పరస్పర దాడులు ఉధృతమైన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఒక నల్ల శవపేటికలో పడుకోబెట్టిన భారీ హోర్డింగ్ ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని ప్రధాన ఎంగెలాబ్ స్కేర్‌లో వెలిసింది. కళ్లు మూసుకుని, జుట్టు చెదిరిపోయి పడుకుని ఉన్న ట్రంప్‌ను చూపిస్తున్న ఆ బిల్‌బోర్డుపై మేము ట్రంప్‌ను చంపుతాము అన్న వాక్యాలు రాసి ఉన్నాయి. ఇరాన్ తనపై హత్యాయత్నం చేసే అవకాశం ఉందని ట్రంప్ ప్రకటించిన కొద్ది రోజులకే ఈ బిల్‌బోర్డు ఏర్పాటు కావడం గమనార్హం.
మాజీ సుప్రీం నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని ప్రభుత్వానికి సన్నిహితులైన ఇరాన్ పిడివాదులు పిలుపునిస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. యుద్ధం ప్రారంభమైన మొదటిరోజే మరణించిన ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమాలు వారం రోజులపాటు కొనసాగాయి. ఈ సమయంలో అమెరికాపై ప్రజల్లో పేరుకుపోయిన ఆగ్రహం స్పష్టంగా కనిపించింది.