జీవకోటికి నీరు ప్రాణాధారం. మన శరీరంలో కూడా 70 శాతం వరకు నీరే ఉంటుంది. రోజువారీ శారీరక ప్రక్రియలు సాఫీగా సాగిపోవడానికి కనీసం రెండు నుంచి మూడు లీటర్ల నీళ్లు తాగాలనే విషయం తెలిసిందే. అయితే మనలో చాలామంది నీళ్లు నిలబడి తాగేస్తుంటారు. కానీ, ఇది సరైన పద్ధతి కాదంటున్నారు నిపుణులు.
నిలబడి నీళ్లు తాగటం మూత్రపిండాల సమస్యలు, కీళ్లనొప్పులు, ఊపిరితిత్తుల ఇబ్బందులు, జీర్ణం సమస్యలకు అంటుకడుతుందట. కాబట్టి ఈ తరహా ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లతోపాటు, ఆరోగ్యవంతులు కూడా నీళ్లు నిలబడి తాగకూడదు. ఓ చోట కూర్చుని… నీళ్లన్నీ ఒక్కసారిగా కాకుండా చిన్నచిన్న గుటకలతో తాగాలి. ఇలా తాగడం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ సరిగ్గా ఉంటుంది. శరీరానికి అవసరమైన మినరల్స్ అన్నీ అందుతాయి.
శారీరకంగా ఫిట్‌గా ఉండటానికి, ఆరోగ్యకరమైన జీవితం కోసం చేసే ప్రాథమిక వ్యాయామాల్లో రన్నింగ్ ముఖ్యమైనది. అయితే, రన్నింగ్‌తో ఎన్నో లాభాలు ఉన్నట్టే… పాదాలు బెణకడం, ఒత్తిడికి పాదాల్లో పగుళ్లు రావడం (స్ట్రెస్ ఫ్రాక్చర్), మోకాటి చిప్పకు సంబంధించిన సమస్యలు లాంటి ప్రమాదాలు కూడా ఉంటాయి. అంతేకాదు రన్నింగ్ ఒక్కోసారి కండరాలు బ్యాలెన్స్ కోల్పోవడానికి, వెన్నునొప్పికి కారణం కావొచ్చు. రన్నింగ్ చేసేటప్పుడు జరిగే పొరపాట్ల వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి.
ఆ పొరపాట్లను సరిచేసుకుంటే రన్నింగ్ మంచి వ్యాయామంగా మిగిలిపోతుంది. మోకాళ్ల మీద ఒత్తిడి పడకుండా తగినంత దూరం మాత్రమే అడుగులు వేయాలి. రన్నింగ్ కారణంగా శరీరంలో నొప్పి వస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల సలహా తీసుకోవాలి. రన్నింగ్ ముందు, తర్వాత వార్మప్, కూల్ డౌన్ వ్యాయామాలు తప్పనిసరిగా చేయాలి. సరైన భంగిమలోనే పరుగెత్తాలి. అంతేతప్ప తోచినట్టుగా ఉరకకూడదు. పాదాలకు తగిన షూస్‌ను మాత్రమే ఎంచుకోవాలి. ఏవంటే అవి వేసుకుని రన్నింగ్ చేయకూడదు.
తరిగిన ఉల్లిముక్కలను ఆహారంతోపాటు తినడం చాలామందికి అలవాటే. ఉల్లిపాయల్లో గంధకం (సల్ఫర్) ఉంటుంది. ఇది సహజ సిద్ధంగా రక్తాన్ని పలుచగా చేయడానికి ఉపకరిస్తుంది. అలా రక్తంలో ప్లేట్లెట్స్ గట్టిపడకుండా చేస్తుంది. ఉల్లిలో ఉండే క్వెర్సిటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ధమనుల్లో ప్లాక్ పేరుకుపోకుండా తోడ్పడుతుంది. అలా ఉల్లిపాయలు గుండె ఆరోగ్యానికి, రోగ నిరోధక శక్తి మెరుగుదలకు హామీని ఇస్తాయి.