షుగర్ పేషెంట్ల కోసమే ఈ చెప్పులు.. వీటి స్పెషాలిటీ ఏంటంటే..
Diabetic Footwear | మధుమేహం శారీరకంగానే కాదు, మానసికంగానూ బాధపెడుతుంది. అందరిలో ఉండనీయదు. అందరిలా తిననీయదు. అన్నిట్లోనూ అసౌకర్యమే. ఆ ఇబ్బందిని ఎంతోకొంత తగ్గించడానికి తనవంతు ప్రయత్నం ప్రారంభించాడు విధాన్. ‘డాక్టర్ బ్రిన్స్లీ షూస్’ తన ఆవిష్కరణే.
చెన్నై కుర్రాడు విధాన్కు ఫ్యాషన్ పట్ల ఆసక్తి. సామాజిక స్పృహ కూడా ఉంది. అందుకే, మధుమేహ వ్యాధి గ్రస్తులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక పాదరక్షలు తయారుచేశాడు. వాటికి ‘డాక్టర్ బ్రిన్స్లీ షూస్’ అని పేరుపెట్టాడు. విధాన్ పాదరక్షలను అనేక దవాఖానలలో విక్రయిస్తున్నారు.

అసౌకర్యాన్ని గుర్తించి..
అదొక పెండ్లి వేడుక. విధాన్ ఫొటోలు తీస్తున్నాడు. పనిలోపనిగా తన మామయ్య వైపు కెమెరా తిప్పాడు. కానీ, ఎందుకో ఫొటోకు పోజు ఇవ్వడానికి ఆయన ఇష్టపడలేదు. మొహంలో కనిపిస్తున్న అసౌకర్యాన్ని విధాన్ గమనించకపోలేదు. మధుమేహం వల్ల వచ్చిన మచ్చలు, పుండ్లు చేతులనూ కాళ్లనూ అసహ్యంగా మార్చేశాయి. ఆ కారణంగానే ఫొటో దిగడానికి నిరాకరిస్తున్నాడని గ్రహించాడు విధాన్. మామయ్యలాంటి మధుమేహ పీడితులు ఎంతమంది ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. భారత్‌లో 20-70 సంవత్సరాల వయసువారిలో 8.7% మధుమేహ రోగులే. వీరిలో 7 కోట్ల 70 లక్షల మందికి మధుమేహ సమస్య ఉంది. ఆ తీపి వ్యాధి.. గుండెపోటు, స్ట్రోక్, కిడ్నీ ఫెయిల్యూర్, కీళ్లనొప్పులు వంటి సమస్యలకూ కారణం అవుతున్నది. ఆ ప్రభావంతో అవయవాలు దృఢత్వాన్ని కోల్పోతాయి, పాదాలు దెబ్బతింటాయి. కొన్నిసార్లు పరిస్థితి ప్రాణాంతకమూ అవుతుంది. మధుమేహం వల్ల ప్రతి ఇరవై సెకన్లకు ఒక పాదం తెగిపోతున్నదనే కఠోర వాస్తవాన్ని కూడా తెలుసుకున్నాడు ప్రధాన్.

వేయి జతల పాదరక్షలు
మధుమేహ వ్యాధిగ్రస్తులు తగిన పాదరక్షలను ధరిస్తే కనుక, సమస్య తీవ్రతను సగానికి సగం నివారించవచ్చని విధాన్ అధ్యయనంలో తేలింది. దీంతో పాదరక్షల తయారీపై దృష్టి సారించాడు. శాస్త్రవేత్తలతో మాట్లాడాడు. మధుమేహ నిపుణులను సంప్రదించాడు. డిజైనింగ్ సంస్థల సలహా తీసుకున్నాడు. మొత్తానికి మధుమేహ రోగులకు అనువైన పాదరక్షలకు ఓ రూపం ఇచ్చాడు. ‘డాక్టర్ బ్రిన్స్లీ’ పేరుతో ఓ సంస్థను ప్రారంభించాడు. మొదటి కస్టమర్ వాళ్ల మామయ్యనే. ఈ పాదరక్షలు అరికాలి ఒత్తిడిని తగ్గిస్తాయి. రక్త ప్రసరణ సజావుగా జరిగేలా తోడ్పడతాయి. చెమట పట్టదు. దురద ఉండదు.

