Virtual Influencers | ‘వర్చువల్ ఇన్ఫ్లుయెన్సర్స్’.. మహావేగంగా అభిమానులను సంపాదించుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఆ ఫాలోయింగ్ మామూలుగా లేదు. వాళ్లు పెట్టే ఫొటోలు, వీడియోలు చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. వివిధ దేశాలకు ఉన్నట్లే.. మనకూ ఓ వర్చువల్ ఇన్ఫ్లుయెన్సర్ ఉంది. పేరు.. కైరా. తన ఫాలోవర్స్‌ను చూస్తే మాత్రం.. ‘ఔరా’ అనాల్సిందే.
బ్లాక్ మిర్రర్ రోబో, లవ్ రోబో, సెక్స్ రోబో.. భౌతికంగా కనిపించే రోబోలు. వాటికి కొనసాగింపుగా ‘వర్చువల్ ఇన్ఫ్లుయెన్సర్స్’ విచ్చేస్తున్నారు. అందచందాలతో, ఆకట్టుకునే వాగ్ధాటితో ఫాలోవర్స్‌ను పెంచుకుంటున్నారు. పలు కంపెనీల మార్కెటింగ్‌లో కీలకంగా వ్యవహరిస్తున్నారు కూడా. ఇన్‌స్టా, ఫేస్బుక్, ట్విటర్ వంటి సోషల్ మీడియా సంస్థలు వర్చువల్ ఇన్ఫ్లుయెన్సర్లకు అధికారిక గుర్తింపు (వెరిఫైడ్)ను సైతం ఇస్తున్నాయి. సోషల్ మీడియాలో ఆ క్రేజ్ చూసి.. కొన్ని సంస్థలు సొంతంగా వర్చువల్ ఇన్ఫ్లుయెన్సర్లను తయారు చేసుకుంటున్నాయి.
సోషల్ మీడియా సృష్టించిన వర్చువల్ క్యారెక్టర్ ఇది. ఒకరకంగా వర్చువల్ అవతార్. సోషల్ మీడియాలో అభిమానులను సంపాదించుకొని.. వారు కోరుకునే కంటెంట్‌ను, వివిధ బ్రాండ్ల సమాచారాన్ని అందించే గ్రాఫిక్స్ పాత్ర. కంప్యూటర్ జెనరేటెడ్ ఇమేజరీ (సీజేఐ)తో వాటిని సృష్టిస్తున్నారు. మొదట్లో ఈట్రెండ్ను ‘నాన్సెన్స్’ అనీ, ‘వర్క్‌వుట్’ కాదని గేలి చేశారు. అయినా గ్రాఫిక్స్ డిజైనర్లు పంతం వీడలేదు. తమకు తోచిన విధంగా వర్చువల్ క్యారెక్టర్లను సృష్టించి.. మంచి కంటెంట్‌తో ఆకట్టుకోవడం మొదలుపెట్టారు. ఆ వ్యూహం ఫలించింది. ఇప్పుడు వర్చువల్ ఇన్ఫ్లుయెన్సర్ వ్యవస్థ అనేది ఓ బంగారు బాతు. వాటి సృష్టి కర్తలు డాలర్లకొద్దీ లాభాలు పొందుతున్నారు. కేబేరులు అవుతున్నారు.
మనదేశపు మొట్టమొదటి వర్చువల్ ఇన్ఫ్లుయెన్సర్.. కైరా. ఇన్‌స్టా వేదికగా @kyraonig అనే 21 ఏండ్ల అమ్మాయి అకౌంట్ 107కె మంది ఫాలోవర్స్‌ను కలిగి ఉంది. ఎలాంటి పబ్లిసిటీ లేకుండానే.. ఏడాదికే ఈ స్థాయికి చేసుకోవడం కైరాకే సాధ్యమైంది. ఇప్పుడు కైరా అంతర్జాతీయ ట్రెండ్లను అనుసరిస్తూ సాంకేతికత, లైఫ్‌స్టైల్, ఫ్యాషన్ రంగాల్లో ఉన్న బ్రాండ్లతో కలిసి పనిచేస్తున్నది. కైరా సృష్టికర్త పేరు హిమాన్షు గోయెల్. చండీగఢ్‌కు చెందిన హిమాన్షు అహ్మదాబాద్‌లో ఎంబీఏ చేశాడు. తర్వాత సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా స్థిరపడ్డాడు. 2019 నుంచి వర్చువల్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ స్పేస్‌లోకి వచ్చాడు. 2021 డిసెంబర్లో కైరాను అధికారికంగా లాంచ్ చేశాడు. కైరా వర్చువల్ వయసు 21 ఏండ్లు. తన పుట్టిన రోజు మాత్రం 28 జనవరి 2022న. ఎన్ని ట్రోల్స్ వచ్చినా వెనకడుగు వేయకపోవడం వల్లే రోజుకు వెయ్యిమంది చొప్పున ఫాలోవర్స్ పెరుగుతున్నారని చెబుతున్నాడు హిమాన్షు. ప్రస్తుతం కైరా ఫాలోవర్లలో 90 శాతం భారతీయులే.
అవును.. వర్చువల్ ఇన్ఫ్లుయెన్సర్లు ఏదైనా చెయ్యగలరు. ఆడగలరు, పాడగలరు. డ్యాన్స్, స్విమ్మింగ్, యోగా చెయ్యగలరు.. మోడలింగ్, ర్యాంప్‌వాక్, ఫొటోషూట్.. ఎక్కడైనా రాణించగలరు. టిక్‌టాక్, ఇన్‌స్టా రీల్స్, మోజ్ వంటి వీడియోలూ చెయ్యగలరు. వీళ్లు నిత్య యవ్వనులు. వర్చువల్ ఇన్ఫ్లుయెన్సర్లతో అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రచారం లభిస్తున్నది. దీంతో పలు కంపెనీలు ‘వర్చువల్’ నిపుణులవెంట పడుతున్నాయి. ఇంకేముంది, క్రియేటర్స్‌కు డబ్బే డబ్బు. కైరా వెనుక ఓ పదిమంది నిపుణుల బృందం పనిచేస్తున్నది.
Photo Cutout Standee | పెళ్లి రోజు అయినా.. పుట్టిన రోజు.. ఫంక్షన్ ఏదైనా బెస్ట్ గిఫ్ట్ ఇదేనంట !!