నాటకానికి కథ అవసరం లేదు. సన్నివేశాలు, సంఘటనలు ఉంటే చాలు. ఎక్కువ పాత్రలు కూడా అవసరం లేదు. కాన్ఫ్లిక్ట్ (ఘర్షణ) ఉంటే చాలు. యాక్షన్ (చర్య), రియాక్షన్ (ప్రతిచర్య), కౌంటర్ రియాక్షన్ (ప్రతి చర్యకు చర్య) గొలుసుతో నాటకం నడిచిపోతుంది. రెండే రెండు పాత్రలతో నడిపించేయొచ్చు. లగువు బిగువుల సమన్వయం ఉంటే.. ఇతివృత్త అంతఃసారాన్ని ఆ పాత్రల అభినయమే అద్భుతంగా వ్యక్తపరుస్తుంది. తనికెళ్ళ భరణి, తల్లావఝుల సుందరం తెలుగు నాటకానికి ‘రచనాభినయ’ ప్రయోగాన్ని వినూత్నంగా అందించారు. అలాంటి నాటికల్లో ‘కొక్కోరొక్కో’ ఒకటి.
‘కొక్కోరొక్కో’ అంటే మేలుకొలుపు. ఎవరికి మేలుకొలుపు? యువతకు, దేశానికి సంబంధించిన నిరుద్యోగ సమస్య గురించి మేలుకొలుపు. దేశమేదైనా, కాలమేదైనా నడిచే ప్రభుత్వమేదైనా సరైన చేతికి సరైన పని లేకపోతే (చూపలేకపోతే) పేదరికమే కాదు… ఆ దేశం అశాంతికి నిలయంగా మారుతుంది. ఇప్పటికే మనల్ని నిరుద్యోగం పీడిస్తున్నది. ఈ సమస్యను సకల పార్శాల ద్వారా నవరసాల ప్రాతిపదికపై ఎత్తి చూపింది ‘కొక్కోరొక్కో’ నాటిక. యువత నిరుద్యోగ భారాన్ని మోయలేక, అభిమానాన్ని చంపుకోలేక, ఆకలికి తాళలేక, అంతర్-బహిర్ ఘర్షణలో పుట్టుకొచ్చే పోకడలు, ప్రశ్నిస్తే రాజ్యం ఇచ్చే ‘బహుమానం’ ఎంత దారుణంగా ఉంటాయో.. డైనమైట్లా పేలిన ఈ నాటిక చూస్తే తెలుస్తుంది.
యోగి-జోగి పాత్రలు రెండైనప్పటికీ ఒక వ్యక్తిలో దాగి ఉన్న ద్వైదీభావ ప్రతీకలు. అది మొదటి సన్నివేశంలోనే తేలిపోతుంది. మనిద్దరం ఒక్కటే అని ప్రకటిస్తారు. ఓ ఉద్యోగానికి ఇంటర్వ్యూ జరుగుతుంది. ఆ ఉద్యోగం ఏమిటనుకున్నారు? నోవెకెన్సీ బోర్డుల తయారీ పని! ఆ ఉద్యోగం నచ్చక, కోపంతో వెళ్తుంటే… నగరంలో ఎక్కడికెళ్లినా ఎదురుపడేవి మా కంపెనీ ‘నోవెకెన్సీ’ బోర్డులే అంటాడు ప్రొప్రైటర్.
విలువలతో పాకులాడే దిగువ మధ్యతరగతి కుటుంబంలో కొడుకు ఉద్యోగానికి రికమండేషన్ చేయమంటే, చస్తే చేయనంటాడు తండ్రి. ప్రపంచంలో అందరికీ లోకువైనవాడు నిరుద్యోగే! మరి నిరుద్యోగికి పెళ్లవుతుందా? అవుతుంది. ఎందుకంటే?.. ఏజ్ బారైతే ఉద్యోగం రాదు. పెళ్లికేం ఖర్మ. కాకపోతే కాలే కడుపులు అప్పుడు ఒక్కటి కాదు… రెండు. పేదరికం అయినా పెళ్లయ్యాక పిల్లలు పుట్టక మానరుగా. పిల్లో, పిల్లాడో ఇంకా పుట్టకపోయినా కాన్వెంట్లో సీటు కోసం, ఆ తర్వాత ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్‌లో రిజిస్ట్రేషన్ కోసం ఇప్పట్నుంచి పరుగులు తీయాలి! అందుకే పెళ్లొద్దు అనుకుంటారు. మరి సన్యాసుల్లో కలిస్తే… తప్పుడు పనులు చేస్తే… తప్పుడు మాటలు పలికితే… జనం ఊరుకుంటారా? సన్యాసైనా వదలరు. దేహశుద్ధి చేస్తారు.