85 హాస్పిటల్స్‌లో..
పాదరక్షలను చాలామంది ఫ్యాషన్ కోణంలోనే చూస్తారు. కంటికి బాగుంటే చాలనుకుంటారు. దీంతో డిజైనింగ్‌లో ఫ్యాషన్‌కూ ప్రాధాన్యం ఇచ్చాడు ప్రధాన్. బోస్టన్లోని జోస్లిన్ డయాబెటిస్ సెంటర్, బోస్టన్ మెడికల్ సెంటర్, హార్వర్డ్ మెడికల్ స్కూల్ వంటి ప్రముఖ వైద్యసంస్థలలో పనిచేస్తున్న నిపుణులకు బ్రిన్స్లీ షూస్ నమూనాలు చూపించాడు. అందరూ ప్రశంసించారు. విజయవంతమైన వ్యాపారానికి మంచి ఉత్పత్తి ఒక్కటే సరిపోదు. నిర్వహణ సామర్థ్యం, మార్కెటింగ్ నైపుణ్యమూ ఉండాలి. ఆ అనుభవం కోసం పిల్లర్ వెంచర్ క్యాపిటల్‌లో ఇన్వెస్ట్మెంట్ అసోసియేట్‌గా చేశాడు. ఈ అనుభవం ఆయనకు డాక్టర్ బ్రిన్స్లీని విజయవంతంగా నడిపించడానికి ఉపయోగపడింది. దీంతో 2019 ఫిబ్రవరిలో డాక్టర్ బ్రిన్స్లీని లాంఛనంగా ప్రారంభించాడు. హైదరాబాద్ సహా భారత్‌లో అన్ని మెట్రో నగరాల్లోని 85 హాస్పిటల్స్ ఈ షూస్ విక్రయిస్తున్నాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆన్లైన్ రిటైలర్లలో కూడా అందుబాటులో ఉన్నాయి.
ఇటలీలో అధ్యయనం
బోస్టన్లోని నార్త్ఈస్ట్రన్ యూనివర్సిటీలో కెమికల్ ఇంజినీరింగ్ చేశాడు విధాన్. స్కాలర్స్ ఇండిపెండెంట్ రీసెర్చ్ ఫెలోషిప్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. వేసవిలో విద్యార్థులు స్వతంత్రంగా పరిశోధన చేసేందుకు ఆ యూనివర్సిటీ ప్రోత్సహిస్తుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావించిన విధాన్, ప్రోటోటైపింగ్లో నిపుణుడైన డాక్టర్ మార్క్‌ను కలిశాడు. మధుమేహ పాదరక్షలను అభివృద్ధి చేయడంలో డాక్టర్ మార్క్ సూచనలు ఎంతో సహాయపడ్డాయి. సెలవుల్లో భారత్‌కు వచ్చినప్పుడు కూడా 40 మంది డయాబెటాలజిస్టులను కలిశాడు. షూ తయారీ పరిశ్రమ గురించి మరింత లోతైన అధ్యయనం అవసరం అనుకున్న విధాన్ ఇటలీలో పాదరక్షల వ్యాపారం చేస్తున్న ఒక కుటుంబాన్నీ కలిశాడు. అంతిమంగా ఆ యువకుడి కృషి ఫలించింది.
Read More :
Travelling with diabetes: మీకు డయాబెటిస్ ఉందా? టూర్ వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి..”
Health Tips | మధుమేహులకు మేలు చేసే సూపర్ ఫ్రూట్స్ ఇవే..!”
“Diabetes | ఇలా చేస్తే డయాబెటిస్ తగ్గిపోతుందట !!”
“Diabetes : షుగర్ ఉన్నవాళ్లు ఈ సమ్మర్లో పుచ్చ కాయ తినొచ్చా?”
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

