మానవ జీవితం ఒక యాత్రాస్మృతి అంటారు. దాశరథి తన జీవితానుభవాలకు పెట్టుకున్న పేరు అదే. ఆ ‘యాత్రాస్మృతి’లో ఆయన ఎన్నో తీపి, చేదు అనుభవాలను పంచుకున్నారు. మహామహులతో స్నేహం చేసిన దాశరథి.. సామాన్యులతోనూ స్నేహశీలిగా మెలిగిన నిగర్వి. మృత్యువుకు భయపడని సాహసి. ఇవే దాశరథి సాహితీ కీర్తి కిరీటంలోని కలికితురాయిలు. బాల్యం, యవ్వనం, వృద్ధాప్యంలో ఆయన ప్రయాణాలు ఎంతో అద్భుతమైనవి. ఆ అనుభవాలు ఇప్పటితరానికీ స్ఫూర్తినిచ్చేవి. ఆ కవి హృదయం చదివి చలించండి.
వరంగల్లు జైలులో ఉన్న దాశరథిని, మరికొంతమంది ఖైదీలను బట్టలు సర్దుకోవాలని జైలు అధికారులు ఆదేశించారు. అంతకుముందు వట్టికోట ఆళ్వారుస్వామి, కాళోజీతోపాటు మరికొందరిని ఇలాగే సర్దుకోమని చెప్పి వరంగల్లు జైలు నుంచి బయటకు తీసుకుపోయారు. వాళ్లను ఎక్కడికి తీసుకుపోయారో? ఏమి చేశారో ఖైదీలకు తెలియదు. ఇప్పుడు వీళ్ల వంతు వచ్చింది. ఖైదీలు పెట్టేబేడా సర్దుకున్నారు.
ఖైదీలను ఒక జైలు నుంచి మరో జైలుకు మార్చడం నిజాం నిరంకుశ పాలనలో ఓ విధానంగా ఉండేది. అందువల్ల ఆనాడు దాశరథితోపాటు మరెందరో స్వాతంత్య్ర సమరయోధులు, నిజాం వ్యతిరేకులను తరచుగా జైళ్లు మారుస్తూ హింసించేవాళ్లు.

ముప్పై మంది ఖైదీలు పెట్టేబేడా సర్దుకున్నారు. కొంతమంది మాత్రం తమను విడుదల చేస్తారని ఆశతో ఉన్నారు. చివరికి జైలు బయట వాళ్ల కోసం సిద్ధంగా ఉన్న రెండు పోలీసు వాహనాల్లో ఎక్కించారు. కొందరి ఆశలు నిరాశలయ్యాయి. ఆ ఖైదీలను ఆ బండ్లు ఎక్కమన్నారు. ‘నాజీలు యూదులను చంపినట్టు నిజాం ప్రభుత్వం తమను చంపేస్తుందేమో’నని కొంతమంది ఖైదీలు భయపడ్డారు. ఖైదీకి ఇద్దరు చొప్పున సాయుధ పోలీసులు ఉన్నారు.
‘బతకడానికి ఉద్యమంలో దూకలేదు. కాబట్టి చావుకు సిద్ధంగా ఉందాం. భారతమాత పాదాలను మన రక్త పద్మాలతో ఈ రాత్రి పూజ చేద్దాం. పదిమందితో చావు.. పెండ్లితో సమానమని దాశరథి వాళ్లందరితో గర్వంగా చెప్పాడు. చలిగాలి గిలిగింతలు పెడుతుంటే చావు మాటలెందుకు?’ అంటూ దాశరథి భయపడే వారికి దైర్యం నూరిపోశాడు.
పోలీసులు బాయ్నెట్లకు ఉన్న తొడుగులను తొలగించి, తుపాకులు బిగిస్తున్నారు. ఖైదీల్లో భయం పెరిగిపోతున్నది. దాశరథి మాత్రం చలిగాలిని ఆస్వాదిస్తున్నాడు.
‘ఆ తుపాకులను గుంజుకుని వాళ్లనే చంపుదాం’ అంటూ ఒక విప్లవవాది అన్నాడు.
‘పోలీసులు వింటే ఇప్పుడే చంపుతారు’ అని మరో ఖైదీ భయంగా అన్నాడు. ఇంతలో కాజీపేట రైల్వే స్టేషన్‌కి ఆ వాహనం చేరుకుంది. ఖైదీలందరినీ పోలీసులు కిందికి దింపారు. వాళ్లను సికింద్రాబాదు పోయే రైలు ఎక్కిస్తున్నారు.
