి పేరు మీద అకస్మాత్తుగా క్రియేట్ అయిన ఖాతా ఫేక్ అయ్యుండే అవకాశం ఉంది.
డబ్బు డిమాండ్ చేస్తే.. : పెద్ద వ్యక్తులు, సెలెబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా డబ్బు అడగరు.
లోపాలు : జాగ్రత్తగా గమనిస్తే డీప్‌ఫేక్ వీడియోలు గుర్తించొచ్చు. లిప్ సింక్, షాడోస్ గమనిస్తే లోపాలు పట్టేయొచ్చు.
అలాగే ఫ్యాక్ట్ చెక్ సేవలనూ వాడుకోవచ్చు. వాటిలో InVIDTools టూల్స్ ఒకటి. https://www.invid-project.eu/tools-and-services/ లింక్‌ని చూడండి. భద్రతా చర్యలు తీసుకుని, సందేహాస్పద అకౌంటును రిపోర్ట్ చేయడం ద్వారా మనమే మన భద్రతను పెంచుకోవచ్చు. ఫేక్ అకౌంట్ అన్న అనుమానం వస్తే.. వారితో ఏ విషయాలూ షేర్ చేసుకోవద్దు. ఎవరైనా వేరే వ్యక్తుల పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేస్తే IT చట్టం, సెక్షన్ 66D ప్రకారం 3 ఏళ్ల జైలుశిక్ష పడే ప్రమాదం ఉంది. అంతేకాదు లక్ష రూపాయల జరిమానా చెల్లించాల్సి వస్తుంది. ఇతరుల డేటా అక్రమంగా వాడినట్టు రుజువైతే.. సెక్షన్ 66C (Identity Theft) ప్రకారం వారికి మూడేళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధిస్తారు.