Marfa Band | హైదరాబాద్ నగరం.. విభిన్న సంస్కృతుల నిలయం. నిత్యం ఏదో ఒక వేడుకతో సందడిగా ఉంటుంది. కులమతాలకు అతీతంగా పండుగలు, ఉత్సవాలతో నగరమంతా కళకళలాడుతూ ఉంటుంది. అయితే, వేడుక ఏదైనా.. ‘మార్ఫా బ్యాండ్’ ఆ సందడిని మరో మెట్టు ఎక్కిస్తుంది. ఉర్రూతలూగించే సంగీతంతో.. ఆబాలగోపాలాన్నీ మైమరపింపజేస్తుంది.
భాగ్యనగర వేడుకల్లో ‘మార్ఫా బ్యాండ్’ ఉండాల్సిందే! పండుగ ఏదైనా.. ‘మార్ఫా’ సందడి చేయాల్సిందే! నగరంలో ఎన్నో బ్రాస్ బ్యాండ్ బృందాలున్నా, జనాదరణ మాత్రం ‘అరబ్బీ మార్ఫా’కే! దీనికే ‘హద్రామి మార్ఫా’ అనే పేరు కూడా ఉన్నది. సాయంత్రం మొదలయ్యే మార్ఫా ప్రదర్శన.. తెల్లవారుజాము వరకూ సాగుతుంది. వేడుకలు ముగిసే వరకు మార్ఫా కళాకారులు విశ్రమించరు. ఉద్వేగభరితమైన సంగీతంతో వీక్షకులను అబ్బురపరుస్తారు. ధోలక్లపై దరువులేస్తూ.. చుట్టూ ఉన్నవాళ్లచేత విజిల్స్, స్టెప్పులు వేయిస్తారు.
చారిత్రక నేపథ్యం
తూర్పు ఆఫ్రికాకు చెందిన ‘సిద్ది’ తెగవారు 18వ శతాబ్దంలో హైదరాబాద్‌కు వలస వచ్చారు. వారి శారీరక బలం, గుర్రపు స్వారీ ప్రతిభకు ముగ్ధులైన నిజాం ప్రభువులు ఆశ్వికదళ గార్డులుగా, ఖజానాకు కాపలాదారులుగా నియమించారు. వీరే మార్ఫాను నగరానికి పరిచయం చేశారు. నిజాం పాలనాకాలంనాటి అధికారిక వేడుకల్లో ఈ మార్ఫా సంగీతాన్ని తప్పనిసరిగా వినిపించేవారు.
ప్రదర్శన విధానం
ఒక్కో బ్యాండ్‌లో సాంప్రదాయికంగా 8, 12, 16, 22 మంది సభ్యులు ఉంటారు. వీరంతా తెల్లని కుర్తాలు ధరిస్తారు. ఎరుపు రంగు స్కార్ఫ్తలకు చుట్టుకుంటారు. కొంతమంది వాద్యాలు వాయిస్తే, మరికొంత మంది ఆ సంగీతానికి అనుగుణంగా నృత్యం చేస్తారు. మార్ఫా కళాకారులు సాధారణంగా రాత్రిపూట ప్రదర్శన నిర్వహిస్తారు. మూడు నుంచి ఆరు గంటలపాటు నిరవధికంగా ఈ ప్రదర్శన సాగుతుంది. అన్ని గంటలపాటూ బరువైన డోలక్లను మెడలో వేసుకొని, నృత్యాలు చేస్తూ ప్రదర్శనలు ఇవ్వడం వీరి ప్రత్యేకత.
అభిరుచికి అనుగుణంగా..
మార్ఫా ప్రదర్శనలో ప్రజల అభిరుచికి తగిన పాటలను పాడుతుంటారు. గిరిజన తెగలైన బంజారాల పాటలు మొదలుకొని ప్రసిద్ధ సినిమా పాటల వరకూ అన్నిటినీ ప్రదర్శనలో భాగం చేస్తారు. కొన్ని అరబిక్, యెమెన్ పాటలనూ పాడుతారు. వినాయకచవితి ఊరేగింపులు, పెండ్లి బరాత్‌లు, ఎన్నికల ప్రచారాల్లో మార్ఫా బ్యాండ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఐపీఎల్ మ్యాచ్‌లు, దసరా ఉత్సవాలు, రంజాన్ వేడుకలు, కొత్త సినిమా విడుదల.. ఇలా వేడుక ఏదైనా, మార్ఫా బ్యాండ్ల మోత మోగాల్సిందే! గతంలో హైదరాబాద్ నగరానికి మాత్రమే పరిమితమైన మార్ఫా.. ‘హైదరాబాద్ నవాబ్స్’ సినిమాలతో జనబాహుళ్యంలోకి చేరింది. ప్రస్తుతం ఇతర రాష్ర్టాలు, దేశాల్లోనూ మార్ఫా కళాకారులు ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. నవాబుల కాలంలో అధికారిక కార్యక్రమాల్లో ప్రదర్శనలు ఇచ్చిన కళాకారులు, ఇప్పటికీ అదే ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. ఏటా గోల్కొండ కోట వేదికగా జరిగే స్వాతంత్య్ర దినోత్సవ సంబురాల్లో తమ పాటలతో ఆహూతుల్ని అలరిస్తున్నారు. నగరానికి చెందిన కొన్ని కుటుంబాలు మార్ఫా కళనే జీవనాధారంగా చేసుకొన్నాయి. తమ పూర్వికుల నుంచి వారసత్వంగా వచ్చిన ఈ కళ అంతరించిపోకుండా కాపాడుతున్నాయి. కానీ, ఈ తెగ వారు తమ మాతృభాషను మాత్రం మరిచి పోయారు. స్థానికంగా మాట్లాడే ఉర్దూనే అమ్మభాషగా ఆమోదించారు. తాము హైదరాబాదీలమనే సగర్వంగా చెప్పుకొంటారు.
వాద్యాల కలయిక
మార్ఫా.. అనేది యెమెనీ అరబిక్ పదం. ఈ కళ.. అనేక వాద్యాల కలయిక. ఇందులో డోలక్, డప్పులు ముఖ్యమైనవి. స్టీలు కుండలు, ‘మర్ఫా’ అనే చిన్న డ్రమ్, ‘థాపి’ అనే చెక్క కర్రలు, కందూరా, ముషద్ జెట్టాలాంటి విభిన్నరకాలైన ఎనిమిది వాయిద్యాలను వాడుతారు. వీటిలో చాలావరకు డోలక్‌ను పోలి ఉన్నా, పరిమాణంలో తేడా ఉంటుంది. పూర్వం మేక చర్మంతో చేసిన డోలక్లను వాడేవారు. ప్రస్తుతం ఫైబర్ వాద్యాలను ఉపయోగిస్తున్నారు.
– అరవింద్ ఆర్య, 7997 270 270
Follow us on Google News, Facebook, Twitter , Instagram, Youtube
Read More :
Sonia Akula | కాలేజీ రోజుల్లోనే సేవ.. ఇప్పుడు అనాథ ఆడబిడ్డల కోసం కృషి”
అప్పుడు నెత్తిమీద గంపపెట్టుకుని తిరిగాడు.. ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నాడు”
“ఏపీకి చెందిన ఈ అంధుడి బయోపిక్ తీయాలని బాలీవుడ్ ఎందుకు ఆరాటపడుతున్నది?”
“అన్నదాతకు అండగా వరంగల్ జిల్లా మహిళలు.. ఏం చేస్తున్నారంటే..”