కన్ను కానని, ఊహకు అందని ఆకాశంలో ఏముందో తెలుసుకోవాలనే జిజ్ఞాస ఏనాటిదో? లెక్కలేనన్ని వింతలున్న అద్భుతం… ఆకాశం! టెలిస్కోపులు, రాకెట్లు, రోవర్లు అంతరిక్షాన్ని మానవుని కళ్లకు కడుతున్నాయి. రాస్‌కాస్మోస్, నాసా, ఇస్రో అంతరిక్ష యాత్రలతో అనంత విశ్వాన్ని ఆవిష్కరించాయి. అంతరిక్షాన్ని తెలుసుకోవాలన్న మానవుడి ఆలోచన ఈనాటిది కాదు. ఆదిమకాలం నుంచీ ఉన్నదే! అంబరాన్ని అర్థం చేసుకోవాలని ఆదిమానవులు ఎన్ని పరిశోధనలు చేశారో! దిక్కుల్ని కనిపెట్టి, కాలాన్ని గణించిన రాతియుగం నాటి ఖగోళ పరిశోధనలు, ఆవిష్కరణలు తెలుసుకోవాలంటే ‘ఆదిమానవుల అంతరిక్ష పరిశోధన కేంద్రం’ చూసి రావాల్సిందే! ఆ అద్భుతం ఎక్కడో లేదు. మన తెలంగాణలోనే ఉంది!
క్రీ.పూ.3000 సంవత్సరాలకు ముందు కృష్ణానది సముద్రంలో కలవడానికి మరో 870 మైళ్ల దూరం ఉన్న ప్రాంతం. ఆ నదిని ఆసరా చేసుకుని ఆదిమానవులు పోడు వ్యవసాయం మొదలుపెట్టారు. పంట సాగులో విత్తనాలు ఎద పెట్టడానికి అనువైన కాలం తెలుసుకునేందుకు సూర్యుడి గమనంపై దృష్టి సారించారు. ఆకాశానికి నిలువురాళ్లను ఎక్కుపెట్టారు. నీడల జాడలతో సూర్యగమనాన్ని ఒడిసిపట్టి ఉత్తరాయణ, దక్షిణాయన కాలాల్ని లెక్కగట్టారు. రోజులో పగటి, రాత్రి ప్రమాణాలను తెలుసుకుని ప్రయాణాలు మొదలుపెట్టారు. వేట ముగిశాక తిరిగి ఆవాసాలకు చేరుకుంటున్న సందర్భంలో వాళ్లు ప్రయాణించే దారికీ, నక్షత్రాలకూ ఏదో సంబంధం ఉందని గుర్తించారు. తర్వాతి తరాలు దారితప్పకుండా ఉండేందుకు ఆ దిక్కులే దిక్కని చెప్పేందుకు రాళ్లపై నక్షత్ర మండలాల్ని చిత్రించారు.
నారాయణపేట జిల్లాలో మహబూబ్‌నగర్ నుంచి రాయచూరు (కర్నాటక) వెళ్లే రహదారికి సమీపంలో ముడుమాల్ గ్రామం ఉంది. ఈ ఊరిలో కృష్ణానదికి దగ్గర్లో (కిలోమీటరు దూరంలో) ఆదిమానవుల ఖగోళ పరిశోధనల ఆనవాళ్లు, వాళ్లు నిలిపిన నిలువురాళ్లు, నిర్మించిన సమాధులు ఉన్నాయి.
