Health Bits | మన ఆహారపు అలవాట్లు మన మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేయొచ్చట. దీనికి మన జీర్ణ వ్యవస్థలో ఉన్న లక్షలాది బ్యాక్టీరియా మన మెదడుతో అనుసంధానమై ఉండటమే కారణమట. కాబట్టి ఫైబర్ సమృద్ధిగా ఉన్న ధాన్యాలు, పప్పుధాన్యాలు, కూరగాయలతోపాటు వీలైతే పులియబెట్టిన ఆహారాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పులియబెట్టిన ఆహారం వల్ల కడుపులో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది మన మానసిక ఆరోగ్యానికి దోహదపడుతుందట.
మనిషిని పీడించే క్యాన్సర్లలో పేగు క్యాన్సర్ (కొలొన్ క్యాన్సర్) ఒకటి. అయితే చాలామందికి పేగు క్యాన్సర్కు జీవనశైలికి సంబంధం ఉంటుందన్న విషయం గురించి మాత్రం అంతగా తెలియదు. దీని గురించి అమెరికాలోని ఓహియో స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు వేయి మంది పెద్దవాళ్లపై సర్వే నిర్వహించారు. ఊబకాయం, మద్యపానం, శారీరక శ్రమ లేకపోవడం, అధిక కొవ్వులు ఉన్న ఆహారం, ప్రాసెస్డ్ ఆహార పదార్థాలు పేగు క్యాన్సర్లకు దారితీస్తాయని ఈ సర్వేలో తేలింది. కాబట్టి 45 ఏండ్లు దాటినవాళ్లు, వీలైతే ఇంకా ముందుగానే డాక్టర్ల సూచన మేరకు కొలొనోస్కోపీ చేయించుకోవడం మంచిదని పరిశోధకుల సలహా.
మధ్యాహ్నం వేళల్లో గంటకంటే ఎక్కువసేపు నిద్రిస్తున్నారా? అయితే డయాబెటిస్ పరీక్ష చేయించుకోవడం మంచిదట. మూడు లక్షలకు పైగా వ్యక్తుల నుంచి సేకరించిన సమాచారం నుంచి జరిపిన ఓ అధ్యయనం ఆధారంగా పరిశోధకులు ఈ సలహా ఇస్తున్నారు. ఈ అధ్యయనంలో పగటిపూట రోజుకు గంటకంటే ఎక్కువసేపు నిద్రించిన వారిలో… నిద్రించని వారికంటే టైప్ 2 డయాబెటిస్ ముప్పు 45 శాతం ఎక్కువని కనుక్కొన్నారు. అయితే, డయాబెటిస్ ఉన్నందువల్ల పగటి వేళ ఎక్కువసేపు నిద్రిస్తున్నారా, లేదంటే పగటి నిద్రవల్ల డయాబెటిస్ వస్తున్నదా, మూడో కారణం ఇంకేదైనా ఉందా అనే విషయంలో మాత్రం స్పష్టత లేదు.