అతనో సాధారణ టైలర్. ఏ ముహూర్తాన బిస్కెట్ల తయారీలోకి అడుగుపెట్టాడో.. వందేళ్లయినా ఆ బిస్కెట్స్ ప్రపంచాన్ని ఏలేస్తూనే ఉన్నాయి. మన చిన్ననాటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నాయి. ‘పార్లే జీ’ బిస్కెట్లు తినని భారతీయుడు ఉండడేమో! సంపన్నులు, పేదవారు, పిల్లలు, వృద్ధులు అనే తేడా లేదు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా ‘పార్లే జీ’ రుచి చూసినవారే. అలాంటి బిస్కెట్ల రుచిని మనకు చూపించింది.. ఒక మామూలు టైలర్.
పేదరికంలో ఉన్నా, ఉద్యోగం చేస్తున్నా, ఏం చేస్తున్నా.. వ్యాపారం అనేది గుజరాతీల డీఎన్ఏలోనే ఉంటుందేమో! మోహన్ లాల్ దయాళ్ చౌహాన్ కూడా ఇందుకు అతీతుడేమీ కాదు. అయితే, ఈ పేరు ఎక్కువగా విని ఉండకపోవచ్చు. కానీ, ఇతను తయారుచేసిన ‘పార్లె జీ’ బిస్కెట్ పేరు వినని, దాని రుచి చూడని వారు ఉండరు. దక్షిణ గుజరాత్‌లోని వల్సాడ అనే పట్టణంలో జన్మించాడు దయాళ్ చౌహాన్. ఇంట్లో ఏవేవో సమస్యలతో.. 12 ఏళ్ల వయసులో ఇంటి నుంచి ముంబయికి పారిపోయాడు. బతకడానికి చిన్న చిన్న పనులెన్నో చేశాడు. మరోవైపు టైలరింగ్ కూడా నేర్చుకున్నాడు. 18 ఏళ్ల వయసులో ముంబయిలోని గాందేవి అనే ప్రాంతంలో సొంతంగా ఓ టైలరింగ్ షాప్ పెట్టాడు. టైలరింగ్‌లో కొంత సంపాదించిన తరువాత అతని బుర్రను ‘వ్యాపారం’ తొలచసాగింది.
దాంతో కామ్‌దేవి ప్రాంతంలో కిరాణా షాప్ తెరిచాడు. తరువాత దాన్ని స్వీట్ షాప్‌గా మార్చాడు.1920-30 ప్రాంతంలో మనదేశంలో బ్రిటిష్‌వాళ్లు టీతో పాటుగా బ్రిటన్ నుంచి వచ్చిన బిస్కెట్స్‌ను తినేవారు. అవి చాలా ఖరీదైనవి. మహారాజులు, సంపన్నులు కూడా వాటిని తెప్పించుకొని తినేవారు. ఆ రోజుల్లో సామాన్య భారతీయులకు బిస్కెట్స్ తినడం ఒక కల మాత్రమే. అప్పట్లో బిస్కెట్స్ తయారీలో గుడ్లను ఉపయోగించేవారు. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా తొలుత ‘హిందూ బిస్కెట్స్’ వచ్చాయి. పూర్తిగా శాఖాహారులు మాత్రమే ఈ బిస్కెట్స్ తయారీలో పాలుపంచుకున్నారని ప్రకటన కూడా ఇచ్చారు. కొద్ది కాలానికే హిందూ బిస్కెట్స్.. బ్రిటానియాలో విలీనమైంది.