రోజులు… సంవత్సరాలు.. శతాబ్దాలు.. యుగాలు గడిచిపోయాయి. కానీ, అంతరిక్షాన్ని శోధించిన ఆదిమానవుడు రాళ్లపై చిత్రించిన ఖగోళ విన్యాసాలు మాత్రం చెరిగిపోలేదు. ఆ రాతి ఆనవాళ్లు 1942లో భూభౌతిక పరిశోధకుడు కృష్ణమూర్తి కంటపడ్డాయి. హైదరాబాద్ దక్కన్‌లోని ముడుమాల్, మురహరిదొడ్డి గ్రామాల సమీపంలో ఆదిమానవుల సమాధులు, నిలువురాళ్లు ఉన్నట్టుగా ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ దక్కన్ జియాలజీ డిపార్ట్మెంట్ తరఫున జరిగిన సర్వేలో మొట్టమొదటిసారిగా వీటిని గుర్తించారు. ఈ ప్రాంతానికి దగ్గర్లో ఉన్న గోపాల్‌పూర్‌లో కూడాప్రాచీన మానవుడి ఆనవాళ్లు ఉన్నాయని తన సర్వే నివేదికలో ప్రస్తావించారు. ఆయన పురావస్తు శాస్త్రవేత్త కాకపోవడం వల్ల దీని గురించిన విశేషాలేవీ నిజాం కాలంలో బయటికి రాలేదు.
సుప్రసిద్ధ పురావస్తు పరిశోధకుడు ఎఫ్.ఆర్.ఆల్చిన్ 1956లో మురహరిదొడ్డి, గుడెబల్లూరు గ్రామాలకు సమీపంలోని నిలువురాళ్లు, సిస్టులు (రాతి సమాధులు) పరిశీలించాడు. ఇక్కడ ఆరు వరుసల్లో నిలువురాళ్లు ఉన్నాయని, ప్రతి వరుసలో ఆరు చొప్పున ఉన్నాయని తన నివేదికలో తెలిపాడు. ఆయన లెక్క ప్రకారం ముడుమాల్‌లో 36 నిలువురాళ్లు ఉండాలి. కానీ, అంతకంటే ఎక్కువగా మొత్తం 80 దాకా పురావస్తు పరిశోధకులు గుర్తించారు. 1956లో ఆల్చిన్ నివేదిక తర్వాత ముడుమాల్ నిలువురాళ్ల పరిశోధనల్లో పురోగతి లేదు.
ముడుమాల్ గ్రామం, కృష్ణానది సమీపంలో సుమారు 80 ఎకరాల విస్తీర్ణంలో ఆదిమానవుల ఆనవాళ్లు ఉన్నాయి. ఇవి బృహత్శిలా (మెగాలిథిక్) యుగానికి సంబంధించినవి. వీటిలో స్టోన్ సర్కిల్స్ (రాతి సమాధులు) ఉన్నాయి. పెద్ద పెద్ద బండలను వలయాకారంలో అమర్చి, వాటి మధ్య చనిపోయినవాళ్లను సమాధి చేసేవాళ్లు. ఈ సమాధులతోపాటు అనేక రకాల వరుసల్లో, చెల్లా చెదురుగా బంతిరాళ్లు (పెద్ద పరిమాణంలోని బండలు) ఉన్నాయి.
బంతిరాళ్ల మధ్య అనేక ఏళ్లుగా స్థానికులు వ్యవసాయం చేసుకుంటున్నారు. నేలను చదునుచేసే సందర్భంలో బంతిరాళ్లను అటూ ఇటూ జరపడం వల్ల ఆదిమానవులు వాటిని ఏ ఆకారంలో అమర్చారు? ఎందుకు ఉపయోగించారో నేడు తెలుసుకోలేకపోతున్నారు. ఎనభై ఎకరాల విస్తీర్ణంలోని ఈ ప్రదేశం ప్రస్తుతం 20 ఎకరాలకు పరిమితమైంది. ఇందులో పదిహేను వందల బంతిరాళ్లు ఉన్నాయి. ఒకప్పుడు రెండు వేలకుపైగా ఉండేవని పరిశోధకుల అంచనా. ఈ బంతిరాళ్లు ఉన్న ఇరవై ఎకరాల ప్రదేశంలోనే అయిదు ఎకరాల విస్తీర్ణంలో నిలువు రాళ్లు ఉన్నాయి.
