గ్రహణ మొర్రి పిల్లల పరిస్థితి నరకమే. మనస్ఫూర్తిగా తినలేరు, సరిగా మాట్లాడలేరు. పుట్టుకతో వచ్చే ఈ లోపం వల్ల ఎంతోమంది చిన్నారులు చిరునవ్వుకు దూరం అవుతున్నారు. కొందరైతే కుటుంబాలకూ దూరం అవుతున్నారు. ఆ పిల్లల పాలిట దేవుడిలా వచ్చారు డాక్టర్ సుబోధ్ సింగ్. లోపాన్ని శాపంలా చూపిస్తూ కోట్ల ఆస్తులు పోగేసుకుంటున్న వైద్యులున్న ఈ రోజుల్లో.. ఉచితంగా గ్రహణ మొర్రికి ఆపరేషన్లు చేస్తూ, పిల్లల జీవితాలకు పట్టిన గ్రహణాన్ని వదిలిస్తున్నారు.
అది 2013, జూలై 7..
టెన్నిస్ ప్రపంచమంతా వెయ్యి కండ్లతో ఎదురు చూస్తున్న మ్యాచ్ అది. వింబుల్డన్ మెన్స్ ఫైనల్. బరిలో.. ఆండీ ముర్రే, నొవాక్ జొకోవిచ్. ఈ ఉత్కంఠ భరితమైన మ్యాచ్‌ను తిలకించేందుకు అప్పటికే దాదాపు రెండుకోట్ల మంది టీవీలకు అతుక్కుపోయారు. వేలాదిమంది స్టేడియంలో ఎదురుచూస్తున్నారు. అంతలోనే..టాస్ వేసేందుకు గ్రహణ మొర్రి ఆపరేషన్ చేయించుకున్న ఓ చిన్నారిని పిలిచారు. ఆ బాలిక గురించి, ఆమెకు శస్త్రచికిత్స చేసిన వైద్యుడి గురించి అక్కడ ప్రస్తావించారు అంపైర్. ప్రేక్షకుల్లో ఉన్న ఆ డాక్టర్ వైపు కెమెరాలన్నీ మళ్లాయి. ఆ వైద్యుడి పేరు.. డాక్టర్ సుబోధ్ సింగ్. ఆ చిన్నారి, డాక్యుమెంటరీ విభాగంలో ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ‘పింకీ’.
ఉచిత సర్జరీలు
సుబోధ్ సింగ్ వారణాసిలో పుట్టి పెరిగారు. నిరుపేద కుటుంబం. బాల్యంలో కూలి పనులకు వెళ్లారు. కళ్లజోళ్లు, సబ్బులు, సర్ఫ్లు విక్రయించారు. కష్టపడి చదివి డాక్టర్ పట్టా అందుకొన్నారు. పేదల సర్జన్‌గా శిఖరమంత ఎత్తుకు ఎదిగారు. డాక్టర్ సుబోధ్ తన తండ్రి జ్ఞాపకార్థం పద్దెనిమిదేండ్లుగా గ్రహణ మొర్రితో బాధపడుతున్న చిన్నారులకు ఉచితంగా సర్జరీలు చేస్తున్నారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 37 వేల మంది చిన్నారులకు చిరునవ్వులను పరిచయం చేశారు. ప్లాస్టిక్ సర్జన్లు, సామాజిక కార్యకర్తలు, స్పీచ్ థెరపిస్టులతో కలిసి కార్యక్రమాన్ని నిర్వహిస్తారాయన. పుట్టుకతో వచ్చే వైకల్యాన్ని సరిదిద్దడమే కాదు, గ్రహణ మొర్రి శిశువును ప్రసవించిన నేరానికి వెలివేతకు గురైన తల్లుల జాడ తెలుసుకొని తిరిగి కుటుంబంతో కలిపారు.
సొంత దవాఖానలోనే శిక్షణ..
వారణాసిలోని తన దవాఖానను చికిత్సా కేంద్రంగా, శిక్షణ సంస్థగా మార్చారు సుబోధ్ సింగ్. వివిధ దేశాల సర్జన్లకు చీలిక పెదవులు, దవడలు అతికించడంలో ఇక్కడ ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ‘గ్రహణ మొర్రి చిన్నారుల బాధను ఆలకించిన ఆ భగవంతుడు నన్ను ప్లాస్టిక్ సర్జన్‌గా మార్చాడు. నేను జీవితాంతం ఆ సేవలోనే కొనసాగుతా. చికిత్స పేరుతో డబ్బు సంపాదించే వ్యాపారవేత్తను ఎప్పటికీ కాలేను’ అంటారు. సుబోధ్ బృందం అగ్ని ప్రమాద బాధితులకూ సర్జరీలు చేస్తారు. ఇప్పటివరకు 6 వేలకు పైగా ఉచిత సర్జరీలు చేశారు. ఇదే అంశం ఇతివృత్తంగా ‘బర్న్ గర్ల్’ అనే డాక్యుమెంటరీని రూపొందించారు. 2008లో ఆస్కార్‌కు ఎంపికైన ‘పింకీ’ కూడా సుబోధ్ సేవలకు అద్దం పట్టేదే. ఇందులో డాక్టర్ సింగ్, అతని బృందం గ్రహణ మొర్రితో బాధపడుతున్న ఓ నిరుపేద చిన్నారికి సర్జరీ చేస్తారు. ఆ బాలిక పేరు పింకీ సోంకర్. ఆ బాలికది యూపీలో మీర్జాపూర్‌లోని రాంపూర్ దబాహి గ్రామం. సుబోధ్ కొత్త జీవితాన్నిచ్చిన పింకీలు ఎంతోమంది.