స్వదేశీ ఉద్యమంలో భాగంగా 1929లో తొలుత మోహన్‌లాల్ దయాళ్.. టాఫీ తయారు చేశారు. ముంబయి శివారులోని విలే పార్లే అనే ప్రాంతంలో ఒక మూతపడిన ఫ్యాక్టరీ ఉంటే.. మోహన్ లాల్ దానిని కొనుగోలు చేశారు. రూ.60 వేల పెట్టుబడితో తినుబండారాల తయారీ కంపెనీని ప్రారంభించారు. ఇందులో మొదట 12 మంది సిబ్బంది మాత్రమే ఉండేవారు. వీరంతా మోహన్ లాల్ కుటుంబ సభ్యులే. జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్న యంత్రాలతో మొదట మిఠాయిలు, ఆరెంజ్ క్యాండీలు తయారు చేశారు. 1938లో పార్లే గ్లూకో బిస్కట్స్ తయారు చేశారు. ధర తక్కువ, రుచి ఎక్కువ కావడం వల్ల తొందరలోనే జనంలోకి వెళ్లిపోయాయి. స్వదేశీ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న కాలంలో స్వదేశంలో తయారైన ‘పార్లే బిస్కెట్స్’.. ప్రజలు ఎక్కువగా ఆదరించారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో భారతీయ బ్రిటిష్ సైన్యానికి ఈ బిస్కెట్స్ సరఫరా చేసేవారు. ఆ సమయంలో మరింత బాగా ఆదరణ పొందాయి. పార్లే బిస్కెట్స్ తయారీలో ప్రధానంగా గోధుమ పిండి, పాలు, చక్కెర ఉపయోగిస్తారు. అయితే, 1947 దేశ విభజన సమయంలో దేశంలో గోధుమలకు కొరత ఏర్పడింది. దాంతో కొంతకాలం ‘బార్లీ’తో బిస్కెట్స్ తయారు చేశారు. వాటి రుచికూడా అందరికీ నచ్చడంతో.. 1960 నాటికి దేశంలో నంబర్ వన్‌గా నిలిచాయి. అయితే, అప్పటి వరకు ఈ బిస్కెట్స్‌కు ఓ పేరు లేదు. బ్రాండూ లేదు. గ్లూకోజ్ బిస్కెట్స్ అనే అమ్మేవారు. బిస్కెట్ కంపెనీ ఉన్న ‘విలే పార్లే’ ప్రాంతం పేరుతోనే ‘పార్లే’ అని ఖరారు చేశారు.
ప్రస్తుతం పార్లే జీ వార్షిక ఆదాయం రూ.16,202 కోట్లు. అంటే ఈ బిస్కెట్ ప్రజల్లో ఎంత బలంగా వ్యాపించిందో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడుపోయే బిస్కెట్స్‌గా పేరు సాధించింది. మన దేశ బిస్కెట్ల మార్కెట్లో 40 శాతం వాటా ఈ సంస్థదే. చైనాలో కూడా అత్యధికంగా అమ్ముడుపోయే బిస్కెట్ పార్లే జీనే. మొదట్లో ‘పార్లే బిస్కెట్’లోని ‘జీ’ అంటే.. గ్లూకోస్ అని అర్థం ఉండేది. ఆ తరువాత రీ బ్రాండింగ్‌లో భాగంగా ‘జీ’ అంటే ‘జీనియస్’ అని ప్రచారం చేశారు. యూరప్, అమెరికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా లాంటి దేశాల్లో సైతం ‘పార్లే జీ’ బాగా అమ్ముడవుతున్నది. కొన్ని దేశాల్లో తయారీ ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి. 1982లో ‘పార్లే’ తొలిసారిగా టీవీలో ప్రచారం ప్రారంభించింది. 1998లో దూరదర్శన్‌లో వచ్చిన ‘శక్తి మాన్’ అప్పటి పిల్లలను ఉర్రూతలూగించింది.
దాంతో, శక్తిమాన్తో పార్లే బిస్కెట్స్‌కు ప్రచారం చేయించారు.మొదట్లో ‘గ్లూకోజ్ బిస్కట్స్’ అని పేరు ఉన్నప్పుడు దీనిని పోలిన నకిలీలు అనేకం వచ్చేవి. ఆ సమస్యను ఎదుర్కోవడానికి 1980లో చిన్నపిల్ల బొమ్మతో బ్రాండ్‌ను బాగా ప్రచారంలోకి తీసుకువచ్చారు. ఇప్పటికీ అదే బొమ్మ వాడుతున్నారు. అయితే, ఆ బొమ్మలో ఉన్న అమ్మాయి ఎవరనే విషయంపై బోలెడు చర్చ జరిగింది. కానీ, ఆ బొమ్మ చిత్రకారుడు ఊహించి వేసిందే! మరో విశేషం ఏమిటంటే.. పాతికేళ్ల నుంచి ‘పార్లే జీ’ బిస్కట్ ప్యాకెట్ ధర పెరగక పోవడం. గతంలో ఒకసారి 50 పైసలు పెంచితే.. ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. దాంతో ధరను అలానే ఉంచుతున్నారు. క్వాంటిటీని తగ్గించారు. ఒక సాధారణ టైలర్‌గా జీవితాన్ని ప్రారంభించి.. బ్రిటిష్ కాలంలోనే బిస్కెట్స్ తయారీని ప్రారంభించి.. ప్రపంచంలోనే నంబర్ వన్ బ్రాండ్‌గా నిలవడం అంటే మాములు విషయం కాదు. సంకల్పం ఉంటే దేనినైనా సాధించవచ్చు అని మోహన్‌లాల్ జీవితం నిరూపిస్తుంది.
-బుద్దా మురళి
98499 98087