‘వందేమాతరం’ అంటూ ఓ ఖైదీ నినదించాడు. మిగతా ఖైదీలూ ‘వందేమాతరం’ అన్నారు. ఆ నినాదాలు విన్న జనం ఉద్యమకారుల్ని చంపడానికి పోలీసులు తీసుకుపోతున్నారని అనుకున్నారు. కొంతమంది ప్రయాణికులు వాళ్లను విడిచిపెట్టాలని నినాదాలు చేస్తూ పోలీసులకు అడ్డు తగిలారు.
‘మీరు అరిస్తే ఇప్పుడే కాల్చి చంపుతాం’ అంటూ పోలీసు అధికారి కోపంతో అరిచాడు. ఆ మాటకు అందరూ మిన్నకుండిపోయారు.
రైలు కదిలింది. కిటికీల్లోంచి చల్లని గాలి వస్తున్నది. ఆ చలిగాలి చెలి కౌగిలిలా ఉందని దాశరథి మైమరచిపోతూ పద్యం అందుకున్నాడు.
చలిగాలి పీల్చె చెలి కౌ గిలిలో శయనించినట్లు కేవలం భావో జ్జల వీధుల పయనించగ విలపించగనేల? భీతి విడువుము మిత్రా! ఆ జైలు నుంచి బయటపడి కాసేపైనా స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామని కొంతమంది సంతోషంగా ఉన్నారు. వాళ్లలో దాశరథి ఒకడు. ఆ స్వేచ్ఛా వాయువులు పీలుస్తూ పద్యాలు వదులుతున్నాడు. చలిగాలి పదంతో ప్రారంభించి కంద పద్యాలు ఓ ఇరవై వరకు జైలు మిత్రుడు గెల్లా కేశవరావుతో ఆశువుగా చెప్పాడు.

చావబోతుంటే ఈ పద్యాలేమిటి?’ అని తోటి ఖైదీ విసుక్కున్నాడట. ఆ గోలను ఆపడానికి ‘ఖామూష్’ అంటూ పోలీసు అధికారి హెచ్చరించాడు. అంతా నిశ్శబ్దం.
రైలు వేగం పుంజుకున్నది. అలసిన ఖైదీలు నిద్రలోకి జారుకుంటున్నారు. నిద్రముంచుకొస్తున్న దాశరథి మదిలో ఓ ప్రేయసి మెదిలింది. పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. ఊళ్లో పొద్దునే యేటికి పోయి, స్నానం చేసిన తర్వాత మంచినీళ్ల బిందెనెత్తుకుని పోయే చూడామణి ఆయనకు గుర్తుకొచ్చింది. తడిబట్టలతో వయ్యారంగా నడిచే ఆమె పిరుదుల కదలిక గుర్తొచ్చి దాశరథి గుండెలు విలవిల్లాడుతున్నాయట. మరో పద్యం పలికాడు ఆ చెలికాడు.
చలిగాలి పులకు వార్తలు చెలిగాలినిబోలి వలపు చిరువెచ్చన మ్ములు గుండెలలో నింపెను చెలికాడా! జైలు బయట చిత్తమ్మలరెన్!
‘చూడామణి’ని ఇక చూస్తానా? అన్న సందేహం వచ్చింది దాశరథికి. తడిసిన పలుచని చీరలోంచి కనిపించే వక్షోజాలు మళ్లీ కనిపిస్తాయో? లేదో? అని సందేహిస్తున్నాడు. ఆమె కోసం పద్యాలు ఆలపిస్తున్నాడు. దాశరథిని మిత్రుడు గెల్లా కేశవరావు ఓదార్చుతూ దగ్గరకు తీసుకున్నాడు. దాశరథి భుజం మీద తాళం వేస్తూ ఉన్నాడు. దాశరథి నిద్రలోకి జారుకున్నాడు.
దాశరథి ఊరికి చేరాడు. ఆ ఊరిలో చూడామణిని చూడకుండా ఉండలేకపోయాడు. ప్రతిరోజూ పొద్దున ఆమె స్నానం చేసే ఏటి ఒడ్డుకు చేరాడు. ఆమె స్నానం చేసి తడిబట్టలతో ఉంది. నెత్తిమీద బిందెతో ఏటి ఒడ్డుకు చేరింది. దాశరథి ఆమెకు ఎదురుపడ్డాడు. పలుకరించుకున్నాక ఇద్దరూ పెండ్లి ముచ్చట్లు మొదలుపెట్టారు. ‘మా నాన్నను ఒప్పించి నిన్ను పెండ్లి చేసుకుంటాను’ అని చూడామణి తడి చేతిని దాశరథి పొడి చేతిలో వేసి ప్రమాణం చేసింది. దాశరథి హృదయంలో ప్రేమ ఉప్పొంగిపోతున్నది.
