Ritu Varma | టాలీవుడ్లో సక్సెస్ఫుల్ హీరోయిన్గా రాణిస్తున్న తెలుగింటి బిడ్డ.. రితూ వర్మ. సపోర్టింగ్ పాత్రలతో కెరీర్ ప్రారంభించిన ఈ హైదరాబాదీ ముద్దుగుమ్మ.. తెలుగుతోపాటు తమిళంలోనూ సత్తా చాటుతున్నది. ఇటీవల ‘మజాకా’ అంటూ ప్రేక్షకులను పలకరించిన రీతూ వర్మ పంచుకున్న కబుర్లు..
పదకొండేళ్ల వరకు అమ్మ నాకు జుట్టు కట్చేయిస్తూ, ప్యాంటూ షర్టులు వేయిస్తూ టామ్ బాయ్‌గానే పెంచినా… ఆ బెరుకు మాత్రం పోలేదు. అమ్మ స్కూల్లోనే పదో తరగతిదాకా చదువుకున్నా! మల్లారెడ్డి కాలేజీలో బీటెక్‌లో చేరాను. అప్పుడే మోడలింగ్ వైపు వెళ్లాను.
అమ్మానాన్నలది మధ్యప్రదేశ్. నేను పుట్టక ముందే హైదరాబాద్‌లో సెటిలయ్యారు. నాన్న బిజినెస్‌మ్యాన్. చాలా బిజీగా ఉండేవారు. బాల్యంలో అమ్మతోనే ఎక్కువగా ఉండేదాన్ని. చిన్నప్పటి నుంచి సిగ్గు ఎక్కువ. నలుగురిలో కలవడం ఇబ్బందిగా అనిపించేది.
మిస్ హైదరాబాద్ మొదటి రన్నరప్ కిరీటం అందుకున్నప్పుడు నాకు ప్రపంచం అంటే ఏంటో తెలియదు. ఇన్నేళ్లలో ఏదో గొప్పగా నేర్చుకున్నానని చెప్పలేను కానీ, మన లక్ష్యాలను ఎలా చేరుకోవాలో తెలుసుకోగలిగాను. ముఖ్యంగా నా సిగ్గరితనం నుంచి బయటపడగలిగాను. అతిగా ఆలోచించడం మానుకున్నాను.
కథ డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్రలు చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. కానీ ముద్దు సీన్లు ఉన్న సినిమాల్లో నాకు అవకాశాలు రావడం లేదు. ఈ అమ్మాయి ఇలాంటి పాత్రలు చేయదు అని చాలామంది దర్శకులు డిసైడ్ అయిపోయినట్టున్నారు! ఆ కారణంతోనే నా దగ్గరికి అలాంటి కథలు రావడం లేదనుకుంటా.
మోడలింగ్ నుంచి సినీ పరిశ్రమకు రావాలనుకున్నప్పుడు ఇంట్లో అందరూ షాకయ్యారు. ఇండస్ట్రీ ఎలా ఉంటుందో… చుట్టపక్కాలు ఏమనుకుంటారో! ఇలా ఎన్నో ఆక్షేపణలు వచ్చాయి. చివరికి ఒక ప్రయత్నం అయితే చేయమని ఇంట్లోవాళ్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలా తరుణ్‌భాస్కర్ తీసిన షార్ట్‌ఫిల్మ్‌లో నటించాను.
లాక్డౌన్లో పెయింటింగ్‌పై దృష్టిపెట్టాను. పెన్సిల్ స్కెచెస్ బాగా వేస్తాను. నాన్న నుంచి వచ్చిన వారసత్వం అది. అమ్మ ఆ మధ్య హైదరాబాద్‌లో ఓ ఆర్ట్స్కూల్ నిర్వహించిన ఆన్లైన్ క్లాసుల్లో వాటిని ప్రదర్శించింది. ఆర్టిస్టుగా నాలోని ఈ కోణాన్ని సానపడుతుండగానే గౌతమ్ మేనన్ గారి నుంచి పిలుపు వచ్చింది.
నా సినీ ప్రయాణం పట్ల సంతృప్తిగా ఉన్నాను. ఎందుకంటే నేను యాక్టర్ కావాలని కోరుకోలేదు. అలాంటిది ఈ రంగంలోకి వచ్చి.. ఇన్నేళ్లుగా కొనసాగుతున్నాను. నటిగా మంచి సినిమాల్లో భాగమయ్యాను. చిరకాలం గుర్తుంచుకునే పాత్రలు చేయగలిగాను. యాక్షన్ ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేయాలని ఉంది.