ముడుమాల్‌లో 83 నిలువు రాళ్లు ఉన్నాయి. వీటి పొడవు పది నుంచి పదిహేను అడుగుల వరకు ఉంది. చుట్టుకొలత రెండు నుంచి నాలుగు అడుగులు. కృష్ణా నదికి వరదలు పోటెత్తినపుడు నీళ్లు ఇక్కడిదాకా వస్తాయి. నేల వాలుగా ఉండటం వల్ల వానలు కురిసినప్పుడల్లా ఈ ప్రాంతం కోతకు గురవుతున్నది. వ్యవసాయ పనులు, ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇక్కడి నేల ఒక అడుగు మేర కోతకు గురైంది. అందువల్ల చాలా నిలువురాళ్లు పడిపోయాయి. ఇప్పటికీ నిటారుగా ఉన్న నిలువురాళ్లు కేవలం రెండు నుంచి రెండున్నర అడుగుల లోతులోనే ఉన్నాయి. నిలువు రాళ్లలో సహజంగా ఏర్పడినవే ఎక్కువ. కొద్దిగా పగులగొట్టి, అరగదీసినవి అక్కడక్కడా కనిపిస్తాయి. ఉలితో చెక్కిన గుర్తులేవీ వీటిపై లేకపోవడం గమనార్హం. మనదేశంలో కేరళ, ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా, మధ్యప్రదేశ్, అసోం, అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్ రాష్ర్టాల్లో నిలువురాళ్లు (మెన్హిర్స్) ఉన్నాయి. భారతదేశంలోని నిలువురాళ్ల ప్రదేశాల్లో ముడుమాల్ అతిపెద్దది.
ఈ నిలువు రాళ్లలో కొన్ని తూర్పు నుంచి పడమర దిక్కులో వరుసగా నిలిపారు. మరికొన్ని చిందరవందరగా కనిపిస్తాయి. ఈ నిలువు రాళ్ల వరుసకు సూర్యమానానికి ఉన్న సంబంధాన్ని ప్రొఫెసర్ కేపీ రావు కొన్ని సంవత్సరాలపాటు పరిశీలించారు. డిసెంబర్ 21న ఒక వరుసలో ఉన్న నిలువరాళ్ల వెనుక నుంచి సూర్యుడు ఉదయించడాన్ని ఆయన గమనించారు. డిసెంబరు 21 దక్షిణాయణంలో పగలు తక్కువ సమయం, రాత్రి ఎక్కువ సమయం ఉంటుంది. ఆ రోజున దక్షిణాయనం ముగిసిపోయి ఉత్తరాయణం ఆరంభమవుతుంది. ఇలాగే జూన్ 21న మరో నిలువు రాళ్ల వరుస వెనుక నుంచి సూర్యాస్తమయం జరగడాన్ని కేపీ రావు బృందం గుర్తించింది. ఇది ఉత్తరాయణంలో పగలు ఎక్కువ సమయం, రాత్రి తక్కువ సమయం ఉండే రోజు. ఈ రోజున ఉత్తరాయణం ముగిసిపోయి, దక్షిణాయనం మొదలవుతుంది.
పంటల సాగుకు సిద్ధమయ్యేందుకు ఆది మానవుడు సూర్యుడి గమనాన్ని అర్థం చేసుకునే ప్రయోగాలు మొదలుపెట్టాడు. ఉత్తరాయణ, దక్షిణాయన కాలాల్ని గుర్తించడమే కాకుండా, వీటి ఆరంభం, ముగింపులకు కచ్చితమైన రోజుల్ని గుర్తించే నైపుణ్యాన్ని నిలువురాళ్ల ద్వారా సాధించాడు. వానల అంచనాతోపాటు సాగుకు అనువైన కాలం, ప్రయాణానికి అనుకూలమైన రోజుల్ని ఎంచుకునేందుకు నిలువురాళ్లను ఆదిమానవులు నిత్యం పరిశీలిస్తూ ఉండేవారని అర్థం చేసుకోవచ్చు. మూడువేల సంవత్సరాలకు పూర్వం నాటి మానవులు కాలాన్ని ఇంత కచ్చితంగా గుర్తించడం ఖగోళ విజ్ఞాన పరిశోధనలో వాళ్లు సాధించిన అద్భుత విజయం. కాలాన్ని గెలిచి సజీవంగా మిగిలిన ఈ నిలువు రాళ్లు ఆ విజయానికి సాక్ష్యాలు!