ఆ ప్రేమ పారవశ్యంలో ‘చూడామణీ’ అంటూ దాశరథి గట్టిగా అరిచాడు.
‘చూడామణి కాదు. సికింద్రాబాద్’ అన్నాడు గెల్లా కేశవరావు. అప్పటిదాకా చూడామణి చెప్పినవన్నీ ఉత్త మాటలేనని దాశరథికి అర్థమైంది. ఆ కల నిజమైతే ఎంతబాగుండు అనుకుంటున్నాడు. ఇంతలో పోలీసులు రైలు దింపి, సికింద్రాబాద్ జైలుకు తీసుకుపోయారు.

సుప్రసిద్ధ ఉర్దూ కవి మఖ్దుం మొహియుద్దీన్ అధ్యక్షతన 6 మే 1961న నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అఖిల భారత ఉర్దూ కవి సమ్మేళనం నిర్వహించారు. ఆ సమ్మేళనంలో సన్మానం స్వీకరించేందుకు దాశరథి బయలుదేరాడు. ఓ రిక్షా ఆపి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కి రమ్మన్నాడు. ‘అక్కడికి ఎందుకుపోతున్నారు?’ అని రిక్షావాలా యూసుఫ్ అడిగితే.. ‘కవి సమ్మేళనానికి’ అని దాశరథి సమాధానం చెప్పాడు. ఆ రిక్షావాలా మరింత ఆసక్తిగా.. ‘కవిత్వం వినడానికా? కవిత్వం చదవడానికా?’ అనడిగాడు. అందుకు దాశరథి ‘వినడానికీ కాదు. చదవడానికీ కాదు. నేను కవిని.
సన్మానం స్వీకరించడానికి’ అన్నాడట. ‘అవునా..’ అంటూ ఆశ్చర్యపోయిన రిక్షావాలా ‘నేనూ కవినే’ అంటూ దాశరథితో అన్నాడు. అప్పుడు దాశరథి ఆశ్చర్యపోయి ‘రిక్షా రోకో’ అన్నాడట. రిక్షా ఆగింది. దాశరథి ఆ రిక్షా దిగాడు. రిక్షావాలాకి ఏమీ అర్థం కాలేదు. రిక్షావాలానీ కిందికి దిగమన్నాడట దాశరథి. ‘ఒక కవి రిక్షా తొక్కుతుంటే.. అందులో కూర్చోవడం తప్పని దాశరథి భావన. ఆ కవిని గౌరవిస్తూ రిక్షాలో కూర్చోబెట్టి తాను రిక్షా తొక్కుతానన్నాడట. ఆ గౌరవానికి రిక్షావాలా సంతోషించాడు. కానీ, దాశరథి సారథిగా ఉండటాన్ని రిక్షావాలా సందేహించాడు. దాశరథికి రిక్షా తొక్కడం అలవాటు లేదు. పొరపాటు జరిగితే ఇద్దరమూ ప్రమాదం ఎదుర్కొంటామని రిక్షావాలా భయం. ఆయన సందేహమూ సరైనదేనని దాశరథి గుర్తించాడు. రిక్షావాలా విన్నపాన్ని మన్నించి మళ్లీ రిక్షాలో కూర్చున్నాడు.
రిక్షావాలా సభా ప్రాంగణానికి రిక్షా తోలాడు. బాలీవుడ్ సినిమా కవి షకీల్ బదాయునీ, హస్రత్ జైపురీ, రాజ్ ఆలంబాద్లాంటి దేశంలోని ప్రముఖ ఉర్దూ కవులు ముషాయిరాకు వచ్చారు. మఖ్దుం మొహియుద్దీన్ అధ్యక్షత వహించాడు. దాశరథి వేదికపై కూర్చుని ఉండగా ఆ ముషాయిరాలో రిక్షావాలా కూడా కవిత్వం చదివాడు. అతని కవితకు మెచ్చి దాశరథి దగ్గరకు పిలిచి, ప్రశంసించాడు. యూసుఫ్ సంతోషించాడు. సుప్రసిద్ధ కవులతో స్నేహం, సాహచర్యం ఉన్న దాశరథి ఒక సామాన్యుడితో, యువకవి పట్ల ఎంతటి గౌరవం, వాత్సల్యం ప్రదర్శించాడు. ఆయన వ్యక్తిత్వానికి ఇదో మచ్చుతునక. మహిమాన్వితుడు కాని వాడు మహాత్ముడు కాలేడని ఆంధ్ర సారస్వత పరిషత్తు మహాసభల్లో సర్వేపల్లి రాధాకృష్ణన్ అన్నారు. దాశరథి మహిమాన్వితుడు అయ్యాడు కాబట్టే మహాత్ముడిగా నేటికీ గౌరవం అందుకుంటున్నాడు.