ఉద్యోగం రాలేదనే బాధతో ఇంటి నుంచి పారిపోయిన యువత బజారునపడితే ఆకలి ఊరుకుంటుందా? నీడలా వెంటాడుతుంది. అడుక్కు తినాల్సి వస్తుంది. ఎంగిలాకుల కోసం ఎగబడతారు. సిగ్గు, అభిమానం, నీతి, జాతి అన్నీ ఆకలి ముందు ఓడిపోతున్నాయ్. ఈ దేశంలో తిండి లేక అలో లక్ష్మణా అని ఏడుస్తున్న వాళ్ల సంఖ్య కోట్లల్లో ఉంది. అందరిలా జోగి పంపు నీళ్లు తాగి కడుపు నింపుకొంటాడు.
కళ్లకు గంతలు (నిజం చూడకుండా), నోళ్లు కుట్లు (నిజం మాట్లాడకుండా), చెవుల్లో సీసం (నిజం వినకుండా) నింపుకొని మేధావులు కనిపిస్తారు. ‘ఎందుకలా చేశారు?’ అని ప్రశ్నిస్తే ‘మనది గాంధీజీనే కాల్చేసిన దేశం గనుక’ అని జవాబొస్తుంది. జోగి ఉద్యోగాల కోసం ఉద్యమాన్నే లేవదీస్తానంటే… ‘ఖామోష్ నీయమ్మ నా మీదే మర్లబడ్తుండు గుంజేయిండ్రా…’ అని మంత్రి అనగానే జోగిని లాగిపారేస్తారు.
మేధస్సును గుర్తించకపోతే ఆ మేధస్సుతోనే దేశాన్ని సర్వనాశనం చేస్తానని ఒకడంటే… ‘తప్పురా అహింసా సిద్ధాంతంతో యావత్ ప్రపంచాన్ని మోకరిల్లేలా చేసిన దేశం మనదిరా’ అంటూ మరొకడు అడ్డుకుంటాడు. కడకు అడ్డుపడిన యోగిని పడేసి, జోగి పైకెక్కి ‘ఏ దేశంలో విద్య వ్యాపారమవుతుందో, ఏ దేశంలో మూర్ఖత్వం గద్దెనెక్కుతుందో ఆ దేశంలో ఎప్పుడూ పుట్టకు’ అని ఆక్రోశంతో గర్జిస్తాడు. నాటిక ముగుస్తుంది.
నాటక రచనా శిల్పంతోపాటు అభినయ శిల్పం అడుగడుగునా పోటీపడుతుంది. అదే ఆకర్షణ. ఈ ప్రయోగాత్మక నాటికను ఫైవ్‌స్టార్ హోటళ్లలోనూ, పబ్లిక్ పార్కుల్లోనూ, విశ్వవిద్యాలయ, కళాశాల రంగస్థల వేదికల్లోనూ, మురికి వాడల రోడ్లపైనా.. ఇలా ఎన్నోచోట్ల ప్రదర్శించారు. నాలుగు దశాబ్దాలుగా ఈ ప్రదర్శనా ప్రవాహం అప్రతిహతంగా సాగుతూనే ఉంది. ఎక్కడ ప్రదర్శించినా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. తనికెళ్ళ భరణి నాటక స్వర్ణోత్సవాల్లో భాగంగా ఇటీవల హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో ఈ నాటకాన్ని ప్రదర్శించారు.
నాటిక పేరు: కొక్కోరొక్కో
ప్రదర్శన: మిత్రా క్రియేషన్, హైదరాబాద్
రచన: తనికెళ్ళ భరణి
దర్శకత్వం: ఎస్.ఎం. భాషా
పాత్రధారులు: సురభి రాఘవ, కార్తిక్
-కె. శాంతారావు
రంగస్థల నటుడు, విశ్లేషకుడు