నిలువు రాళ్లకు సమీపంలోనే ఉత్తరార్ధ గోళంలోని నక్షత్ర మండలాన్ని చిత్రించిన రాయి ఉంది. ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో ఆదిమానవులు రాయిపై నక్షత్ర రాశులను చిత్రించిన ఆనవాళ్లను (స్టార్ డిపిక్షన్) గుర్తించారు. ఆకాశంలోని నక్షత్రాన్ని చూస్తూ.. రాయిపై ఇసుకపోసి కర్రను తిప్పుతూ గుంట (కప్ మార్క్) ఏర్పరుస్తారు. ఆ గుంట ఒక నక్షత్రాన్ని సూచిస్తుంది. దానికి మరో నక్షత్రం ఎంత దూరంలో ఉందో? ఏ దిక్కుగా ఉందో అదే దిక్కు, అంతే దూరాన్ని సూచిస్తూ మరో కప్ మార్క్ (రాయిని అరగదీసిన గుంట) ఏర్పరుస్తాడు. ఇలాంటి కప్మార్క్స్ని ఇంగ్లండ్, జపాన్, గల్ఫ్ దేశాలు, చైనా, కొరియా, ఆఫ్రికా దేశాల్లో గుర్తించారు.
ముడుమాల్‌లోని కప్ మార్క్స్ ఉత్తర ధ్రువ నక్షత్రాలను సూచిస్తున్నాయి. ఉత్తర ధ్రువంలోని ఉర్సా మేజర్ (సప్తర్షి మండలం) ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది. ఉర్సా-మేజర్‌లో దుబే, మిరాక్, ;పెక్డా, మెగ్రెజ్, అల్కైవ్, అలియోత్ నక్షత్రాలుంటాయి. రాత్రివేళ ఆకాశాన్ని చూస్తుంటే.. నక్షత్రాలు కదులుతూ కనిపిస్తాయి. ఉర్సా-మేజర్ (సింహరాశి)లో ఉత్తర ధ్రువానికి దగ్గరగా ఉండే దుబే, మిరాక్ నక్షత్రాలు స్థిరంగా ఉంటాయి. సింహరాశిలోని ఈ దుబే-మిరాక్లను కలిపే ఊహా రేఖ ఎల్లప్పుడూ ఉత్తర దిక్కునే సూచిస్తుంది.
పురావస్తు పరిశోధకులు గుర్తించిన అనేక ఆదిమకాలపు స్టార్ డిపిక్షన్స్ (నక్షత్ర మండలాల చిత్రీకరణ)లో ఉర్సా-మేజర్ని కలిపే ఊహారేఖ ఉత్తర దిక్కుని కచ్చితత్వంతో సూచించట్లేదు. ఒక్క ముడుమాల్‌లోనే నక్షత్ర చిత్రీకరణలోనే ఉర్సా-మేజర్ని కలిపే ఊహారేఖ ఉత్తర ధ్రువాన్ని (ఉత్తర దిక్కుని) సూచిస్తున్నాయి. నక్షత్ర చిత్రీకరణ వేసిన రాయిని పాతి పెట్టడంలోనూ ఆదిమానవులు సృజనాత్మకంగా ఆలోచించారు.
