ఆహారంలోనే కాదు సౌందర్య సాధనలోనూ తరాల నుంచీ నెయ్యి భాగంగా ఉంది. ముఖ్యంగా చలిదెబ్బ నుంచి చర్మాన్ని రక్షించడంలో దీనికి పేరుంది. అందుకే ఇప్పుడు పేరెన్నికగన్న వివిధ సౌందర్యోత్పత్తుల సంస్థలు నెయ్యిని ఉపయోగించి రకరకాల ఉత్పత్తుల్ని మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. ఈ చలికాలం ఘీ బేస్డ్ బ్యూటీ ప్రొడక్ట్స్దే కొత్త ట్రెండ్!
పెదవులు మృదువుగా ఉండాలి. చర్మం మెరవాలి. జుట్టు నిగనిగలాడాలి. కాలం ఏదైనా చాలామంది రోజువారీ కోరికలు ఇవి. వీటన్నిటి మీదా ఒక్కసారే దెబ్బ కొడుతుంది చలిపులి. ఎండావానా కాలాలతో పోలిస్తే చలికాలం ప్రభావం చర్మం మీద ఎక్కువగా కనిపిస్తుంది. దాన్నుంచి మేనిని కాపాడుకోవడం మేక-పులి ఆటకన్నా కాస్త కష్టమే. అందుకే రక్షణ కవచం కోసం లేపనాలను ఆశ్రయిస్తాం.
నూనెలతో పాటు నెయ్యినీ సరంజామాలో ఉంచుకుంటాం. అన్నిటికన్నా ఎక్కువగా లోషన్లూ, మాయిశ్చరైజర్లలాంటి రకరకాల సౌందర్య సాధనాలనూ వాడతాం. అయితే ఇన్నాళ్లూ పెట్రోలియం ఆధారితంగా ఉండే ఇలాంటి ఉత్పత్తులు ఇప్పుడు నెయ్యి మూల పదార్థంగా రూపొందుతున్నాయి. మనం అమితంగా విశ్వసించే నెయ్యి సుగుణాలన్నీ వీటిలోనూ ఉన్నాయంటూ ప్రకటనలు ఇస్తున్నాయి తయారీ సంస్థలు. దీంతో సౌందర్య పోషణలో వీటికి క్రేజ్ పెరుగుతున్నది.
ఆరోగ్యకరమైన కొవ్వులను కలిగి ఉండే నెయ్యి సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. నెయ్యిలో ఉండే బ్యుటిరేట్ అనే ఫ్యాటీ ఆసిడ్‌కు యాంటి ఇన్ఫ్లమేటరీ గుణాలుంటాయి. కందిన చర్మం, దద్దుర్లలాంటి వాటికి మందులా పనిచేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ ఎ, ఇ, కె,డిలు చర్మాన్ని, జుట్టును ఆర్యోగంగా, మెరుస్తూ ఉండేలా చేస్తాయి. ఇందులోని యాంటి ఆక్సిడెంట్లు చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి. ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్లు పొడిబారిన చర్మానికి తేమను సమకూర్చి జీవాన్నిస్తాయి. ఎగ్జిమాలాంటి చర్మ వ్యాధుల నియంత్రణకూ నెయ్యి ఉపయోగపడుతుంది. అలర్జీలను నివారిస్తుంది. కాళ్ల పగుళ్లను తగ్గించేందుకు నెయ్యి మంచి మందు. జుట్టుకు కూడా ఇందులోని పోషకాలన్నీ ఎంతో మేలు చేసేవే.
అందుకే కేశ, చర్మ సంరక్షణకు వాడే వివిధ ఉత్పత్తుల్లో ఇప్పుడు నెయ్యి ప్రధాన మూలకం. దీనితో మాయిశ్చరైజర్లు, ఎమల్షన్లు, హ్యాండ్ అండ్ ఫుట్ క్రీమ్‌లు, ఎక్స్ఫోలియేటర్లు తయారు చేస్తున్నారు. అంతేకాదు, పెదవుల కోసం ఘీ బేస్డ్ లిప్‌బామ్, లిప్ స్క్రబ్, లిప్మాస్క్లు రూపొందిస్తున్నారు. ఇవి కాక హెయిర్ కండిషనర్లు, హెయిర్ ఆయిల్, మసాజ్ ఆయిల్, బాడీవాష్లాంటి వాటిలోనూ నెయ్యిని దండిగానే వడ్డిస్తున్నారు. ఏతావాతా చెప్పొచ్చేదేమిటంటే వెనకటికాలం మంచిని ఎంచుతూ… సౌందర్య సాధనలో ఘృతాన్ని ఉధృతంగానే వాడుతున్నారు!