Rain suit | గొడుగు లేనిదే వానకాలం బయటికి వెళ్లలేం. వెళ్లినా కూడా స్వేచ్ఛగా తిరగాలంటే రెయిన్‌కోట్ అవసరం. కాబట్టే ఈ రెండూ మ్యాచింగ్ మ్యాచింగ్‌గా మార్కెట్లోకి వస్తున్నాయి. అదే తరహా ప్యాంటు, బూట్లు వీటికి జత అవుతున్నాయి.
వానకాలం వచ్చిందంటే పిల్లలకు పండగే. ఆకాశం నుంచి పడే చినుకుల్ని ఒడిసి పట్టాలనీ, పారే నీటిలో పడవల్ని వదలాలనీ సరదా పడుతుంటారు. వర్షం మొదలైతే చాలు గొడుగులు పట్టుకుని వీధివీధంతా తిరుగుతూ వాకిళ్ల ముందు సందడి చేస్తుంటారు. ఆ ముచ్చట పెద్దలకూ ఉన్నా, ఆరోగ్యం గురించి ఆలోచిస్తారు. అందుకే, పార్టీకి వెళ్లినప్పుడు సూటూబూటుతో ముస్తాబు అయినట్టు.. వాన ఆటలప్పుడు రెయిన్ కోట్లు, రబ్బరు బూట్లు వేసుకుంటారు. బయటికి వెళితే గొడుగు చేతిలో ఉండితీరేలా చూస్తారు. అలా అయితే వాళ్ల ముచ్చటా తీరుతుంది. అయితే, ఇదంతా ఏదో యుద్ధానికి సన్నద్ధమైనట్టు కాకుండా సరదాగా జరిగేలా వీటన్నిటినీ పిల్లలు ఇష్టంగా వేసుకునేలా ‘అంబ్రెల్లా రెయిన్ కోట్ సెట్’లు తయారవుతున్నాయి. ఇందులో గొడుగుకు రెయిన్ కోటు, ప్యాంటు, బూట్లలాంటివి మ్యాచింగ్‌గా వస్తాయి. ఇందులోని గొడుగును వానకాలానికే కాదు, ఎండల్లో నీడనిచ్చేలానూ రూపొందిస్తున్నారు.
మూడేండ్లు మొదలు హై స్కూలు పిల్లల దాకా వివిధ వయసుల వాళ్లకు నప్పేలా ఈ సెట్లు దొరుకుతున్నాయి. చిన్న పిల్లలు ఇష్టపడే కార్టూన్ల బొమ్మలూ వీటిపై మెరుస్తున్నాయి. అమ్మాయిలు, అబ్బాయిలు.. ఇద్దరి కోసమూ ఈ అంబ్రెల్లా సెట్లు వస్తున్నాయి. చూడగానే పిల్లల్ని ఆకట్టుకునేలా ఆకుపచ్చ, నీలం, గులాబీ, పసుపు.. ఇలా నిండైన రంగుల్లో తయారవుతున్నాయి. వానలో కాళ్లు తడవకుండా తయారయ్యే గమ్బూట్లు, ప్యాంటుతో సహా వచ్చేవి కొన్నయితే… కేవలం రెయిన్ కోటు, ఛత్రి సెట్‌గా వచ్చేవి మరికొన్ని. ఇందులో కొన్ని రకాల రెయిన్ కోట్ల పైన మన పేరు ఎంబ్రాయిడరీ చేయించుకునే వెసులుబాటూ ఉంది. మొత్తానికి పండక్కి కొత్త బట్టల్లా.. పిల్లల కోసం ఇవి వాన బట్టల సెట్లు అన్న మాట!