ఆ చిత్రీకరణలోని ఉర్సా-మేజర్ కప్మార్క్స్ ఉత్తర ధ్రువ నక్షత్రం ఒకే వరుసలో ఉండేలా పాతిపెట్టారు. ఇలా చేయడం వల్ల వాళ్లు ఆ ప్రదేశంలో దిక్కులను తెలుసుకోవడానికి, కొలతలు తీసుకోవడానికి ఆ రాయిని ఆధారం చేసుకున్నారని అర్థమవుతున్నది. నేటి సాంకేతిక వ్యవస్థలు అందుబాటులోకి రాకపూర్వం వరకు ఉర్సా-మేజర్ ఆధారంగానే సముద్రాల్లో, ఎడారుల్లో ప్రయాణించేవాళ్లు. ‘సప్తర్షి మండలాన్ని కచ్చితంగా చిత్రించిన మొట్టమొదటి ఖగోళ పరిశోధక ఆధారంగా ముడుమాల్ నక్షత్ర చిత్రీకరణకు గుర్తింపు దక్కుతుంది. దానికోసం ప్రయోగాలు, ప్రయాణాలు చేస్తున్నాం’ అని ప్రొఫెసర్ కేపీ రావు అంటున్నారు. సమీపంలోని బంతిరాళ్లలో కూడా ఓ రాయిపై సింహరాశిని సూచిస్తూ వేసిన కప్ మార్క్స్ ఉన్నాయి.
ముడుమాల్ ఖగోళ పరిశోధన ఆనవాళ్లు, రాతి సమాధులు పాతిక సంవత్సరాల క్రితం ఎనభై ఎకరాల విస్తీర్ణంలో ఉండేవి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించే నాటికి అది ఇరవై ఎకరాలకు తరిగిపోయింది. కృష్ణానదిపై లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పైప్‌లైన్ దీని గుండానే పోయింది. సాగునీరు రావడంతో రైతులు సాగు విస్తీర్ణం పెంచారు. డోజర్ రావడంతో రాళ్లను తేలికగా పెకిలించి పక్కకు జరిపారు. ఎన్నో ఏళ్లుగా దేవుళ్లని భావించి, ఆ రాళ్లని జరిపితే రక్తం కక్కి చస్తారనే భయం ఈ తరాన్ని ఆపలేకపోయింది. కుంచించుకుపోతున్న ఈ ఆదిమానవ ఆనవాళ్లను కాపాడుకోవాలని చరిత్రకారులు, తెలంగాణ ఉద్యమకారుల విన్నపాన్ని కేసీఆర్ ప్రభుత్వం గుర్తించింది. నిలువురాళ్లను కాపాడేందుకు తెలంగాణ హెరిటేజ్ డిపార్ట్మెంట్ నడుంకట్టింది. నిలువురాళ్లు అయిదు ఎకరాల విస్తీర్ణంలో ఉంటే, అందులో రెండు ఎకరాలు మాత్రమే ప్రభుత్వ భూమి. మిగతా మూడు ఎకరాలను రైతుల నుంచి తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేసింది. నిలువు రాళ్ల చుట్టూ ఫెన్సింగ్ వేయించి పరిరక్షిస్తున్నది.
తెలంగాణ హెరిటేజ్ డిపార్ట్మెంట్తో ఈ బృహత్ శిలాయుగపు ఆనవాళ్లకు పరిరక్షణ, పరిశోధన, ప్రాచుర్యం కల్పించేందుకు దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ (డీహెచ్ఏటీ) ఒప్పందం చేసుకుంది. ప్రభుత్వంతో అవగాహన తర్వాత నిలువురాళ్లు, సమాధులు, ఖగోళ సంబంధమైన చిహ్నాలను కాపాడేందుకు పూనుకొంది. సుదీర్ఘ కాలంగా ఈ నిలువురాళ్ల గుట్టు విప్పేందుకు పరిశోధనలు చేస్తున్న కేపీ రావుతో కలిసి డీహెచ్ఏటీ ఆధ్వర్యంలో ముడుమాల్ పరిరక్షిత ప్రదేశాన్ని ఫొటోగ్రామెట్రిక్ సర్వే డ్రోన్‌తో డాక్యుమెంట్ చేశారు. బృహత్ శిలాయుగపు ఆనవాళ్లు ఉన్న ఎనభై ఎకరాలతోపాటు చుట్టూ 500 ఎకరాల్లోని పరిసరాలు, పర్యావరణం, కృష్ణానదిని ఈ సర్వేలో డాక్యుమెంట్ చేశారు. ఇరవై ఎకరాలలో ఉన్న ప్రతి బంతిరాయికీ, నిలువురాయికీ నంబర్ కేటాయించారు. ఈ సంఖ్య ఆధారంగా ప్రతి రాయినీ అన్ని కోణాల్లో ఫొటోలు తీయించారు. రెండున్నర సెంటీమీటర్ల పరిమాణంలో ఉండే వస్తువు కూడా స్పష్టంగా కనిపించేలా హై రెజల్యూషన్ ఉన్న కెమెరాలు ఉపయోగించి డ్రోన్ సర్వే చేయించారు. డ్రోన్ సర్వే, స్టోన్ నంబర్ల ఆధారంగా నక్షా రూపొందించారు. ఎవరైనా ఒక రాయిని జరిపినా ఇకముందు ఏ ప్రమాదం లేదు. ఆధార్ కార్డ్ మనిషి పుట్టుపూర్వోత్తరాలు పట్టిచ్చినట్టు రాయిని పూర్వం ఉన్న ప్రదేశంలో, అదే దిక్కుల్లో పెట్టేందుకు ఈ డిజిటలైజేషన్, స్టోన్ నంబర్ ఉపయోగపడతాయి.
