అన్నీ అనుకున్నట్టు జరిగితే.. మూడేండ్ల లోపే మనదేశంలో ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీలు అందుబాటులోకి రానున్నాయి. పెద్ద నగరాల్లో ఒకచోటు నుంచి మరోచోటుకు వెళ్లడానికి, సమీప పట్టణాలకు చేరుకునేందుకు ‘ఇంటర్‌గ్లోబ్’ సహా వివిధ సంస్థలు ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ సేవలు ప్రవేశపెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి.
భారతీయ నగరాల్లో రోజూ 10వేలకు పైగా కార్లు రోడ్ల మీదికి వస్తున్నాయి. ఇదే వేగం కొనసాగితే సమీప భవిష్యత్తులో మన రోడ్లు మరింత ఇరుకుగా మారిపోతాయి. భూగర్భం, సముద్ర గర్భంలోంచి రోడ్లు వేసినా రద్దీలో మార్పు రాకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో రెండు నగరాలు, పట్టణాల మధ్య రవాణా విషయంలో ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీలు (ఇ ఎయిర్ ట్యాక్సీ) కీలకపాత్ర పోషించనున్నాయి. నలుగురు, ఐదుగురు ప్రయాణికులను రెండు పట్టణాల మధ్య తిప్పగలిగే చిన్నపాటి ఎయిర్ క్రాఫ్ట్‌లను ‘ఎయిర్ ట్యాక్సీలు’ అంటారు.
అందులోనూ బ్యాటరీతో నడిచేవి ‘ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీలు’. వీటికి పెద్ద విమానాల్లా భారీ రన్‌వేల అవసరం ఉండదు. కొద్ది వసతులతోనే ఇవి ఆకాశంలోకి వెళ్తాయి, అంతే సౌకర్యవంతంగా నేల
మీదికి దిగుతాయి. ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో మాతృసంస్థ అయిన ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్.. ఇవీటోల్ అనే ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్ కోసం ఒప్పందం కుదుర్చుకుంది. ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీలు బ్యాటరీతో పనిచేస్తాయి కాబట్టి, వాయు కాలుష్యం ఉండదు. విమానాలకు వాడే ఇంధనంతో పోలిస్తే
ఎలక్ట్రిక్ బ్యాటరీల వ్యయం తక్కువ. ప్రయాణ ఖర్చు తగ్గుతాయి.
ఇప్పటికైతే మనదేశంలోనే కాదు.. ఎక్కడా ఎయిర్ ట్యాక్సీ వ్యవస్థ లేదు. కాకపోతే కొన్ని దేశాలు త్వరలోనే రంగంలోకి దిగడానికి ఏర్పాట్లు చేస్తున్నాయి. నిజానికి, ఎయిర్ ట్యాక్సీలు మరీ కొత్తవేం కాదు. మనదేశంలో అహ్మదాబాద్ ముంద్రా, డామన్ డయ్యూ మధ్య పరిమిత సంఖ్యలో హెలికాప్టర్ల ద్వారా.. హెలీ ట్యాక్సీల సేవలు నడుస్తున్నాయి. వీటిని తంజావూర్ చెన్నై, మాల్డా కోల్‌కతా, హుబ్బళ్లి బెంగళూరు మార్గాల్లో విస్తరించడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.
హెలీట్యాక్సీ సంస్థలు ఇప్పటికే మూతపడ్డాయి. ఇలాంటి పరిస్థితి తలెత్తకూడదంటే ఎలక్ట్రిక్ ఎయిర్ట్యాక్సీల ప్రయాణ వ్యయం భరించగలిగే స్థాయిలో ఉంచాలి. తక్కువ ఖర్చులో, వెంటవెంటనే నడిచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆర్చర్ ఏవియేషన్ సంస్థ ఇప్పటికే పేర్కొంది. తమ సేవలను మూడేండ్లలో అందుబాటులో తెస్తామని ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ప్రకటించింది.
ఇకపోతే, ఇవీటోల్ పేరుతో ఎయిర్ ట్యాక్సీల కోసం ప్రభుత్వం ఒక విధానాన్ని రూపొందిస్తున్నట్టు గత మార్చిలో నాటి పౌర విమానయాన కార్యదర్శి రాజీవ్ బన్సల్ వెల్లడించారు. 2027 నాటికే, మన దేశంలో ఎయిర్ ట్యాక్సీ ప్రారంభించడానికి అమెరికాకు చెందిన ఎయిరో సంస్థ ఫ్లైబ్లేడ్ ఇండియాతో భారత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది కూడా.
ఎయిర్ ట్యాక్సీ వ్యవస్థ ఇప్పుడు ఉన్న పౌర విమానయాన అవసరాలకు విభిన్నమైంది. రెండిటినీ వేర్వేరుగా చూడాలి. ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీలో 30 నుంచి 33 కిలోమీటర్ల ప్రయాణానికి 100 డాలర్ల వరకు ఖర్చవుతుంది. భారతదేశంలో ఈ ఖర్చును 20 నుంచి 30 డాలర్లకు తీసుకురావాల్సి ఉంటుంది. ఇలా జరగాలంటే ఎయిర్ ట్యాక్సీల తయారీ దేశీయంగానే జరగాలి.
ఇక బ్యాటరీల్లో ఉపయోగించే లిథియం ఉత్పత్తి మనదేశంలో ఇంకా ప్రారంభమే కాలేదు. బ్యాటరీ ధరలు తగ్గాలంటే వాటిని స్థానికంగా తయారు చేసుకుంటేనే సాధ్యం అవుతుంది. టాటాల తరఫున అగ్రటాస్, సుజుకి దన్నుతో టీడీఎస్జీ భారత్‌లో బ్యాటరీల తయారీకి సన్నాహాలు జరుగుతున్నాయి. త్వరలో మనం ఏ ఎల్బీనగర్ నుంచో గచ్చిబౌలికి ఎయిర్ ట్యాక్సీలో ప్రయాణించడం ఖాయం.