దేవ్మాలి.. రాజస్థాన్లోని బేవార్ జిల్లాలో దాగి ఉన్న ఒక అద్భుతం. ఆధునిక జీవనశైలిని సవాల్ చేస్తూ.. పూర్తిగా దైవానికే అంకితమైన గ్రామం. ఇళ్లకు తాళాలు, ఇంటి చుట్టూ ప్రహరీలు, నిరంతరం భూవివాదాలతో నిండిన ఈ ప్రపంచంలో.. ఇవేవీ లేకుండానే ప్రశాంతంగా విలసిల్లుతున్న పల్లె అది. విశ్వాసం, నమ్మకం అనే పునాదులపై నిలబడి.. ప్రపంచపు దృష్టిని ఆకర్షిస్తున్నది.
వెయ్యి ఎకరాల్లో విస్తరించిన దేవ్మాలి గ్రామంలో గుర్జర్ సామాజిక వర్గమే ఎక్కువ. వీరు ‘దేవనారాయణ్’ స్వామిని అత్యంత భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. ఎంతగా అంటే.. గ్రామం మొత్తాన్నీ దేవుని పేరుమీదే రిజిస్ట్రేషన్ చేయించేంతగా! అవును.. ఇక్కడ ఎవరికీ సొంత భూమి లేదు. ఆస్తి పత్రాలు గానీ, భూమి హక్కులు గానీ అస్సలు లేవు. అన్ని హక్కులూ దేవనారాయణ్ పేరుమీదే ఉంటాయి. గ్రామస్తులు తమను తాము ఆ దేవుడి భూమిని కాపాడే సంరక్షకులుగా మాత్రమే భావిస్తారు.
దేవ్మాలి గ్రామస్తుల జీవన విధానం ప్రత్యేకంగా ఉంటుంది. గ్రామంలోని ప్రతి ఇల్లూ వారి పూర్వికులు నిర్మించినట్లే.. సంప్రదాయ మట్టి, గడ్డితోనే నిర్మించుకుంటారు. అందుకే, ఈ గ్రామంలో అడుగుపెడితే కొన్ని శతాబ్దాల వెనక్కి వెళ్లినట్లు అనిపిస్తుంది. ఇప్పటికీ గ్రామంలో ఒక్కరు కూడా సిమెంట్, కాంక్రీట్, ఆధునిక పైకప్పులను ఆశ్రయించరు. అదే ఈ గ్రామాన్ని భారతదేశంలోని అత్యుత్తమ ఎకో టూరిజం గ్రామాల్లో ఒకటిగా నిలబెట్టింది. శాశ్వత కట్టడాలు నిర్మిస్తే గ్రామంలోని ఆధ్యాత్మిక శక్తికి ఆటంకం కలుగుతుందని స్థానికులు నమ్ముతారు. అలాచేస్తే దైవేచ్ఛను సవాలు చేసి అనర్థాలను కొనితెచ్చుకున్నట్లేననీ, అది తమకు ఇష్టం లేదని చెబుతారు. ఇక ఇళ్లకు తలుపులు ఉంటాయి కానీ, తాళాలు వేయరు. అయినా, ఈ గ్రామంలో దొంగతనాలు జరగవు. దేవుడే తమ సంపదను కాపాడతాడని దేవ్మాలివాసులు విశ్వసిస్తారు. ఆధునిక ఎల్పీజీ సిలిండర్లు, కిరోసిన్ వాడకాన్ని కూడా దూరం పెడతారు. సాంప్రదాయ పద్ధతిలోనే పొయ్యి వెలిగించి వంట చేసుకుంటారు.
స్థానికుల జీవనాధారం వ్యవసాయమే! రకరకాల పంటలు పండిస్తారు. కానీ, ఆ భూమిపై వారికి ఎలాంటి యాజమాన్య హక్కులు ఉండవు. భూమి మొత్తం దేవుడిదే కాబట్టి.. గ్రామస్తుల మధ్య భూ వివాదాలు అనేవే ఉండవు. అందుకే ఈ గ్రామంలో దశాబ్దాలుగా ఒక్క భూవివాదం గానీ, కోర్టు కేసు గానీ నమోదు కాలేదు.

దేవనారాయణ్ను విష్ణుమూర్తి అవతారంగా ఇక్కడి ప్రజలు కొలుస్తారు. ఆయన పట్ల ఉన్న భక్తితో కొన్ని కఠినమైన ఆచారాలను పాటిస్తున్నారు. గ్రామంలోనే కాదు.. గ్రామ పొలిమేరల్లో కూడా మాంసం వండటం, తినడం పూర్తిగా నిషేధం. మద్యం, ఇతర వ్యసనాలకూ ఈ గ్రామంలో చోటు లేదు. ఇక్కడి ప్రజల ప్రధాన జీవనాధారం పశుపోషణ. అయినప్పటికీ, ఆవులను, గేదెలను లక్ష్మీ స్వరూపంగానే భావిస్తారు. అందుకే, పాలను విక్రయించడం కన్నా.. నెయ్యి, పెరుగుగా మార్చి, దైవకార్యాలకు, అతిథి మర్యాదలకే ఎక్కువగా ఉపయోగిస్తారు.
ఆధునిక సాంకేతికత పెరిగిపోతున్న ఈ రోజుల్లో, పర్యావరణానికి హాని చేయకుండా, తమ పూర్వికుల సంస్కృతిని కాపాడుకుంటూ వస్తున్న దేవ్మాలి గ్రామం.. దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. ‘ఉత్తమ పర్యాటక గ్రామం’గా ఎంపికైంది. ప్రకృతితో మమేకమై ఎలా జీవించవచ్చో నేర్పే ఒక అద్భుతమైన ఎకో-టూరిజం కేంద్రంగా విలసిల్లుతున్నది. అందుకే, ఏటా వందల సంఖ్యలో పర్యాటకులు ఈ గ్రామాన్ని సందర్శిస్తున్నారు. అసలు సిసలైన పల్లె జీవన విధానాన్ని కళ్లారా చూసి.. గుండెల్లో నిలుపుకొంటున్నారు.
దేవ్మాలి గ్రామాన్ని సందర్శించడానికి అక్టోబర్-మార్చి మధ్య కాలం అత్యంత అనువైనది. ఈ సమయంలో ఇక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. వేసవిలో వేడి ఎక్కువ. అజ్మీర్ నుంచి 60 కి.మీ. ప్రయాణిస్తే దేవ్మాలీకి చేరుకోవచ్చు. జైపూర్నుంచి 180 కి.మీ. అజ్మీర్, జైపూర్ నుంచి బస్సులు, ట్యాక్సీల్లో దేవ్మాలి చేరుకోవచ్చు.