చెట్ల తొర్రల్లో, రాతి గుహల్లో నివసించిన మూడువేల సంవత్సరాల నాటి ఆ మానవులు లేరు. కానీ, వాళ్లు విడిచిపోయిన ఆనవాళ్లున్నాయి. ఆ ఆనవాళ్లపై వాళ్లు సాగించిన ఖగోళ పరిశోధనల గుర్తులున్నాయి. మానవ చరిత్రలో గ్రహాన్ని గుర్తించిన మొట్టమొదటి చారిత్రక ఆధారం వాళ్లు విడిచివెళ్లారు. ప్రపంచంలో నక్షత్ర మండలాన్ని మొట్టమొదటిసారి కచ్చితంగా నమోదు చేసి, ఘనమైన వారసత్వాన్ని మనకు వదిలి వెళ్లారు. వాతావరణ మార్పులకు, ప్రకృతి విపత్తులకు తట్టుకుని యుగయుగాలుగా వర్ధిల్లిన ఈ వారసత్వ సంపదను కాపాడుకునేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి.
అడవిగాచిన వెన్నెలలా శతాబ్దాల నిర్లక్ష్యంతో ధ్వంసమైన ఈ ప్రాచీన మానవుల ఆనవాళ్ల సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం పూనుకొన్నది. ఆధునిక మానవుడి నుంచి ముప్పు జరగకుండా కాపాడుకునే ప్రయత్నమే కాదు, ఈ పురా పరిశోధనలకు ప్రపంచ వారసత్వంగా పట్టంకట్టే ప్రయత్నాలూ మొదలయ్యాయి. దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ సంకల్పం, తెలంగాణ ప్రభుత్వ కృషితో ముడుమాల్ నిలువురాళ్లు ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందడానికి అడుగు దూరంలో నిలిచాయి. కాంతి సంవత్సరాల దూరంలోని నక్షత్రాల విన్యాసాన్ని, గ్రహగతులను ఆదిమానవుడు గుర్తించినా, ఆ ప్రతిభను ఆ ఆనవాళ్లకు సమీపంలో ఉన్న ఆధునిక మానవులు గుర్తించకపోవడం మరో విచిత్రం. ఇప్పటికైనా పోదాం పదండి ముడుమాల్‌కు. మన పూర్వికుల అడుగులో అడుగేసి, వాళ్ల ఊహలు చిత్రించిన అంతరిక్షాన్ని చూసొద్దాం!
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో హిస్టరీ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న ప్రొఫెసర్ కేపీ రావు ఇరవై సంవత్సరాల క్రితం.. ముడుమాల్ ఆదిమానవుని జాడలు, ఆ ప్రాంతంలోని ప్రాచీన ఖగోళ విజ్ఞాన ఆనవాళ్ల గురించి పరిశోధన మొదలుపెట్టారు. అరిజోనా యూనివర్సిటీలో 2003లో జరిగిన ‘ఆక్స్ఫర్డ్ పురావస్తు ఖగోళ సదస్సు’లో ముడుమాల్ ఖగోళ విశేషాలను వివరించారు. ఈ సదస్సు ద్వారా ప్రపంచానికి అత్యంత ప్రాచీనమైన ఖగోళ పరిశోధనకు నిలయమైన ముడుమాల్ గురించి అందరూ ఆలోచించేలా చేయగలిగారు. అప్పటినుంచి చరిత్ర పరిశోధకులు, ఖగోళశాస్త్రం పట్ల అవగాహన ఉన్నవాళ్లే కాకుండా తెలంగాణ ప్రాంత వారసత్వాన్ని కాపాడుకుందామని భావించేవాళ్లూ ముడుమాల్ నిలువురాళ్లని సందర్శిస్తున్నారు. అక్కడి వింతలను కళ్లింత చేసి ఆస్వాదిస్తున్నారు.
నక్షత్ర మండలాన్ని టెలిస్కోప్‌తో చూస్తే కంటికి కనిపించని నక్షత్రాలు కూడా కనిపిస్తాయి. ఆదిమానవులు కంటికి కనిపించే నక్షత్రాలనే చిత్రీకరిస్తారు. కాబట్టి సప్తర్షి మండలంలోని అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రాలను గుర్తించి, వాటితో ముడుమాల్ నక్షత్ర చిత్రీకరణతో పోల్చితే… చుట్టూ ఉన్న నక్షత్రాలే కాదు ఉర్సా మేజర్ (సప్తర్షి మండలం) కూడా సరిపోలుతుంది. అయితే.. ఈ నక్షత్ర మండలం చిత్రీకరణలో ఒక నక్షత్రం అదనంగా ఉంది. లేని నక్షత్రం ఎక్కడినుంచి ఊడిపడిందో తెలుసుకునే ప్రయత్నాలూ జరిగాయి. నక్షత్రాల చలనం ఆధారంగా ఏ కాలంలో ఏ నక్షత్రం ఎక్కడ ఉంటుందో చూపే సాఫ్ట్వేర్లను ఉపయోగించారు.
అప్పుడు తేలిందేమంటే?! ముడుమాల్ నక్షత్ర చిత్రీకరణలో కనిపిస్తున్న నక్షత్రం పొరపాటుగా వచ్చింది కాదు. గ్రహపాటుగా వచ్చిందని తేల్చారు! కొన్ని వందల సంవత్సరాలకు ఒకసారి అంగారక గ్రహం (మార్స్) దుబే, మిరాక్కు సమీపంగా వెళ్తుందని, ఇది అంగారక గ్రహమేనని గుర్తించారు. ఇంకో విశేషం ఏమిటంటే?.. ఈ అంగారక గ్రహం ఆధారంగా క్రీ.పూ.1100 సంవత్సరాల నాడు (సుమారుగా) ఓ రోజు రాత్రి పది గంటల ముప్పై నిమిషాల సమయంలో అంగారకుడు ముడుమాల్ నక్షత్ర చిత్రీకరణలో ఉన్న చోటనే ఉన్నాడని తేల్చారు. అందుకే ఈ నక్షత్ర మండలంలోకి అదనంగా మరో గుర్తు వచ్చి చేరింది. ఇప్పటివరకు గుర్తించిన ప్లానెట్ డిఫిక్షన్స్లో ముడుమాల్ కంటే ముందు కాలంలోవి గుర్తించలేదు. కాబట్టి ప్రపంచంలో మొట్టమొదటి ప్లానెట్ డిపిక్షన్ (గ్రహ చిత్రీకరణ)గా ముడుమాల్ నక్షత్ర చిత్రీకరణకు గౌరవం దక్కబోతున్నది.
ముడుమాల్ నిలువురాళ్ల గురించి స్థానికంగా ఓ ఆసక్తికరమైన కథ ప్రాచుర్యంలో ఉంది. చాలా ఏళ్ల క్రితం అక్కడి ప్రజలు వ్యవసాయమే జీవనాధారంగా బతికేవారు. వాళ్లకు ఆవులు, బర్రెలు, గొర్రెలు, మేకలు కూడా ఉండేవి. వ్యవసాయ పనులు ఉన్న రోజుల్లో వాటిని చూసుకునేవాళ్లు ఎవరూ ఉండేవారు కాదు. దీంతో ఆ రైతులు అక్కడ ఉన్న ఎల్లమ్మ తల్లి దగ్గరకు వచ్చి.. ‘చేను పనుల్లో తీరిక లేదు. మా బర్లు, గొర్లను పొద్దుగూకేదాంక నువ్వే చూసుకో. నీకు బుట్టెడు బంగారు నాణేలు ఇస్తాం’ అని మొక్కుకున్నారట. ఎల్లమ్మ ఆ పశువులను చూసుకున్నదట. బుట్టలో ఊక నింపి పైన బంగారు నాణేలు పెట్టి మొక్కు చెల్లించుకున్నారట. ఎల్లమ్మ బుట్టలో చేయి పెట్టగానే ఊక తగిలిందట! కోపోద్రిక్తురాలైన ఎల్లమ్మ తల్లి ‘నన్నే మోసం చేస్తారా! మీరంతా రాళ్లుగా మారిపోండి’ అని శపించిందట. వాళ్లంతా నిలువు రాళ్లుగా మారిపోయారని, పశువులు బండరాళ్లుగా మారిపోయని స్థానికులు విశ్వసిస్తారు. అంతేకాదు ఆ రాళ్లను కదిలిస్తే రక్తం కక్కి చచ్చిపోతారని, ఆ ప్రయత్నం చేసినవాళ్లు కొందరు అలాగే చచ్చిపోయారని నమ్ముతున్నారు. అందుకే వాటికి అపకారం తలపెట్టలేదు. నిలువురాళ్ల దగ్గర ఎల్లమ్మతోపాటు ఓ నిలువురాయిని తిమ్మప్పగా పూజిస్తుంటారు. తిమ్మప్ప సన్నిధిలో పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయిస్తుంటారు. నవ వధూవరులతో ప్రత్యేక పూజలు చేయిస్తుంటారు.
ముడుమాల్‌కు యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు కోసం తెలంగాణ హెరిటేజ్ డిపార్ట్మెంట్ని కోరాం. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ)ని సంప్రదించాం. ఏఎస్ఐ భారతదేశం తరఫున 10 ప్రదేశాలకు వారసత్వ హోదా కావాలని దరఖాస్తు చేసింది. icomas ఈ ప్రదేశాల చారిత్రక, భౌగోళిక, సాంస్కృతిక విశేషాలను అధ్యయనం చేసి వారసత్వ యునెస్కోకి సలహా ఇస్తుంది. icomas ఇండియా యూనిట్లో నేను సభ్యుడిగా చాలాకాలం నుంచి పనిచేస్తున్నాను. ఆ అనుభవంతో ముడుమాల్ సంరక్షణ, పునరుద్ధరణ పనులను యునెస్కో ప్రమాణాలకు అనుగుణంగానే మొదలుపెట్టాం. అందువల్లే యునెస్కో వారసత్వ కట్టడాల టెంటేటివ్ లిస్ట్ (తాత్కాలిక జాబితా)లో ముడుమాల్‌కు చోటు దక్కింది. ముడుమాల్ నిలువురాళ్ల ప్రాంతాన్ని సంరక్షించే ప్రయత్నాలు చేస్తున్నాం. ఏ ఒక్కరాయికీ నష్టం జరగకుండా కాపలా కాస్తున్నాం. మూడేళ్లలో యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల (శాశ్వత) జాబితాలో ముడుమాల్ నిలువరాళ్లకు చోటు దక్కేలా పనిచేస్తాం.
– ఎం. వేదకుమార్, దక్కన్ హెరిటేజ్ అకాడమీ
వ్యవస్థాపక చైర్మన్
– నాగవర్ధన్ రాయల